సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 అక్టోబరు 2024 (07:44 IST)

జానీ మాస్టర్‌కు షాకిచ్చిన "పుష్ప-2" చిత్ర నిర్మాతలు!

Jani Master
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు పుష్ప-2 చిత్ర నిర్మాతలు తేరుకోలేని షాకిచ్చారు. పుష్ప-2 చిత్రం నుంచి జానీ మాస్టర్ నుంచి తొలగించారు. ఆయన స్థానంలో మరో నృత్యదర్శకుడుని ఎంపిక చేసినట్టు వెల్లడించారు. అల్లు అర్జున్ - సుకుమార్ కలయికలో రూపొందుతున్న నాలుగో చిత్రం పుష్ప-2. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. డిసెంబరు 5వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు, డిసెంబరు 4వ తేదీన ఓవర్సీస్ ప్రీమియర్స్ వేస్తున్నట్లుగా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మాతలు వెల్లడించారు. 
 
దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన రెండు పాటలు ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేశారు. అవి ఎంత పాపులారిటీని పొందాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే గతంలో 'పుష్ప: ది రైజ్'లో "ఊ అంటావా... మామ... ఊ ఊ అంటావా మామ..." అనే ప్రత్యేక గీతం ఎంత పాపులర్ అయ్యిందో అందిరికి తెలిసిందే. ఈ పాటలో సమంత డ్యాన్స్ మూమెంట్స్‌కు అందరూ ఫిదా అయిపోయారు. కాగా "పుష్ప-2: ది రూల్"లో కూడా ఓ ప్రత్యేకగీతం  తెరకెక్కించడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
 
ఈ ఐటెమ్ సాంగ్ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే గతంలో ఈ ప్రత్యేక గీతానికి జానీమాస్టర్ కొరియోగ్రఫీ చేస్తారని "పుష్ప-2" నిర్మాతలు ప్రకటించారు. అయితే ప్రస్తుతం జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల వివాదం నడుస్తున్న నేపథ్యంలో, ఆయన ఈ పాటకు కొరియోగ్రఫీ చేయడం లేదని, ఆయన స్థానంలో ఇంకో డ్యాన్స్‌మాస్టర్‌ను ఎంపిక చేసుకున్నామని నిర్మాతలు తెలియజేశారు. త్వరలోనే ఈ పాటను కూడా చిత్రీకరిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.