'ఆచార్య' చిరంజీవికి వడదెబ్బ .. ఆగిన షూటింగ్
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "ఆచార్య". చిరంజీవి తనయుడు చెర్రీ కూడా కీలక పాత్రను పోషిస్తున్నారు. అయితే, ఈ చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాన్‌స్టాప్‌గా సాగుతోంది. అక్కడే రామ్ చరణ్ కూడా ఉన్నాడు.
మూడు రోజుల కింద ఖమ్మం ఇల్లందు బొగ్గు గనుల్లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా, ఇపుడు ఈ సినిమా షూటింగ్ ఉన్నట్లుండి ఆగిపోయింది. ఎండల కారణంగా 'ఆచార్య' షూటింగ్‌లో చిరంజీవికి అనుకోని అనారోగ్య సమస్యలు వచ్చినట్లు తెలుస్తుంది.
వేసవి ఇంకా మొత్తంగా మొదలుకాకముందే వేడి ఎక్కువైపోతుంది. పగటి ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో వేడి మరీ ఎక్కువగా ఉంది. బొగ్గు గనులు ఉన్న ఖమ్మంలో అయితే ఎండలు బాగా ఉన్నాయి. అక్కడ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో అక్కడే షూటింగ్ చేస్తున్న "ఆచార్య" టీంకు సమ్మర్ సెగలు తగిలాయి.
మార్చి 15 వరకు అక్కడే జరగాల్సిన షూటింగ్‌ను మూడు రోజుల్లోనే ముగించారు. ఇంకా చిత్రీకరించాల్సిన సన్నివేశాలు ఉన్నా కూడా ముందుగానే ప్యాకప్ చెప్పేశారు. ఇల్లందు గనుల్లోనే రామ్ చరణ్, చిరంజీవి కాంబినేషన్ సీన్స్ ప్లాన్ చేశారు. దానికోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేశారు. అయితే షూటింగ్‌లో ఉన్నట్లుండి చిరంజీవికి డీ హైడ్రేషన్ అయిందని.. దాంతో ఉన్నఫళంగా షూటింగ్ ఆపేశారని ప్రచారం జరుగుతుంది.
వారం రోజుల షెడ్యూల్ 3 రోజుల్లోనే అర్ధాంతరంగా ముగిసిపోవడంతో మరో షెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఇల్లందు ఓపెన్ కాస్ట్ గనుల్లో కొన్ని రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆ కారణంగానే 'ఆచార్య' షూటింగ్‌కి ఇబ్బందులు తలెత్తాయి. పరిస్థితులు చక్కబడిన తర్వాత అక్కడ షూటింగ్ చేయాలని చూస్తున్నారు.