బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2019 (09:37 IST)

#SyeRaaUSA అమెరికాలో చరిత్ర తిరగరాయనున్న "సైరా"

మెగాస్టార్ చిరంజీవి నటించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన మూవీ సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం అక్టోబరు రెండో తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలకానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే అన్ని రకాల పనులు పూర్తి చేసుకుని విడుదలకు సర్వం సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ప్రీమియర్ షో అక్టోబరు ఒకటో తేదీనే అమెరికాలో ప్రదర్శించనున్నారు. ఇందుకోసం ప్రీబుకింగ్స్ రూపంలో ఇప్పటికే 337,875 డాలర్ల కలెక్షన్స్ రాబట్టింది. 
 
ఈ క్రమంలో సైరా నరసింహా రెడ్డి అమెరికాలో సరికొత్త రికార్డును నెలకొల్పనుంది. అమెరికాలోని అన్ని థియేటర్లలో (దాదాపు 199  ప్రాంతాల్లో) ఈ చిత్రం విడుదలకానుంది. ముఖ్యంగా, ప్రధాన నగరాలతో పాటు.. ప్రవాస భారతీయులు అధికంగా నివసించే ప్రాంతాలన్ని అన్ని థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో ఈ చిత్రం ప్రదర్శితంకానుంది. గతంలో ఒక్క చిరంజీవి చిత్రమే కాదు.. ఏ ఒక్క హీరో చిత్రం కూడా ఇంత భారీ స్థాయిలో విడుదలైన దాఖలాలు లేవు.
 
ఇకపోతే, సైరా చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమా నేపథ్య సంగీతం గురించి స్పందిస్తూ, సైరా ప్రాజెక్టుకు మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ (నేపథ్య సంగీతం) కీలకమైనవి. సైరాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అదే సైరా ఆత్మ. దీంతో సైరా మరో స్థాయికి వెళ్త్తుంది. తపస్ నాయక్ సారథ్యంలో ఐదు భాషల్లో ఈ సినిమాకు సంబంధించిన డీటీఎస్ మిక్సింగ్ పూర్తి చేశారని చెప్పారు. 
 
కాగా, భారతదేశ మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి, న‌య‌న‌తార‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి, జ‌గ‌ప‌తి బాబు, త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. భారీ బ‌డ్జెట్ చిత్రంగా సైరా రూపొంద‌గా, ఈ ప్రాజెక్ట్ కోసం 250 కోట్ల బ‌డ్జెట్‌కు పైగా ఖర్చుపెట్టారు. చిత్రానికి నిర్మాత రామ్ చరణ్. కొణిదెల ప్రొడెక్షన్ కంపెనీపై ఈ చిత్రాన్ని నిర్మించారు.