గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (16:56 IST)

వరుణ్ తేజ్ గ‌ని ఎలా వుందంటే! రివ్యూ రిపోర్ట్‌

Ghani still
Ghani still
నటీనటులు: వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర తదితరులు
 
సాంకేతిక‌త‌- 
సినిమాటోగ్రఫీ: జార్జ్ సి విలియమ్స్,  ఎడిటర్ : మార్తాండ్ కే వెంకటేష్, సంగీత దర్శకుడు: థమన్, నిర్మాతలు: అల్లు బాబీ, సిద్దు ముద్ద, దర్శకత్వం : కిరణ్ కొర్రపాటి
 
క‌రోనాకుముందు ప్రారంభ‌మైన వరుణ్ తేజ్`గ‌ని` చిత్రం ఈ శుక్ర‌వార‌మే విడుద‌లైంది. ప‌లువురి ద‌ర్శ‌కులు ద‌గ్గ‌ర ప‌నిచేసిన అనుభ‌వంతో  కిరణ్ కొర్రపాటిని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ అల్లు బాబీ, సిద్దు ముద్దలు ఈ చిత్రాన్ని నిర్మించారు.  మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ ఈ సినిమాతో కథానాయికగా పరిచయం అయ్యింది. బాక్సింగ్ నేప‌థ్యంలో రూపొందిన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ :
చిన్న‌త‌నం నుంచే త‌న తండ్రిని రోల్ మోడ‌ల్‌గా తీసుకున్న గ‌ని  (వరుణ్ తేజ్) బాక్స‌ర్ అవ్వాల‌నే క‌ల‌లు కంటాడు. నేష‌న‌ల్ పోటీలో పాల్గొన్న తన తండ్రి డ్రెగ్ తీసుకున్నాడ‌నే కార‌ణంతో చెడ్డ‌పేరు రావ‌డంతో ఆయ‌న‌పై కోపం పెంచుకుంటాడు. ఆ త‌ర్వాత త‌న త‌ల్లి మాధురి (నదియా)తో ఊరు విడిచి వైజాగ్ వ‌చ్చేస్తారు. బాక్సింగ్ జోలికి వెళ్లనని  అప్పుడే గ‌ని ద‌గ్గ‌ర త‌ల్లి మాట తీసుకుంటుంది. కాలేజీ చ‌దువుతున్న గ‌ని త‌న గోల్‌ను అమ్మ‌కు తెలీకుండా చేరాల‌ని చూస్తాడు. కానీ ఓ సంద‌ర్భంలో దొరికిపోతాడు. ఆ త‌ర్వాత ఏమి జ‌రిగింది? ఈ మ‌ధ్య‌లో  మాయ (సాయి మంజ్రేకర్) గనితో ప్రేమలో పడుతుంది. అటు అమ్మ‌ను ఇటు ప్రేయ‌సి కోరిక‌ను ఏవిధంగా బేల‌న్స్ చేసి బాక్సింగ్ పోటీలో పాల్గొన్నాడు? ఆ త‌ర్వాత గేమ్‌లోని రాజ‌కీయాలు ఎలా వుంటాయ‌నేది తెలుసుకున్నాడు? అందుకే త‌నేం చేశాడ‌నేది సినిమా. 
 
విశ్లేష‌ణః
 
బాక్సింగ్ నేప‌థ్యంలో ప‌లు సినిమాలు వ‌చ్చాయి. అమ్మ నాన్న త‌మిళ అమ్మాయి, అంత‌కుముందు త‌మ్ముడు, త‌మిళంలో మ‌రో సినిమా ఇవ‌న్నీ ఒక్కో నేప‌థ్యంలో కూడుకున్న‌వి. ఇక గ‌నిలోకూడా తండ్రి ఆశ‌యం కోసం కొడుకు ఏం చేశాడ‌నేది పాయింట్ క‌నుక ఆ వైపుగా క‌థంతా సాగుతుంది. అయితే ఇందులో గ‌ని పెద్ద‌గా క‌ష్ట‌ప‌డింది ఏమీ క‌నిపించ‌దు. బాక్స‌ర్‌గా తండ్రి అక్క‌డి రాజ‌కీయాల‌ను ఎదురొడ్డి జీవితాన్ని ఎలా బలిచేసుకున్నాడ‌నే ఇప్ప‌టి క్రీడాశాఖ‌లో జ‌రుగుతున్న తంతంగాన్నే చూపాడు. ఇదే సినిమాలో మైన్ అంశం. ద‌బాంగ్‌లోకానీ మ‌రో సినిమాలోకానీ క్రీడారాజ‌కీయాలు మామూలుగా వుండ‌వు. కోట్లు పెట్టి ఆట‌గాడిపై స్పాన్స‌ర్స్ పెట్టుబ‌డి పెట్ట‌డం, వారు ఎవ‌రిని గెల‌వానుకుంటే వారే గెల‌వడం, ఎవ‌రు ఓడిపోవాల‌నేది వారు డిజైడ్ చేయ‌డం, ఎదురుతిరిగితే చంపేయ‌డం వంటి అంశాలు ఇందులో కళ్ళ‌కు క‌ట్టిన‌ట్లు చూపించాడు ద‌ర్శ‌కుడు. 
 
