గురువారం, 12 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 డిశెంబరు 2024 (16:59 IST)

Vegetarian For Ramayana అసత్య పోస్టులు పెడితే లీగల్ యాక్షన్ : సాయిపల్లవి

Sai Pallavi
Vegetarian For Ramayana ఎపుడూ ప్రశాంతంగా, నవ్వుతూ కనిపించే హీరోయిన్ సాయిపల్లవికి కోపం వచ్చింది. తన గురించి నిరాధారమైన పోస్టులు పెట్టే వారికి హెచ్చరిక ఇచ్చారు. సోషల్ మీడియాలో అసత్యమైన, నిరాధారమైన పోస్టులు పెడితే న్యాయపరమైన చిక్కుల్లో పడతారని ఆమె వార్నింగ్ ఇచ్చారు. 
 
ప్రస్తుతం బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'రామాయణ'. టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ మరికొందరు నిర్మాతలతో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సాయిపల్లవి సీత పాత్రను పోషిస్తున్నారు. అయితే, ఈ సినిమా కోసం సాయిపల్లవి తన అలవాట్లను మార్చుకున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీటిపై ఆమె ఘాటుగా స్పందించారు. ఇలాంటి నిరాధారమైన పోస్టులు పెడితే లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
 
నితేశ్ తివారీ దర్శకత్వంలో వచ్చే ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ నటిస్తుండగా.. సీతగా సాయిపల్లవి కనిపించనున్నారు. ఈ సినిమా కోసం ఆమె ఎన్నో అలవాట్లు మార్చుకున్నారని కోలీవుడ్‌లో ఓ ప్రముఖ మీడియా సంస్థ వార్తలు రాసింది. ఈ సినిమా పూర్తయ్యేవరకు సాయి పల్లవి మాంసాహారం మానేశారని, హోటల్స్‌లో కూడా తినడం లేదని, విదేశాలకు వెళ్లేటప్పుడు కూడా వంట వాళ్లను వెంట తీసుకెళ్తున్నారని ఆ వార్తల సారాంశం. 
 
దీనిపై సాయిపల్లవి తాజాగా స్పందించారు. ఇలాంటి నిరాధారమైన రూమర్స్ రాస్తే ఎంత పెద్ద సంస్థ అయినా లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. గతంలో తనపై ఎన్నోసార్లు రూమర్స్ వచ్చాయి. అలా వచ్చిన ప్రతిసారీ తాను మౌనంగానే ఉన్నాను. ఎందుకంటే నిజమేంటనేది దేవుడికి తెలుసు. కానీ, మౌనంగా ఉంటున్నానని ఇలాంటి రూమర్స్ తెగ రాసేస్తున్నారు. 
 
ఇప్పుడు ప్రతిస్పందించాల్సిన సమయం వచ్చింది. తన సినిమాల విడుదల, తన ప్రకటనలు, తన కెరీర్.. ఇలా తనకు సంబంధించి ఏవైనా నిరాధారమైన వార్తలు ప్రచురిస్తే.. అది గుర్తింపుపొందిన మీడియా అయినా తాను చట్టబద్దమైన చర్యలు తీసుకుంటాను. ఇంతకాలం సహించాను. ఇకపై ఇలాంటి చెత్త కథనాలను మోసుకెళ్లడానికి తాను సిద్ధంగా లేను అని చెప్పారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.