సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 5 జులై 2021 (09:20 IST)

సినిమాటోగ్రఫీ చట్టంపై ఎలుగెత్తిన గ‌ళం

kamal-surya
కేంద్ర‌ప్ర‌భుత్వం క‌రోనా త‌ర్వాత ఇప్పుడు సినిమారంగంపై ఓ క‌న్నేసింది. సినిమాలు సెన్సార్‌ల‌కు సంబంధించిన ప్ర‌తీదీ త‌మ క‌నుస‌న్న‌ల‌లో మెల‌గాల‌ని సినిమాటోగ్రఫీ చట్టం 1952లో సవరణలు తీసుకురాబోతోంది. దీనివ‌ల్ల సినిమా నిర్మాణంలో క్లారిటీ, స్ప‌ష్ట‌త‌, ప్రేక్ష‌కుల‌కు చైత‌న్యం క‌లిగించేవిధంగా వుండే క‌థ‌లు కాకుండా కేవ‌లం ప్ర‌భుత్వాన్ని స‌పోర్ట్ చేసేలా క‌థ‌లు వుండాల‌నేది ప్ర‌భుత్వం తాప‌త్ర‌త‌యం అని తెలుస్తోంది. దీనిపై మొద‌టగా గ‌ళాన్ని సూర్య విప్పారు. 'కష్టం మాది.. పెత్తనం మీదా? ఒప్పుకునేదే లేదు' అంటూ నటుడు సూర్య ముందు గళం విప్పాడు. తర్వాత కమల్‌హాసన్‌, కార్తీక్‌ సుబ్బరాజు, గౌతమ్‌ మీనన్ ఇలా కొంతమంది సోషల్‌ మీడియా వేదికగా గొంతు కలిపారు.
 
ఇదంతా  ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నాల్లో భాగ‌మ‌ని తెలియ‌జేస్తున్నారు. అంద‌రూ ఒక్క‌తాటిపై రావాల‌ని పిలుపుఇస్తున్నారు. ఈ చ‌ట్టం అమ‌లు జ‌రిగితే క‌థ‌ల‌లో మార్పు వ‌స్తంద‌నీ, రాజకీయ నాయకుల త‌ప్పుల్ని వేలెత్తి చూపించ‌కుండా వారు చెప్పిందే వేద‌మ‌నేలా వుంటుంద‌ని ఇది ప్ర‌జాస్వామ్యానికి వ్య‌తిరేక‌మ‌ని అంటున్నారు. 
 
ఈ చ‌ట్టంపై తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ఇంత‌వ‌ర‌కు ఎటువంటి స్పంద‌న చేయ‌లేదు. మెగాస్టార్ నుంచి కింది స్థాయి హీరోలుకానీ, ద‌ర్శ‌క నిర్మాత‌లుకానీ ఏమాత్రం దీని గురించి ఆలోచిస్తున్న‌ట్లు లేదు. ప్ర‌స్తుతం థియేట‌ర్ ఎలా ఓపెన్ చేయాల‌నేదానిపైనే ఈనెల 7న ఫిలింఛాంబ‌ర్‌లో సినీ పెద్ద‌లు స‌మావేశం కానున్నారు. మ‌రి ఆ స‌మ‌యంలో ఈ చ‌ట్టంపై ఎవ‌రైనా క‌దిలిస్తే స్పందిస్తారేమో చూడాలి.
 
సుధీర్‌బాబు ఆగ్ర‌హం
కొత్త సినిమాటోగ్రఫి బిల్లుపై హీరో సుధీర్ బాబు అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ‘సినిమాటోగ్రాఫ్ (అమెడ్మెంట్) బిల్ 2021’ పై తీవ్రంగా స్పందించాడు. ‘ఇప్పటికే సినిమా ఈజీ టార్గెట్ ఉంది. ఈ కొత్త బిల్లు అమల్లోకి వస్తే మరింత ఈజీ టార్గెట్ గా మారిపోతుంది. అయినా రీ సెన్సార్ అనేదే ఉండేటట్లైతే ఇక ‘సీబీఎఫ్సీ’ ఎందుకు?’ అని ఆయన ప్రశ్నించాడు. అంతే కాదు, ఒకింత ఘాటుగా… ‘’నిజంగా రాజకీయ నాయకులు తాము మాట్లాడే ప్రతీ మాటకీ బాధ్యత వహించాల్సి వస్తే… వారి మీద ఎన్ని క్రిమినల్ కేసులు నమోదు అవుతాయి? సినిమా వాళ్లు ఇప్పటికే అనేక నియమ, నిబంధనల్ని ఎదుర్కొంటూ తమ పని చేస్తున్నారు. ఇంకా గవర్నమెంట్ అజమాయిషీ మంచిది కాదు. రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛని గౌరవించాలి’ అన్నాడు సుధీర్.
 
1983నాటి సెన్సార్ నిబంధ‌న‌లే
సినిమా విడుద‌ల‌కుముందు సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికెట్‌ 1983లో చేసిన సవరణలకు అనుగుణంగా ఉంది. తల్లిదండ్రుల అనుమతితో 12 ఏళ్ల లోపు వారు సినిమా చూసే అవకాశం ఆ సర్టిఫికెట్‌ ఇస్తుంది. అయితే దీనికి మార్పులు చేసి 7 ఏళ్లు, 13 ఏళ్లు, 16 ఏళ్లు పైబడిన వారు కూడా చూసేలా,మూడు విభాగాలుగా విభజించింది. సర్టిఫికేషన్‌ కాలపరిమితి 10 ఏళ్లు చెల్లుబాటు ఉండగా ఉత్తర్వుల ద్వారా ఆ కాలపరిమితిని రద్దు చేశారు. దానికి అవసరమైన చట్ట సవరణలను చేయనున్నట్లు తెలిపింది. కొత్తగా ప్రవేశ పెట్టనున్న సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లును వెట్రిమారన్‌, ఆనంద్‌ పట్వర్ధన్‌ వంటి పలువురు చిత్ర నిర్మాతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడున్న కమిటీల్లో కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వ ఆసక్తిని కాపాడటానికి కొంతమంది బోర్డు సభ్యులు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. మ‌రి ముందు ముందు ఏరూపంలో ఈ చ‌ట్టం దారితీస్తుందో చూడాలి. దీనిపై జాతీయ‌స్థాయిలోని న‌టీన‌టులు స్పందించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని క‌మ‌ల్ హాస‌న్ తెలియ‌జేస్తున్నారు.