సోమవారం, 25 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : ఆదివారం, 20 డిశెంబరు 2020 (13:48 IST)

హారర్ థ్రిల్లర్ "ఎస్ 5 - నో ఎగ్జిట్" టీజర్ రిలీజ్

డాన్స్ మాస్టర్ సన్నీ కోమలపాటి దర్శకుడిగా మారి రూపొందిస్తున్న సినిమా 'ఎస్ 5 - నో ఎగ్జిట్' అనేది ఈ చిత్ర క్యాప్షన్. హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి కుమార్, అలీ, నందమూరి తారకరత్న, సునీల్, ప్రిన్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై గౌతమ్ కొండెపూడి ఎస్ 5 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం ఎస్ 5, నో ఎగ్జిట్ సినిమాకు ఆకర్షణ కానుంది. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ 5, నో ఎగ్జిట్ చిత్ర బృందంతో పాటు ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, ఐరా క్రియేషన్స్ నిర్మాత ఉషా మూల్పూరి, దర్శకుడు వీఎన్ ఆదిత్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
 
నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ సినిమా ఓపెనింగ్ నా చేతుల మీదుగా జరిగింది. ఇప్పుడు టీజర్ లాంఛ్ చేస్తున్నాను. ఒక దర్శకుడు, నిర్మాత ఇలా ఉండాలి అని సన్నీ, గౌతమ్‌ను చూసినప్పుడు అనిపించింది. వాళ్లు ప్రతి విషయం డిస్కస్ చేసుకుంటూ సినిమాను అనుకున్నట్లు రూపొందించారు. ట్రైన్ సెట్ చూసి ఆశ్చర్యపోయాను. చిన్న సినిమా కదా ఇంత ఖర్చు ఎందుకు అని అడిగితే, క్వాలిటీ ఉండాలి కదా అన్నారు. ఇవాళ ఎస్ 5 టీజర్ చూస్తే ఆ క్వాలిటీ మీకు కనిపిస్తుంది. మా బావ అలీ ఈ సినిమాలో తన నటనతో ఇరగదీశాడు. సన్నీ రూపంలో మంచి దర్శకుడు ఇండస్ట్రీకి వస్తున్నాడు. గౌతమ్ తెలివైన నిర్మాతగా పేరు తెచ్చుకుంటాడు. అన్నారు.
 
నటుడు అలీ మాట్లాడుతూ, సన్నీ మంచి టైమింగ్ ఉన్న డాన్సర్. ఢీ ప్రోగ్రామ్‌లో బాగా పేరు తెచ్చుకున్నాడు. ఒక రోజు నిర్మాత గౌతమ్‌తో వచ్చి నన్ను కలిసి కథ చెప్పాడు. అప్పటికి ఇంకెవరు ఆర్టిస్ట్‌లు అనుకోలేదు. కథ నాకు బాగా నచ్చింది. మణిశర్మ సంగీతం చేస్తున్నాడని తెలిసి ఆశ్చర్యపోయా. ఆయన కథ బాగుంటే తప్ప మ్యూజిక్ చేసేందుకు ఒప్పుకోరు. అది సన్నీ, గౌతమ్ అదృష్టం. 
 
ఇండియాలో తొలిసారి రెడ్ రేంజర్ కెమెరాతో పిక్చరైజ్ చేసిన చిత్రమిది. చిన్న చిత్రానికి ఇంత క్వాలిటీ కెమెరా వాడటం గొప్ప విషయం. కథంతా ట్రైన్‌లో సాగుతుంది కాబట్టి.. ట్రైన్ బోగి సెట్ వేసి సినిమా కంప్లీట్ చేశారు. ఇంతమంది ఆర్టిస్టులతో ఒక ట్రైన్‌లో జరిగే సినిమాను సన్నీ అద్భుతంగా రూపొందించాడు అన్నారు.
 
