శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 28 జూన్ 2022 (09:15 IST)

నాలుగు దశాబ్దాల నాటి స్మృతులు గుర్తుకువచ్చాయి - కె. రాఘవేంద్రరావు

NTR vigraham, tenali, K. Raghavendra Rao
NTR vigraham, tenali, K. Raghavendra Rao
అన్న ఎన్టీఆర్ నిర్మించిన ధియేటర్లో నేను 1979లో దర్శకత్వం వహించగా ఆయన నటించిన వేటగాడు చిత్రాన్ని తిలకించడం నాలుగు దశాబ్దాల నాటి స్మృతులు, అన్నగారితో గడిపిన మధురక్షణాలు గుర్తుకు వచ్చాయని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. స్థానిక పెమ్మసాని ధియేటర్లో సోమవారం ఉదయం ఆయన విలేకర్లతో కొద్దిసేపు మాట్లాడారు. ఎన్టీఆర్ చలనచిత్ర శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఆయన నటించిన ఒక చిత్రాన్ని ప్రతిరోజూ ఉచితంగా ప్రదర్శిస్తున్న నేపథ్యంలో సోమవారం ప్రదర్శించిన వేటగాడు చిత్రాని ఆ చిత్ర దర్శకుడు రాఘవేంద్రరావు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, సినీ మాటల రచయిత డాక్టర్ సాయి మాధవ్ బుర్రా ప్రభృతులతో కలసి కొద్దిసేపు తిలకించి అనంతరం విలేకర్లతో మాట్లాడారు. 
 
రాఘవేంద్రరావు మాట్లాడుతూ ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని నమ్మి ముందుకు నడిచిన నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ శత జయంతి జరుపుకుంటున్నాము. మరో వందేళ్ళు గడిచినా ప్రజల హృదయాలలో ఆయన స్థానం చెక్కుచెదరదు. ఉదయం 8 గంటలకు 40 ఏళ్ళనాడు తీసిన వేటగాడు చిత్రాన్ని ప్రదర్శిస్తుండగా జోరున వర్షం కురుస్తున్నప్పటికీ హొస్టఫుల్ అయిందంటే అది అన్నగారి గొప్పతనం. అందుకే ఆయన యుగపురుషుడు అని కొనియాడారు రాఘవేంద్రరావు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు తెనాలిలో జరగడానికి తొలి అడుగు బాలయ్య వేస్తే ఆ మార్గం రాఘవేంద్రరావు రాకతో మరింత సుగమమైందని, అన్నగారి చిత్రాలను చూడటానికి ప్రతిరోజు పలు గ్రామాల నుండి, గుంటూరు, విజయవాడ నుండి కూడా అభిమానులు వస్తున్నారంటే అది ఆయనపై వారికున్న భక్తిని తెలియజేస్తుందని అన్నారు. 
 
సినీ మాటల రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ ఒకప్పుడు ఇదే ధియేటర్లో రాఘవేంద్రరావుగారు దర్శకత్వం వహించిన సూపర్ స్టార్. కృష్ణ నటించిన అగ్నిపర్వతం చిత్రాన్ని చూస్తూ జిందాబాద్ ఎన్టీఆర్, జిందాబాద్ జస్టిస్ చౌదరి, జిందాబాద్. కొండవీటి సింహ అంటూ బిగ్గరగా కేకలు వేస్తే కృష్ణ అభిమానులు నొచ్చుకుని తనను చితకబాదారని, నేడు అదే ధియేటర్లో రాఘవేంద్రరావుగారితో కలిసి ఎన్టీఆర్ సినిమాను చూడటం జీవితం ధన్యమైందని, ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెమ్మసాని థియేటర్ నిర్వాహకుడు పెమ్మసాని పోతురాజు, చెరుకుమల్లి సింగా, కొమ్మినేని వెంకటేశ్వరరావు ప్రభృతులు పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి రాఘవేంద్రరావు పూలమాల వేశారు. రాఘవేంద్రరావు బొమ్మలతో ధియేటర్ ముందు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ప్లెక్సీల ముందు రాఘవేంద్రరావు నిలబడి ఫోటోలు దిగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.