ఆ స్ఫూర్తితోనే రూలర్ చేసాం: బాలకృష్ణ
నేను ప్రయోగాత్మక పాత్రలు చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ఆయన బాగా నమ్మారు. మనమే ముందు అడుగు వేయాలని ఆయన నమ్మారు. అది సినిమాలైన కావచ్చు.. రాజకీయాలైన కావచ్చు. అన్నింటినీ ప్రేక్షకులు ఆదరించారు అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈ నెల 20న బాలకృష్ణ నటించిన రూలర్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా వైజాగ్‌లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుకలో బాలయ్య స్పందిస్తూ... నేను, కల్యాణ్, కె.ఎస్.రవికుమార్ కలిసి చేసిన జైసింహా సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. ఆ స్ఫూర్తితోనే రూలర్ సినిమాను చేశాం.
రూలర్ సినిమాకు మరో కథను అనుకున్నాం. కానీ అది కుదరలేదు. ఆ సమయంలో నేను పరుచూరి మురళి గారి ఫోన్ చేశాను. ఆయన దగ్గరున్న కథను వినిపించారు. నచ్చడంతో వెంటనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా, కొత్తదనం అందించాలనే ప్రయత్నాలు చేస్తుంటాను. నాకు రైతు మీద సినిమాలు చేయాలని చాలా కోరిక ఉండేది. ఓ సందర్భంలో చాలామందిని కలిశాను కూడా. ఆ కోరిక అలాగే మిగిలిపోయింది. ఈ సినిమాలో అది కొంత తీరింది.
కె.ఎస్.రవికుమార్ గారికి నాలానే సినిమా అంటే ప్రేమ. నాలుగు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేశారు. చిరంతన్ భట్‌గారితో నేను చేస్తున్న మూడో సినిమా. అద్భుతమైన సంగీతాన్ని అందించారు. రీరికార్డింగ్‌ను కూడా చక్కగా అందించి పాత్రను మరో లెవల్‌కు తీసుకెళ్లారు. కెమెరామెన్ సన్నివేశాలను అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించారు.
వేదిక, సోనాల్ చౌహాన్ చక్కగా నటించారు. పైట్ మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్, పాటలు రాసిన రామజోగయ్యగారు, భాస్కరభట్లగారికి అభినందనలు. నటీనటులైన భూమికగారు, జయసుధగారు, ప్రకాష్‌రాజ్‌గారు సహా అందరి కష్టంతోనే సినిమాను నాలుగు నెలల్లోనే పూర్తి చేశారు. తప్పకుండా సినిమా అందరినీ మెప్పించేలా ఉంటుంది అన్నారు.