శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : బుధవారం, 13 ఏప్రియల్ 2022 (13:48 IST)

విజ‌య్ బీస్ట్ ఎలా వుందంటే? రివ్యూ రిపోర్ట్‌

beast poster
beast poster
నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, సెల్వరాఘవన్, యోగి బాబు తదితరులు
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్, ఎడిటర్ : ఆర్. నిర్మల్, నిర్మాణం: సన్ పిక్చర్స్, దర్శకత్వం : నెల్సన్ దిలీప్‌ కుమార్
విడుదల తేదీ : ఏప్రిల్ 13, 2022

 
త‌మిళ క‌థానాయ‌కుడు విజ‌య్ సినిమాలంటే ఫ్యాన్స్‌కు విందులా వుంటుంది. కొత్త ప్ర‌యోగాలు చేస్తుంటాడు. తాజా చిత్రం బీస్ట్ సినిమా విడుద‌ల‌కుముందే అర‌బిక్ సాంగ్ బాగా పాపుల‌ర్ అయి ప్రేక్ష‌కుల‌, ఫ్యాన్స్ అంచ‌నాలు పెంచేసింది. ఇక హైద‌రాబాద్‌లో కూడా ఈరోజే విడుద‌లైన ఈ సినిమాకు అన్ని చోట్ల హౌస్‌ఫుల్ క‌లెక్ష‌న్లే క‌నిపించాయి. నెల్సన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

 
కథ:
వీర రాఘవ ఉర‌ఫ్ వీర‌ (విజయ్) ఒక ‘రా’ ఏజెంట్. తీవ్ర‌వాదుల నాయ‌కుడిని ప‌ట్టుకునేందుకు దేశాలు తిరుగుతుంటాడు. పిల్లంటే ఇష్టం. ఓ స‌క్సెస్‌ఫుల్ ఆప‌రేషన్ చేశాక దాని వ‌ల్ల ఓ పాప చ‌నిపోవ‌డంతో త‌ట్టుకోలేక‌పోతాడు. అందుకే `రా` నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాడు. ఓ సెక్యూరిటీ సంస్థ‌లో ప‌నిచేయ‌డానికి ఓ వివాహంలో ప‌రిచ‌య‌మైన  ప్రీతి (పూజ హెగ్డే) ప్రోత్సాహంతో వెళ‌తాడు. ఆ త‌ర్వాత ఆ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్‌, ప్రీతితో క‌లిసి వీర చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ మాల్‌కు ప‌నిమీద వెళ‌తారు. అక్క‌డ అంతా అనుమానాస్పందంగా వుండ‌డంతో `రా`కు చెందిన అధికారికి ఇన్‌ఫ‌ర్‌మేష‌న్ ఇస్తాడు వీర‌. ఆ త‌ర్వాత అనుకున్న‌ట్లే మాల్‌ను ఉగ్ర‌వాదులు హైజాక్ చేస్తారు. మాల్‌లో వున్న ప్ర‌జ‌లు ప్రాణాలు కాపాడాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది వీర‌కు. ఇంత‌కీ ఉగ్ర‌వాదుల డిమాండ్ ఏమిటి? అంత‌మంది ఉగ్ర‌వాదుల్ని వీర ఎలా ఢీకొన్నాడు అన్న‌దే మిగిలిన సినిమా.

