హెల్మెట్ నిబంధన ఓ పెట్రోల్ బంక్ కొంప ముంచింది...
పెల్మెట్ లేకుంటే పెట్రోల్ పోయరాదన్న నిబంధన ఏకంగా ఓ పెట్రోల్ బంక్‌ను సీజ్ చేయించేలా చేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో ఇది జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 1వ తేదీ నుంచి హెల్మెట్ లేకుంటే పెట్రోల్ లేదు అనే నిబంధన అమలులో ఉంది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుకు వస్తే వారికి పెట్రోల్ పోయవద్దని ఆదేశాలు ఉన్నాయి.
ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే సంబంధిత బంకు యజమానులపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు ఇదివరకే హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడితే ఏడాది జైలు శిక్ష లేదా రూ.5 వేల జరిమానా లేదా రెండూ ఉండే అవకాశం ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.
ఈ నేపథ్యంలో స్థానికంగా ఓ పాల విక్రేత తన బైకుపై పెట్రోల్ కోసం బంకుకు వచ్చాడు. అయితే, అతని వద్ద హెల్మెట్ లేకపోవడంతో పాల క్యాన్ మూతను తీసి తలపై పెట్టుకున్నాడు. బంకులో పని చేసే సిబ్బంది ఇది గమనించకుండా పెట్రోల్ నింపాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న యువకుడు ఒకరు హెల్మెట్ బదులుగా తలపై పాల క్యాన్ మూత పెట్టుకుని పెట్రోల్ పోయించుకుంటున్న వైనాన్ని తన సెల్ ఫోనులో రికార్డు చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి నెటిజన్లు రకరకాలుగా ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఆ వీడియో సంబంధిత అధికారుల దృష్టికి వెళ్లడంతో పెట్రోల్ బంక్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించినట్లు గుర్తించి ఆ పెట్రోల్ బంకును సీజ్ చేశారు.