పవన్ కళ్యాణ్, పోసాని మధ్య వివాదానికి కారణం వారేః నట్టికుమార్
ఆ ఆరుగురు నిర్మాతలు డబుల్ గేమ్ ఆడటమే పవన్ కల్యాణ్, పోసాని మధ్య వివాదానికి కారణభూతమైందన్న అభిప్రాయాన్ని ప్రముఖ నిర్మాత,.దర్శకుడు నట్టికుమార్ వ్యక్తంచేశారు. శుక్రవారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నట్టికుమార్ మాట్లాడుతూ, `పవన్ కల్యాణ్ తో సినిమాలను తీస్తున్న కొందరు నిర్మాతలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ వల్లే రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన ఆలా మాట్లాడారు. ఏపీ మంత్రి పేర్ని నానిని కలసి వచ్చిన పరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తులు అక్కడ మాట్లాడిన విషయాలను స్పష్టంగా పరిశ్రమకు తెలియజేయకపోవడం కూడా అనేక అపోహలకు దారితీసింది. అక్కడ ఏం మాట్లాడి వచ్చింది పరిశ్రమ నుంచి వెళ్లిన ఆ పెద్ద మనుషులు బయటకు వెల్లడించకపోగా పవన్ ను రెచ్చగొట్టేలా డబుల్ గేమ్ ఆడారు. దాంతో పవన్ మాట్లాడిన మాటలు వివాదమయ్యాయి.
తెలుసుకుని మాట్లాడాలి
రాజకీయాల గురించి పవన్ ఏవైనా మాట్లాడుకోవచ్చు. కానీ పెద్ద స్టార్ అయిన పవన్ సినీరంగం గురించి మాట్లాడేటప్పుడు వాస్తవిక విషయాలు తెలుసుకుని మాట్లాడితే బావుండేది. పవన్ తో సినిమాలు తీస్తున్న ఆ పెద్ద మనుషులే నిన్న మంత్రి పేర్ని నాని వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పారు. పవనే వారిని పంపించినట్లు బయట వదంతులు కూడా వినిపిస్తున్నాయి. దీనిని పవన్ ఏ విధంగా తీసుకుంటారు. ఆ నిర్మాతల డబుల్ గేమ్ ను సమర్థిస్తారా? లేదా? అన్నది ఆయనే తేల్చుకోవాల్సిన అంశం.
నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి హైదరాబాద్ లోని ఇంటిపై పవన్ కళ్యాణ్ ఫాన్స్ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ సమయంలో పోసాని ఉంటే చంపేసేవారని, అందుకే అలా దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి, వారిపై హత్యా ప్రయత్నం కేసులు పెట్టాలని నట్టికుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ, పోసాని ఫ్యామిలీ స్ ను మాట్లాడటం కూడా తప్పే. ఎవరు ఎలాంటి గొడవలు పడ్డా.తిట్టుకున్నా అందులోకి ఫ్యామిలీస్ ను లాగడం, వారిని తిట్టడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు. అలాగే తమ నాయకుడికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిపై దాడులు చేయడమనేది హేయమైన చర్య అని పవన్ తన ఫాన్స్ ను అదుపులో పెట్టుకుని, వారికి దిశానిర్దేశం చేయాలి. ఎట్టి పరిస్థితులలో చిత్ర పరిశ్రమలో అందరం అన్నదమ్ములుగా ఉంటాం. ప్రాణాలు తీసేవాళ్లు, ప్రాణాలకు తెగించేవాళ్లు ఫాన్స్ కాదు. నిజమైన ఫాన్స్ అంటే ఇతరులకు ప్రాణాలు పోసేవాళ్లు, సేవా కార్యక్రమాలు చేసేవాళ్లు. తమ అభిమాన స్టార్ లకు మరింత పేరుతెచ్చేవిధంగా ప్రవర్థించేవాళ్లు . ప్రస్తుతం జరుగుతున్న ఈ వివాదాలలో తెలంగాణ గడ్డకు సంబంధంలేదు. అయితే జనసేన తెలంగాణ ఇంచార్జ్ మాట్లాడుతూ పోసానిని చంపేస్తామంటూ బెదిరించినందువల్ల అతనిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. రేపు ఓటు వేయకపోతే కూడా చంపేస్తామంటారేమో.
ఇదంతా తెలంగాణ గడ్డపై జరుగుతున్నందువల్ల ఆంధ్రా వాళ్లు భయం గుప్పెట్లో ఉండాల్సివస్తోంది. వీటిని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి..చిరంజీవి గారు కూడా సీరియస్ గా తీసుకుని ఇలాంటి దాడులు జరగకుండా చూడాలి ఇది చిలికి చిలికి గాలి వానగా మారకముందే ఇలాంటి వివాదాలకు ఫుల్ స్టాఫ్ పడేవిధంగా చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, జీవిత రాజశేఖర్ గారు, విష్ణు తదితరులు చర్యలు తీసుకోవాలి. ఈ దాడులను వారంతా ఖండించాలి. ఆన్ లైన్ టికెట్ విధానం మంచిదే. పారదర్శకత ఉంటుంది. కానీ దాని నిర్వహణలో అందరికి ఎలా అయితే బావుంటుందో అధ్యనం తర్వాత ప్రభుత్వం ప్రవేశ పెడితే బావుంటుంది.అని నట్టికుమార్ వెల్లడించారు.