భ్రమ కలిగించే యుగంలోకి తీసుకెళ్ళిన మమ్ముట్టి - భ్రమయుగం రివ్యూ
లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ చిత్రంగా బ్లాక్ అండ్ వైట్ లో రూపొందించబడిన మలయాళ బ్లాక్‌బస్టర్ 'భ్రమయుగం' తెలుగులో ప్రతిష్టాత్మక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా ఫిబ్రవరి 23న ఈ శుక్రవారమే విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా మూడే పాత్రలుంటాయి. మమ్ముట్టితో పాటు అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ నటించిన ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్ ఫొటోలతో పబ్లిసిటీ చేశారు. ఈనాటికాలంలో బ్లాక్ అండ్ వైట్ మూవీని దర్శకుడు ఏవిధంగా తీశాడో చూద్దాం.
సాంకేతికత: రచన, దర్శకత్వం: రాహుల్ సదాశివన్, నిర్మాతలు: చక్రవర్తి రామచంద్ర & ఎస్.శశికాంత్. మాటల రచయిత: టి.డి. రామకృష్ణన్, సంగీతం: క్రిస్టో జేవియర్కె మెరా: షెహనాద్ జలాల్, కళ: జోతిష్ శంకర్, కూర్పు: షఫీక్ మహమ్మద్ అలీ మేకప్: రోనెక్స్ జేవియర్ , కాస్ట్యూమ్స్: మెల్వీ జె
కథ:
భారత్ లో ఆంగ్లేయులు పరిపాలనకు ముందు బానిస వ్యవస్థకాలంనాటిది. తేవన్ రాజుకొలువులో గాయకుడు. నిమ్నజాతికులానికి చెందినవాడు కనుక బానిసగా అమ్మేస్తుంటే తప్పించుకుని ఓ అడవిమార్గంలోకి వెళతాడు. అతనితోపాటు వచ్చిన ఓ వ్యక్తి యక్షిణికి బలైపోతాడు. దాంతో భయపడిపారిపోయి అడవిలో ఓ పాడుబడ్డ ఇంటికి వస్తాడు. అక్కడ ఎవరూలేరని కొబ్బరి కాయను కొట్టుకుని తినే టైంలో ఇద్దరు వ్యక్తులు వున్నారని తెలుస్తుంది. అందులో ఒకరు వంటవాడు. రెండో ఆయన ఇంటి యజమాని (మమ్ముట్టి).
యజమాని తేవన్ ను గానం విని అతిథిగా అన్నం పెడతాడు. ఆ తర్వాత తన దగ్గరే బానిసలా వుంచుకుంటాడు. యజమానికి తెలీయకుండా బయటకు వెళ్ళాలని ప్రయత్నిస్తే చనిపోవడమే. వంటమనిషి ద్వారా తేవన్ యజమాని గురించి కొన్ని రహస్యాలు తెలుసుకుంటాడు. దాంతో అతని హత్యచేయాలని ప్రయత్నిస్తాడు? ఆ తర్వాత ఏమయింది? అనేది మిగిలిన కథ.
సమీక్ష:
ప్రయోగాత్మక సినిమాలకు మలయాళ పరిశ్రమ పెట్టింది పేరు. వితనూత్నమైన కథ, కథనాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఆ కోవలోనిదే భ్రమ యుగం. అసలు ఈ భ్రమ యుగం అంటే ఏమిటో దర్శకుడు చెబుతాడు. కలికాలం తర్వాత వచ్చేది భ్రమయుగం. ఇక్కడ అధికారం దాహం, రాక్షసత్వం వుంటుంది. అలా వున్న పాత్ర మమ్ముట్టిది. కురుమోన్ పొట్టి అనే వంశస్తులకు చెందిన ఓ వ్యక్తి క్షుద్ర పూజలతో వారాహిదేవీని పూజించి ఓ వరం కోరుకుంటాడు. దానితో వారాహి దేవి ఓ శక్తిని ఇస్తుంది. ఆ శక్తిని తన అదుపాజ్ఝనలతో బానిసలా చూడడంతో తిరగబడతుంది. ఈ కథకు మరిన్ని హంగులు దిద్ది భ్రమకలిగించే లోకంలోకి దర్శకుడు తీసుకెళ్ళాడు.
ఈ కథంతా మమ్ముట్టి పైనే నడుస్తుంది. ఆయన ఆహార్యం, హావభావాలు అన్నీ ఈ సినిమాను నడిపిస్తాయి. పాత్రలో లీనమైపోయి చేసినట్లుంది. మొత్తంగా చూస్తే సస్పెన్స్ థ్రిల్లర్, హర్రర్ గా చెప్పవచ్చు. కానీ థ్రిల్లర్ గానే ప్రచారం చేసి నిజంగా థ్రిల్ కలిగించాడు. రాజులకాలంనాటి అతివిశాలమైన పెంకుటిల్లు. అప్పట్లో కలపతో కట్టిన కట్టడాలు, శిధిలావస్థలో వున్న ఆ భవంతి. చుట్టూ చెట్టు అంతా ఒక మాయలోకి తీసుకెళ్ళాడు.
ఇందులో నటించిన ముగ్గురూ బాగా చేశారు. సాంకేతికంగా ఈ చిత్రానికి కీలకం సినిమాటోగ్రఫీ. బ్లాక్ అండ్ వైట్ కావడంతో వాటిని హైలైట్ చేస్తూ బాగా చూపించాడు. అందుకు తగిన సౌండ్ కథనాన్ని నడిపించింది. సంగీత దర్శకుడు బాగా డీల్ చేశాడు. ఆర్ట్ డిపార్ట్ మెంట్ క్రుషి కనిపిస్తుంది. పాడుపడినభవంతిలో జరిగే వింతలతో కథనాన్ని రెండు గంటలపాటు నడిపించడం మామూలు విషయం కాదు. తర్వాత ఏదో జరగబోతోంది అనే భ్రమను కలిగించాడు దర్శకుడు.
ఇప్పటి వరకు ఎన్నో హార్రర్ థ్రిల్లర్ లు వచ్చాయి. కానీ భ్రమ యుగం అనేది మరో ఎత్తు. రొటీన్ కథలు వస్తున్న తరుణంలో కాస్త భిన్నంగా ఆలోచించి కొత్త లోకంలోకి తీసుకెళ్ళిన చిత్ర యూనిట్ ను అభినందించాలి. ఇది కమర్షియల్ సినిమాలా ఎంత రేంజ్ కు వెళుతుందో చెప్పలేంకానీ. కొత్త అనుభూతిని కలిగించే సినిమాగా వుంటుంది.