సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : బుధవారం, 20 మార్చి 2019 (12:05 IST)

'కలెక్షన్ కింగ్' బర్త్‌డే : ఒకరు భారీ విరాళమిస్తే.. మరొకరు దత్తత తీసుకున్నారు

మంచు వారి కుటుంబసభ్యులు సామాజిక శ్రేయస్సు కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటూ ఉంటారు. అయితే ఈసారి హీరో మంచు విష్ణు కోటి రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు. తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా తిరుపతిలోని రుయా హాస్పిటల్‌లో వివిధ వసతుల రూపకల్పన కోసం రూ. కోటి విరాళమిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు.
 
రుయా హాస్పిటల్‌లో అత్యాధునిక సౌకర్యాలతో పీడియాట్రిక్ విభాగంలో నియోనాటల్ ఐసీయూ, మెడికల్ ఐసీయూ, ఎమర్జీన్సీ, ఓపిడి బ్లాక్స్ నిర్మించనున్నట్లు తెలిపారు. వచ్చే మూడు సంవత్సరాలలో విడతలవారీగా ఈ సొమ్మును అందజేయనున్నట్లు తెలిపిన విష్ణు... మంగళవారం తన తండ్రి, విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు పుట్టినరోజున మొదటి చెక్కును ఆసుపత్రి సిబ్బందికి అందజేసారు. 
 
ఇక మంచు వారి మరో అబ్బాయి మనోజ్ తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా సిరిసిల్లకు చెందిన అశ్విత అనే బాలికను దత్తత తీసుకుని, ఆమె చదువు, సంరక్షణ బాధ్యతలు చూసుకుంటూ ఐఏఎస్ కావాలనే ఆ అమ్మాయి కోరికను నెరవేరుస్తానని మాట ఇచ్చారు. తిరుపతిలోని తమ విద్యాసంస్థ శ్రీ విద్యానికేతన్‌లో చదివించే ఏర్పాట్లు చేసారు.
 
ఈ విధంగా మంచి విష్ణు తమ తండ్రి జన్మదినాన్ని పురస్కరించుకుని ఒకరు ఆరోగ్యానికి సంబంధించి కోటి రూపాయలు ప్రకటించగా, మనోజ్ ఒక పేద బాలికను దత్తత తీసుకుని చదివించడంపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.