శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 అక్టోబరు 2022 (10:02 IST)

ఆరేళ్ల క్రితమే నయనతార - విఘ్నేష్ రిజిస్టర్ మ్యారేజ్! అద్దెగర్భం వివాదానికి ఫుల్‌స్టాప్!

Vignesh Shivan-Nayanthara
అగ్ర నటి నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్‌లు అద్దెగర్భం విషయంలో తమపై వచ్చిన వివాదానికి ఫుల్‌స్టాఫ్ పెట్టినట్టు సమాచారం. వీరిద్దరూ ఆరేళ్ల క్రితమే రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారని, గత యేడాది డిసెంబరు నెలలో సరోగసీ (అద్దెగర్భం) విధానం ద్వారా పిల్లలుకనేందుకు నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో తమ పేర్లను నమోదు చేసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు వారు పక్కా ఆధారాలను తమిళనాడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఎం.సుబ్రమణ్యం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీకి సమర్పించినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
గత జూన్ 9వ తేదీన నిబంధనలకు విరుద్ధంగా వారు సరోగసీ విధానంలో జంట పిల్లలకు తల్లిదండ్రులు కావడంపై దుమారం రేగింది. దీనిపై లోతుగా దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మెడికల్‌ అడిషినల్‌ డైరెక్టర్‌ సారథ్యంలో ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయగా, ఈ కమిటీ విచారణ కూడా చేపట్టింది. ఈ కమిటీ వద్ద నయనతార తన సరోగసీ విధానికి సంబంధించిన పూర్తి ఆధారాలను సమర్పించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. 
 
ముఖ్యంగా, తాము ఆరేళ్ళ క్రితమే రిజిస్టర్‌ వివాహం చేసుకున్నట్లుగా ధ్రువీకరించే సర్టిఫికెట్లను నయనతార ఆ కమిటీకి అందించినట్లు సమాచారం. అదేవిధంగా గత డిసెంబరులో అద్దెగర్భం కోసం రిజిస్టర్‌ చేసుకుని ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను విచారణ కమిటీకి వారు సమర్పించినట్టు తెలిసింది. 
 
ఇదిలావుంటే, సరోగసీ విధానం ద్వారా తల్లిదండ్రులు కావాలంటే వివాహమై ఐదేళ్ళు పూర్తి కావాల్సివుంది. భార్య వయస్సు 25 నుంచి 50 యేళ్ళలోపు, భర్త వయస్సు 26 నుంచి 55 యేళ్ళలోపు ఉండాలన్న నిబంధనలు ఉన్నాయి. 
 
నయనతార ఆరేళ్ళ క్రితమే రిజిస్టర్‌ వివాహం చేసుకోవడం వల్ల ఆమె ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని విచారణ కమిటీకి ఆధారాలు సమర్పించినట్టు సమాచారం. నయనతార దంపతులు గత జూన్‌ 9వ తేదీన వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.