అనుష్కను కాటేసిన స్త్రీ విద్వేషం : కంగనా రనౌత్
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మపై లెజెండ్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదమయ్యాయి. తాను అనుష్కను పల్లెత్తు మాట అనలేదని గవాస్కర్ మొత్తుకుంటున్నప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఈ నేపథ్యంలో గవాస్కర్ వ్యాఖ్యలపై ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ స్పందించారు. గతంలో తాను కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఎదుర్కొన్నానని, కానీ అప్పుడు అనుష్క శర్మ స్పందించకుండా మౌనంగా ఉందన్నారు. కానీ ఇప్పుడు నేను ముందుకొచ్చి సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాను అంటూ కంగనా ట్వీట్ చేశారు.
'గతంలో నన్ను బెదిరిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నన్ను మోసగత్తె అన్నారు. ఇవాళ అదే తరహా స్త్రీ విద్వేషం అనుష్కను కాటేసింది. క్రికెట్ వ్యవహారాల్లోకి ఆమెను సునీల్ గవాస్కర్ లాగారన్న విషయాన్ని నేను ఖండిస్తున్నాను' అంటూ కంగనా రనౌత్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
మరోవైపు, కేవలం పైశాచిక ప్రవృత్తి ఉన్నవాళ్లే సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలకు అసభ్యతను ఆపాదిస్తారని కంగనా వివరించారు. గవాస్కర్ తన వ్యాఖ్యల్లో అనుష్క గురించి ప్రస్తావించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
కాగా అనుష్క శర్మ తన కొత్త ప్రాజెక్టు మూవీలో క్రికెటర్‌గా నటిస్తోందని, పైగా ఆమె తన భర్తతో ప్రాక్టీసు చేస్తున్న పలు వీడియోలు కూడా ఉన్నాయని కంగనా రనౌత్ చెప్పుకొచ్చారు.