 
విశ్లేష‌ణః
జాతీయ నేర‌నిరోధ‌క సంస్థ `రా` నేప‌థ్యంలో చాలా క‌థ‌లు వ‌చ్చాయి. బాల‌కృష్ణ పైసా వ‌సూల్ నుంచి గోపీచంద్‌, క‌మ‌ల్‌హాస‌న్‌, విక్ర‌మ్, అజిత్‌, ఇటీవ‌లే నాగార్జున‌ వంటివారు ఎంద‌రో ఇలాంటి క‌థ‌ల‌తో సినిమాలు చేసేశారు. అయితే అవ‌న్నీ ఒక్కో భిన్న‌మైన నేప‌థ్యాలుంటాయి. కానీ విజ‌య్ సినిమా మాత్రం కేవ‌లం షాపింగ్‌మాల్‌లోని ప్ర‌జ‌ల్ని కాపాడ‌డం. ఈ త‌ర‌హాకూడా విదేశీ సినిమాలు వ‌చ్చేశాయి. కానీ బీస్ట్ సినిమాలో మాత్రం సీరియ‌స్ పాయింట్‌ను ఎంట‌ర్‌టైన్‌గా చూపించే ప్ర‌య‌త్నం చేయ‌డం విశేషం. ఆమ‌ధ్య శివ‌కార్తికేయ‌న్ న‌టించిన వ‌రుణ్ డాక్ట‌ర్ కూడా ఇందుమించు ఇలానే ఎంట‌ర్‌టైన్‌మెంట్ వుండేలా తీశారు. 

 
ఇక విజ‌య్ బీస్ట్ మాత్రం కేవ‌లం ఒన్‌మేన్ షో. త‌ను స్ట‌యిలిష్‌గా చేష్ట‌లు వుంటాయో అంతే స్ట‌యిలిస్ డైలాగ్‌ల‌తో ఎదుటివారిని ట్రాప్ లో ప‌డేయడం ఆయ‌న నైజం. ఇందుకు పావుగా పూజా హెగ్డే, యోగిబాబు వంటి కొన్ని పాత్ర‌లు సాయ‌ప‌డ‌తాయి. దానితో ఫ‌న్ జ‌న‌రేట్ అవుతుంది. యాక్ష‌న్ ప‌రంగా కూడా దర్శకుడు నెల్సన్ రాసుకున్న సన్నివేశాలు స్ట‌యిలిష్‌గా అనిపిస్తాయి. ఉగ్రవాదులకు సంబంధించిన స‌న్నివేశాలకుతోడు వారిలో ఉన్న మాన‌వీయ‌కోణం కూడా ఓ పాత్ర ద్వారా చూపించాడు.

 
ఇలాంటి క‌థ‌ను ఎంత కొత్త‌గా చెప్పాలో అలా ప్ర‌య‌త్నించాడు. ద‌ర్శ‌కుడు, హీరోకూడా. కేవ‌లం పిల్ల‌ల సెంటిమెంట్‌మీద న‌డుస్తుంది కాబ‌ట్టి ఈ సినిమా పిల్ల‌లు చూసేవిధంగా వుంది. అయితే ఇప్ప‌టికే స్పైడ‌ర్‌మేన్‌, హీ మేన్‌, హ‌నుమాన్ వంటి ఎన్నో వీడియో గేమ్స్‌ను చూసిన పిల్ల‌ల‌కు బీస్ట్ కూడా ఆ త‌ర‌హా సినిమాగా అనిపిపిస్తుంది.

 
క‌థ ప‌రంగా ప‌క్క‌న పెడితే, అస‌లు హైజాక్ చేయాలంటే దాని వెనుక ఎంత మంది ప్ర‌ముఖులు వుంటారు. రాజ‌కీయ‌నాయ‌కులు వుంటారు. అధికారులుంటారు. అనేవి ఇందులో చ‌ర్చించారు. కేంద్ర హోంమంత్రి త‌ను ప్ర‌దాని కావాల‌నే ఆరాటంలో ఉగ్ర‌వాదుల‌తో చేతులు క‌లిపి మోస్ట్ వాంటెండ్ టెర్ర‌రిస్టు నాయ‌కుడిని వీర అరెస్ట్ చేస్తే అత‌న్ని విడిపించాల్సి రావ‌డం ఇందులో ప్ర‌ధాన పాయింట్‌. ఈ క్ర‌మంలో హోంమంత్రి ఆడే నాట‌క‌పు స‌న్నివేశాలు వ‌ర్తమాన రాజ‌కీయ‌నాయ‌కులు, మంత్రుల నైజాన్ని క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్లు చూపించిన‌ట్లుంది. హీరో హీరోయిన్ల మధ్య లవ్ డ్రామా కేవలం సీరియ‌స్ క‌థ‌కు ఆట‌విడుగా ఉప‌యోగించుకున్నారు. ఇందులో హైలైట్‌గా నిలిచింది సెక్యూరిటీ సంస్థ‌ను న‌డిపే  అమాయ‌క‌పు య‌జమాని పాత్ర‌. త‌ను నిదానంగా మాట్లాడేతీరు, సంద‌ర్భానుసారంగా వ‌చ్చే డైలాగ్‌లు అటు పిల్లల‌కు, ఇటు పెద్ద‌ల‌కు కాస్త రిలీఫ్ నిస్తాయి.

