రియల్ చంద్రబాబును కలిసిన 'రీల్' చంద్రబాబు
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తూ, నిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో ఎన్టీఆర్‌గా, తండ్రి పాత్రలో బాలకృష్ణ నటిస్త
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తూ, నిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో ఎన్టీఆర్‌గా, తండ్రి పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రానికి దర్శకత్వం వహించిన క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని డైరెక్టు చేస్తున్నారు.
ఇందులో ఎన్టీఆర్ అల్లుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుబాటి నటించనున్నారనే వార్త కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతోంది. ఇపుడు ఈ వార్త నిజమైంది. ఈ చిత్రంలో చంద్రబాబు పాత్రలో దగ్గుబాటి రానా నటించనున్నారు.
'ఎన్టీఆర్ అని పిలవబడే మహోన్నత వ్యక్తి కథను ప్రేక్షకులు అందరికీ చెప్పడానికి మేము కలిసి వస్తున్నాం' అని బాలకృష్ణ, క్రిష్‌తో కలిసి దిగిన ఫొటోని శుక్రవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విద్యా బాలన్, కైకాల సత్యనారాయణ, ప్రకాశ్‌రాజ్, వీకే నరేశ్, జిష్షు సేన్‌గుప్తా, మురళీశర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
కాగా, ఈ చిత్రంలో అనేక మంది ప్రముఖుల పాత్రలకు పలువురు సీనియర్, యంగ్ నటీనటులను బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎంపిక చేస్తున్న విషయం తెల్సిందే. అక్కినేని నాగేశ్వర రావు పాత్రలో నాగ చైతన్య అక్కినేని ఇలా ఒక్కో పాత్రలో ఒక్కొక్క నటుడు నటిస్తున్నారు. తాజాగా చంద్రబాబు పాత్రలో రానా నటించనున్నారు.
ఈ వార్తలను నిజం చేస్తూ రియల్ చంద్రబాబును రీల్ చంద్రబాబు (దగ్గుబాటి రానా), చిత్ర దర్శకుడు క్రిష్ జాగర్లమూడిలు కలిశారు. మరొకొద్ది రోజుల్లోనే తన షూటింగ్ పార్ట్ చిత్రీకరణ ప్రారంభంకానుండడంతో బాలకృష్ణ, క్రిష్‌ను రానా మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబనాయుడుతో వీరు ముగ్గురూ భేటీ అయ్యారు. సినిమాకు సంబంధించి చంద్రబాబు పలు సూచనలు చేసినట్టు తెలిసింది.
ఇక.. ఏపీలో సినీపరిశ్రమ అభివృద్ధికి సానుకూలమైన వాతావరణం ఉందని, ప్రభుత్వం తరపున సహకారం ఉంటుందని ఆయన చెప్పారు. అందమైన సహజవనరులు, ఆకర్షణీయ సుందర దృశ్యాలతో కూడిన అనేక ప్రదేశాలు రాష్ట్రంలో ఉన్నాయని, ఇవి సినీ పరిశ్రమకు ఉపకరిస్తాయని వారితో చంద్రబాబు వ్యాఖ్యానించారు.