పవన్ కల్యాణ్ తో మనోజ్ భేటీ - అన్నకు రాయబారిగా మారాడా!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మోహన్‌బాబు, మంచు విష్ణులు ప్రకాష్‌రాజ్ పేనల్ సభ్యుల్ని తిట్టారని వారు విమర్శించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మోహన్‌బాబును మంచు మనోజ్ కంట్రోల్ చేశారనీ, విష్ణునుకూడా ఆయనే నియంత్రించారని ప్రకాష్‌రాజ్ పేనల్ సభ్యులు ప్రశంసించారు. మనోజ్ నువ్వు చల్లగా వుండాలయ్యా! అంటూ ఉత్తేజ్, బెనర్జీ వంటివారు మాట్లాడారు. మనోజే లేకపోతే అక్కడ వేరేరకంగా వుండేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆ గొడవలు తర్వాత రాజీనామాలు జరిగాయి. కానీ మంచు ఫ్యామిలీ వాటిపై ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. కానీ మనోజ్‌ను రాయబారిగా నడిపిస్తున్నారనే విషయం వినిపిస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్‌ను మనోజ్ కలవడం ఆసక్తికరంగా మారింది.
భీమ్లా నాయక్ పాత్రధారి పవన్ కల్యాణ్ తో మంచు మనోజ్ గురువారం సాయంత్రం హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఇందుకు భీమ్లా నాయక్ షూటింగ్ స్పాట్ వేదికైంది. స్వతహాగా శ్రీ పవన్ కల్యాణ్ గారంటే శ్రీ మంచు మనోజ్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. అలాగే శ్రీ మనోజ్ పట్ల శ్రీ పవన్ కల్యాణ్ ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు. వీరిద్దరూ సుమారు గంటకుపైగా పలు విషయాలపై చర్చించుకున్నారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చోటు చేసుకున్న పరిణామాలతోపాటు తాజా చిత్రాల ప్రస్తావన వచ్చింది. ఈ విషయాన్ని పవన్ ప్రతినిధి తెలియజేశారు. సో. `మా` గురించి విషయాలు ప్రధానంగా చర్చకు వచ్చాయనేది అర్థమైంది. మంచు విష్ణు `మా` అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాక జరిగిన విషయం కాబట్టి హాట్ టాపిక్‌గా మారింది.