ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 2 అక్టోబరు 2019 (18:35 IST)

అద్వితీయం ... హ్యాట్సాఫ్ టు మెగాపవర్ స్టార్

"పుత్రోత్సాహం తండ్రికి
పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, 
జనులా పుత్రుని గనుగొని పొగడగ 
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!"
 
సుమతీ శతకకర్త వ్యక్తీకరించిన అభిప్రాయం ఇవాళ చిరంజీవి విషయంలో ఇదే నిజమైంది. కన్న తండ్రికే కొత్త జన్మనిచ్చి... ప్రపంచ వ్యాప్తంగా కీర్తి కేతనం ఎగురవేసిన అసాధారణ పుత్రుడిగా రామ్ చరణ్ సరికొత్త చరిత్ర లిఖించారనే  చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 
 
మెగాస్టార్ 'చిరు' తనయుడు 'చిరుత'గా నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్నప్పుడే నటుడిగా తన సత్తా చాటుకున్న రామ్ చరణ్ వివిధ రంగాల్లో ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తూ ఎప్పటికప్పుడు ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నారు. 
వ్యాపార రంగాల్లో కూడా ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ విజయవంతమైన రామ్ చరణ్... నిర్మాతగా కూడా రాణిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.
 
"సైరా" అద్వితీయం... అత్యద్భుతం 
దాదాపు పదేళ్ళ విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి మళ్లీ సినిమాల్లో నటిస్తారనగానే... ఆయన తన 150వ చిత్రంగా 'ఖైదీ నెంబర్ 150' రూపొందించి సూపర్ డూపర్ హిట్ సాధించి నిర్మాతగా మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు రామ్ చరణ్. 
 
తాజాగా ద్వితీయ చిత్రాన్ని 'సైరా' పేరుతో నిర్మించి చరిత్రలో ఇంతవరకు ఏ కుమారుడు ఏ తండ్రికి ఇవ్వని కానుకని తన తండ్రి మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా విఖ్యాతిగాంచారు. 
 
నిర్మాతగా స్పష్టత  
రానురాను సినీ నిర్మాణం క్లిష్టంగా మారి నిర్మాతల్ని నష్టాల ఊబిలోకి నెట్టేస్తున్నా ప్రస్తుత తరుణంలో కూడా అత్యాధునిక భావాల యువకిశోరం రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ హౌస్‌ని  విజయాల బాటలో నడిపే సామర్థ్యం తనకుందని నిరూపించారు.

 
కథ, నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికలో తనదైన మార్క్ ఉండేలా చూసుకుంటూ అభిరుచి గల నిర్మాతగా ఇండస్ట్రీకి భరోసా ఇస్తున్నారు రామ్ చరణ్. ద్వితీయ చిత్రం కూడా అద్వితీయంగా రూపొందించడంలో సఫలీకృతులయ్యారు.
 
వందల కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం "సైరా" వంటి పీరియాడికల్ మూవీని ఎంపిక చేసుకోవడం ఓ సాహసం కాగా... ఆ సాహసాన్ని అత్యంత సులువుగా అధిగమించిన నిర్మాత రామ్ చరణ్ ఇప్పుడు అందరి అభినందనలు అందుకుంటున్నారు.

చిత్రానికి అవసరమైన తారాగణం ఎంపికలో ఎక్కడా రాజీ పడలేదు సరికదా... బాలీవుడ్ దిగ్గజాల్ని సైతం రంగంలోకి దింపి విజయం సాధించారు. బిగ్ బీ అమితాబ్ వంటి మహోన్నత నటుడిని, నయనతార లాంటి లేడీ సూపర్ స్టార్‌ని మెగాస్టార్ డమ్‌తో జత చేసి అద్భుత ఫలితాలను అందిపుచ్చుకున్నారు. 
 
హాలీవుడ్ నుంచి ఫైట్ మాస్టర్స్‌ని కూడా రప్పించి 'సైరా'.. చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. అంతేనా...! దేశ స్వాతంత్ర్య సమరాంగణంలో వెన్ను చూపని వీరుని గాధ కాలగర్భం నుంచి వెలికి తీసి వెలుగులోకి తీసుకువచ్చిన ఘనత కూడా రామ్ చరణ్ సొంతం. ఈ ప్రాజెక్టును చేపట్టడంలోనే రామ్ చరణ్‌లోని దేశభక్తి, దేశం పట్ల అంకితభావం, నిబద్ధత ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 
 
చిత్తశుద్ధితో లక్ష్యసిద్ధి 
చిత్తశుద్ధితో చేసే ఏ పనిలోనైనా లక్ష్యసిద్ధి ఉంటుందని రామ్ చరణ్ నిరూపించారు. సినీ పరిశ్రమలో రాణించాలనుకునే  ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలిచారు. 'సైరా'....! ముందు... 'సైరా'..! తర్వాత నిర్మాతగా రామ్ చరణ్ గ్రాఫ్ ఆకాశమంత ఎత్తుకి ఎదిగింది. స్క్రీన్‌పై 'సైరా'గా మెగాస్టార్ చిరంజీవి స్వైరవిహారం చేస్తే... తెరవెనుక రామ్ చరణ్ కూడా ఎవ్వరు ఊహించని విధంగా పని చేసి మెప్పు పొందారు. తెలుగు పరిశ్రమను మరింత సుసంపన్నం చేసేందుకు అభిరుచిగల ఇలాంటి యువకులే రావాలని ప్రతి ఒక్కరూ అభిలషిస్తూ అభినందనలతో ముంచెత్తుతున్నారు.
 
అవును... పులి బిడ్డ పులి బిడ్డే  చిరు తనయుడు... లంఘించి ఉరికే 'చిరు'తే. రామ్ చరణ్ కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ... నటుడిగా,  నిర్మాతగా, ఆయన నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని కోరుకుంటూ... హ్యాట్సాఫ్ టు రామ్ చరణ్.
 
ఆర్.స్వామి నాయుడు
అఖిల భారత చిరంజీవి యువత.