`యంగెస్ట్ చెస్ ట్రైనర్`గా నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన విధ్యా నిర్వాణ మంచు ఆనంద్
కలెక్షన్ కింగ్ డా. మోహన్‌బాబు మనవరాలు, ప్రముఖ నటి మంచు లక్ష్మీ ప్రసన్న కూతురు విధ్యా నిర్వాణ మంచు ఆనంద్. `యంగెస్ట్ చెస్ ట్రైనర్`గా నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకుంది. డిసెంబర్ 19న నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి డా. చోకలింగం బాలాజి సమక్షంలో జరిగిన పరీక్షల్లో ఉత్తీర్ణురాలై ఈ రికార్డ్ సొంతం చేసుకుంది.
ఈ సందర్భంగా నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి డా. చోకలింగం బాలాజి మాట్లాడుతూ, ``నాలుగైదు సంవత్సరాల పిల్లలు చెస్ ఆడడం మనం చూసుంటాం కాని ఆరేళ్ల వయసులో చెస్ గేమ్‌లో ట్రైనింగ్ ఇవ్వడం గొప్ప విషయం. మా సంస్థ తరపున రికార్డ్ అందించినందుకు హ్యాపీగా ఉంది`` అన్నారు.
విధ్యా నిర్వాణ ట్రైనర్ కార్తిక్ మాట్లాడుతూ- ``విధ్యా నిర్వాణకి చెస్ గేమ్ నేర్పిస్తే తప్పకుండా రాణించగలదని గతేడాదే మంచు లక్ష్మిగారికి చెప్పడం జరిగింది. తన వయసు చాలా చిన్నది ఇప్పుడే వద్దు అని చెప్పారు. ఈ ఏడాది లక్ష్మిగారే ఫోన్ చేసి తనకి ట్రైనింగ్ ఇవ్వమని అడిగారు. ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాక నాలుగైదు క్లాసుల్లోనే ఎంతో చురుకుగా గేమ్‌ని పూర్తిగా నేర్చుకుంది.
ఆ తర్వాత తన ఫ్రెండ్స్‌కి చెస్ గేమ్ నేర్పించడం మొదలుపెట్టింది. అప్పుడే ఈ రికార్డ్ ఎందుకు నమోదు చేయకూడదు అనిపించి వారి ప్రతినిధులతో మాట్లాడి ఈ రికార్డ్ కోసం నమోదు చేయడం జరిగింది. ఈ రోజు నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి డా. చోకలింగం బాలాజి సమక్షంలో నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణురాలై ఈ రికార్డ్ సాధించడం సంతోషంగా ఉంది`` అన్నారు.
మంచు లక్ష్మి మాట్లాడుతూ - ``చెస్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు అదొక లైఫ్ స్కిల్ అని నేను నమ్ముతాను. అందుకే విధ్యకి చిన్న వయసులోనే చెస్ ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. కాని రెండు వారాల్లోనే తన కోచ్ కార్తిక్ గారు నా దగ్గరకు వచ్చి చెస్ చాలా బాగా ఆడుతుంది. ఈ రికార్డ్‌కి మనం అప్లై చేద్దాం అని చెప్పారు. ఇప్పుడే వద్దు సార్ ఇంకా కొన్ని రోజులు చూడండి తర్వాత చూద్దాం అన్నాను. తను రెడీగా ఉన్నప్పుడు మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదు అని ఓకే చెప్పడం జరిగింది. విధ్యా నిర్వాణ ఇంత చిన్న వయసులోనే `యంగెస్ట్ చెస్ ట్రైనర్`గా నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్నందుకు ఒక తల్లిగా ఎంతో గర్వంగా ఉంది`` అన్నారు.
డాక్టర్ మోహన్ బాబు మాట్లాడుతూ - ``నాకు ఈ రోజుకి చెస్ ఆడటం తెలీదు. అటువంటిది మా మనవరాలు విధ్యా నిర్వాణ చెస్ నేర్చుకుంటుంది అని లక్ష్మీ చెప్పినప్పడు ఎందుకమ్మా ఇవన్ని చక్కగా చదువుకోనివ్వు అని అన్నాను. లేదు డాడి తను చాలా ఆసక్తిగా ఉంది అని చెప్పింది. తను ఈ వయసులో ఈ రికార్డులో స్థానం సంపాదించుకున్నందుకు ఒక తాతగా ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. ఈ సందర్భంగా తల్లిదండ్రులకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వారి పిల్లలకు దేనిమీద అయితే ఆసక్తి ఉందో చదువుతో పాటు దానికి కొంత సమయం కేటాయిస్తే తప్పకుండా ప్రతిఒక్కరు గొప్ప స్థాయికి చేరుకుంటారు. మా అందరి బ్లెస్సింగ్స్‌తో గ్రేట్ నిర్వాణ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.