అయితే సినిమాలో చాలా మ‌టుకు ద‌ర్శ‌కుడు ఎమోష‌న్స్‌పై న‌డిపాడు. మొద‌టి భాగంలో సాదాసీదాగా సాగుతుంది. సెకండాఫ్‌లోకి వ‌చ్చేసరికి త‌న తండ్రికి గురించి నిజం తెలుసుకున్న గ‌ని ఏవిధంగా బాక్సింగ్‌కు పేరు తేవాల‌నుకున్నాడ‌నే పాయింట్‌పై క‌థ సాగుతుంది. ఇందులో సంద‌ర్భానుసారంగా డైలాగ్స్ కూడా బాగానే వున్నాయి. బిల్డ‌ప్ షాట్స్ ద‌ర్శ‌కుడు బాగా చూపించాడు. నేప‌థ్య సంగీతాన్ని బీట్‌ను థ‌మ‌న్ ఓ లెవ‌ల్‌కు తీసుకెళ్ళాడ‌నే చెప్పాలి. పాట‌లు పెద్ద‌గాలేవు. ఉన్న రెండు పాట‌లు పెద్ద‌గా ఉప‌యోగ‌ప‌డ‌వు. త‌మ‌న్నా ఐటం సాంగ్ కేవ‌లం బాక్సింగ్ మూడ్‌నుంచి కాస్త డైవ‌ర్ట్‌కు ఉప‌యోగ‌ప‌డింది. 
 
గని పాత్ర‌లో వరుణ్ తేజ్ ఒదిగిపోయాడు. త‌న‌కు యాక్ష‌న్ సినిమాలంటే ఇష్ట‌మ‌ని వ‌చ్చిన ఆయ‌న‌కు అస‌లైన సినిమా ల‌భించింది. త‌నే ఇష్ట‌ప‌డి బాక్సింగ్ క‌థ‌ను ఎంచుకున్నాడు.  సిక్స్ ప్యాక్ తో తన యాక్షన్ మూమెంట్స్ తో సినిమాకే హైలెట్ గా నిలిచాడు. మిగిలిన పాత్ర‌లు ప‌ర్వాలేదు. ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, జ‌గ‌ప‌తిబాబు పాత్ర‌లు త‌గిన విధంగా వున్నాయి.   బాక్సింగ్ కి సంబంధించిన సందేశంతో పాటు బలమైన ఎమోషనల్ సీన్స్ కొన్ని లవ్ సీన్స్ అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ బాగా ఆకట్టుకుంటాయి. సాయి మంజ్రేకర్ బాగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. నదియా కూడా తల్లి పాత్రలో ఒదిగిపోయారు. నవీన్ చంద్ర బాగానే చేశాడు. 
 
 అయితే బాక్సింగ్ నేప‌థ్యం గ‌క‌నుక ఆ ఆట‌పై బాగా ఫోక‌స్ చేయ‌డంతో  మిగిలిన  ట్రీట్మెంట్, స్క్రీన్ ప్లే మ‌రింత ఆక‌ట్టుకునేలా చేస్తే బాగుండేది. బిల్డప్ షాట్స్ ఎక్కువ‌యిన‌ట్లు అనిపిస్తుంది. హీరో ఎక్క‌డా స్ట్ర‌గుల్ అయిన‌ట్లు క‌నిపించ‌దు. ఊరినుంచి వైజాగ్ వ‌చ్చేసి లావిష్‌గా బ‌తుకుతాడు. అవి బాగా ర‌క్తిక‌ట్టించేలా చూపితే బాగుండేది. కొత్త దర్శకుడు త‌ను అనుకున్న‌ట్లు తీయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. మంచి ప్ర‌య‌త్నం చేసినా దర్శకుడు మాత్రం రెగ్యులర్ సీన్స్ తో ఇంట్రెస్ట్ కలిగించలేక‌పోవ‌డం ప్ర‌ధాన లోపం.  అల్లు బాబీ, సిద్దు ముద్ద పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఎంత‌మేర‌కు ఆదరిస్తార‌నేది ప్రేక్షుల‌పై ఆధార‌ప‌డి వుంది.