నేటి యువతీయువకుల్లో పఠనాసక్తి తగ్గిపోలేదు... దాసరి అమరేంద్ర
నేటి యువతీయువకుల్లో పుస్తక పఠనాసక్తి ఏమీ తగ్గిపోలేదనీ, ఐతే 1970 దశకంలోని రచనా పోకడలను ఇప్పటికీ కొందరు అనుసరిస్తూ ఉండటం వల్ల అలాంటివి నేటి యువతకు కొరుకుడు పడటం లేదు తప్ప వారిలో సాహిత్యంపై మక్కువ ఏమీ తగ్గలేదని ప్రముఖ సాహితీవేత్త, కథా రచయిత, వ్యాసకర్త దాసరి అమరేంద్ర అన్నారు. జనవరి 1, 2015న చెన్నైలోని పొట్టి శ్రీరాములు స్మారక మందిరంలో ఆయన చెన్నై తెలుగు సంఘాలతో ముఖాముఖి చర్చలో పాల్గొన్నారు. ఈ చర్చలో ఆయన తన రచనా అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
ఢిల్లీలో ఉంటూ, వృత్తి రీత్యా ఇంజినీర్ అయినప్పటికీ తనకు ఆది నుంచి తెలుగు భాష, సాహిత్యంపై మక్కువ ఎక్కువగా ఉండేదని అన్నారు. కాలేజీ రోజుల్లో ఏవో కవితలు, కథలు రాసినప్పటికీ తనను పూర్తిగా సాహిత్యం వైపు మరల్చిన సంఘటన తన విదేశీ ప్రయాణమేనని అన్నారు. విదేశీ యానం చేసినప్పుడు అక్కడ తనకు ఎదురైన అనుభవాలను పాఠకులతో పంచుకోవాలని, వాటిని కాగితంపై పెట్టి ఓ పత్రికకు పంపాననీ, వారు దానిని ప్రచురించడంతో తను అనుకున్నది నెరవేరిందని, ఇక అప్పటి నుంచి కథలు, వ్యాసాలు, పుస్తకాలు ఇలా తన సాహితీ ప్రయాణం సాగుతూ ఉన్నట్లు చెప్పారు.
నేటి జనరేషన్ కు పుస్తక పఠనాసక్తి తగ్గుతోందనే ప్రశ్నకు స్పందిస్తూ... సాహిత్యపు విలువలు, దాని ఆవశ్యకత వారికి అర్థమయ్యే రీతిలో విశదీకరించినప్పుడు తప్పక ఫలితముంటుందని అన్నారు. మారుతున్న సాంకేతిక పరిస్థితుల రీత్యా ఇపుడు ఇంటర్నెట్ లో తెలుగు సాహిత్యం క్రమంగా విస్తరిస్తోందనీ, తనకు తెలిసి కనీసం 40 నుంచి 50 వరకూ రచయితలు నిత్యం నెట్ లో తమ సాహిత్య అభిరుచులను, రచనలను, పత్రికలను తీసుకు వస్తున్నట్లు చెప్పారు. ఇది భవిష్యత్తులో తెలుగు సాహిత్యానికి బంగారు బాట వేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
దాసరిని సత్కరిస్తున్న తేజస్
తెలుగు జర్నలిస్టు యూనియన్(తేజస్) ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అధ్యక్షులు డాక్టర్ బాషా, కార్యదర్శి యిమ్మడిశెట్టి వెంకటేశ్వర రావు, కోశాధికారి జి. వెంకటేశ్వర రావు, మన్నవ గంగాధర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.