దర్శకుడు సన్నీ మాట్లాడుతూ, ఈ సినిమా ప్రొడ్యూసర్ గౌతమ్ నా మిత్రుడు. డాన్సర్ నుంచి డాన్స్ మాస్టర్ అయ్యాం. ఇంకేముంటుంది మనం చేసేందుకు ఒక డైరెక్షన్ తప్ప అని గౌతమ్‌తో అంటే, డైరెక్షన్ చేయొచ్చుగా అన్నాడు. అలా అతని మాటతో ఈ ఎస్ 5, నో ఎగ్జిట్ కథ మొదలైంది. టైటిల్ పెట్టాక రాసిన కథ ఇది. కథ విన్నాక వెంటనే సినిమా చేద్దామన్నారు గౌతమ్. అలా ఒక నెల రోజుల్లో ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసి సెట్స్‌లోకి వెళ్లాం. సినిమా తీయాలంటే అదృష్టం ఉండాలి. మాకు అలా అన్ని కలిసి వచ్చాయి. చిన్న బడ్జెట్‌లో చేద్దామనుకున్న చిత్రమిది. సినిమా స్టార్ట్ అయ్యాక, ఆర్టిస్ట్‌లు, సెట్స్, రెడ్ రేంజర్ కెమెరా ఇలా ప్రతి ఒక్కటి పెంచుకుంటూ పోయాం. నిర్మాత ఇలా సపోర్ట్ చేశారు కాబట్టే మంచి క్వాలిటీ సినిమా వచ్చింది అన్నారు.
 
నిర్మాత గౌతమ్ కొండెపూడి మాట్లాడుతూ, మా ఎస్ 5, నో ఎగ్జిట్ సినిమా టీజర్ రిలీజ్ కార్యక్రమానికి వచ్చిన నిర్మాత సి కళ్యాణ్‌కి, ఉషాకి ఇతర అతిథులకు కృతజ్ఞతలు. సన్నీ నేను సినిమా చేద్దాం అనుకున్న రోజు నుంచి 25వ రోజుకు సెట్ రెడీ అయ్యింది. ఆ తర్వాత 34 రోజుల్లో కంటిన్యూస్‌గా సింగిల్ షెడ్యూల్‌లో సినిమా పూర్తి చేశాం. ఇలా నాన్ స్టాప్‌గా వర్క్ చేయడం ఫిల్మ్ ఇండస్ట్రీలో అరుదైన విషయం. మా డీవోపీ, సన్నీ, ఇతర టెక్నీషియన్స్, ఆర్టిస్ట్‌లు చాలా సపోర్ట్ చేశారు. అలీ మా చిత్రానికి ప్రాణం పోశారు. ఆయన సినిమాలో కనీసం ఒక గంట సేపు నవ్విస్తారు. మాది హారర్ చిత్రమే కానీ హారర్ సినిమాలో కామెడీ వర్కవుట్ అయితే ఎలా ఉంటదో చూస్తారు. ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడూ ఇష్టపడతాడు అన్నారు.
 
యాంకర్ హీరో ప్రదీప్ మాట్లాడుతూ, నేనూ సన్నీ ఒకేసారి జర్నీ స్టార్ట్ చేశాం. ఒక ఫ్రెండ్‌గా తను ఎదుగుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. సన్నీ ఏం మ్యాజిక్ చేశాడోగానీ ఇంత మందిని ఒప్పించగలిగాడు. సినిమా కోసం చాలా ఆలోచించాడు, కష్టపడ్డాడు. ఎస్5, నో ఎగ్జిట్ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.
 
డైలాగ్, సాంగ్స్ రైటర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ, ఎస్ 5 బోగీలోకి ఎక్కాలంటే అదృష్టం ఉండాలి, ఆ బోగీలో నుంచి దిగాలంటే ఆయుష్షు ఉండాలి. సింపుల్‌గా చెప్పాలంటే ఈ సినిమా కథ ఇది. మిమ్మల్ని బాగా నవ్వించే సినిమా ఇది. లాక్డౌన్‌లో పడిన ప్రతి ఒక్కరి స్ట్రెస్‌ను మా ఎస్ 5, నో ఎగ్జిట్ తీసేస్తుంది అన్నారు.
 
సురేష్ వర్మ, మెహబూబ్, అవంతిక, రుతుజా, రఘు, సంజయ్, గబ్బర్ సింగ్ బ్యాచ్, ఫిష్ వెంకట్, రమణ రెడ్డి ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - మణిశర్మ, సినిమాటోగ్రఫీ - గరుడవేగ అంజి, ఎడిటర్ - గ్యారీ, ఆర్ట్ - నాగేంద్ర, మాటలు, పాటలు - కళ్యాణ్ చక్రవర్తి, వీఎఫ్ఎక్స్ అండ్ డీఐ - జెమిని ఎఫ్ఎక్స్, పీఆర్వో - జీఎస్కే మీడియా, నిర్మాత - గౌతమ్ కొండెపూడి, దర్శకత్వం - సన్నీ కోమలపాటి.