 
అస‌లు ఇప్ప‌టి సాంకేతిక యుగంలో టెక్నాల‌జీని ఉప‌యోగించి తీయాలంటే క‌త్తిమీద సామే. రోబో శంక‌ర్ అంత ప్ర‌యోగాలు చేసి స‌క్సెస్ అయ్యాడు. కానీ ఇక్క‌డ కేవ‌లం జామ‌ర్‌పెట్ట‌డం, కేవ‌లం రా అధికారికి ఉగ్ర‌వాద నాయ‌కుడు మాత్ర‌మే క‌నెక్ష‌న్ వ‌చ్చేలాచేయ‌డం వంటివి బాగున్నా, లాజిక్‌గా చూస్తే పొంత‌న‌లేవ‌నిపిస్తుంది.  సంగీతం ప‌రంగా చూస్తే నేప‌థ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్ర‌ఫర్ పనితనం ఈ సినిమాకి ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్ చాలా ఎఫెక్టివ్ గా తీశారు. సినిమాలోని నిర్మాణ విలువ‌లు కూడా బాగున్నాయి.

 
ముగింపుః
ఈ సినిమా అలా వుంది ఇలా వుంది అనేకంటే, కేవ‌లం విజ‌య్ స్ట‌యిలిష్ యాక్ష‌న్‌తో ఒన్‌మేన్ షోగా ఈ సినిమా వుంది. ఊహకంద‌ని సంఘ‌ట‌ల‌న్నీ చ‌కాచ‌కా జ‌రిగిపోతుంటాయి. వ‌దిలేసిన ఉగ్ర‌వాదిని ప‌ట్టుకోవ‌డానికి మ‌ర‌లా పాకిస్తాన్ వెళ్ళి అక్క‌డ  వంద‌లాది టెర్ర‌రిస్టుల‌ను భ‌య‌పెట్టి యుద్ధ విమానంలో తిరిగి రావ‌డం, విమానంలో ప్ర‌ధాని మంత్రివ‌ర‌కు గైడెన్స్ ఇవ్వ‌డం రాకెట్ దాడులు ఇవ‌న్నీ పిల్లలు ఆడుకుని ఆనందించ‌డానికి కొత్త‌గా త‌యారు చేసిన ఓ వీడియోగేమ్‌ను త‌ల‌పిస్తుంది. రా ఏజెంట్‌గా విజయ్ ఎంత మంచివాడో, అవ‌స‌ర‌మైతే దేశం కోసం మృగంలా మార‌తాడ‌నేలా బీస్ట్ అనే టైటిల్ పెట్టిన‌ట్లుంది.

 
అర‌బిక్ పాట‌లో విజ‌య్ డాన్స్ బాగుంది.  అనిరుద్ పాడిన అర‌బిక్ వాయిస్ మొద‌ట్లో సూట్ కాలేద‌నిపిస్తుంది. కానీ సంగీత ధ్వ‌నిలో అది కొట్టుకుపోయేలా చేస్తుంది. సీరియ‌స్ పాయింట్‌ను స‌ర‌దాగా చెప్పే ప్ర‌య‌త్న‌మే ఈ సినిమా.  మ‌రి ప్రేక్ష‌కులు ఏమేర‌కు ఆద‌రిస్తారో చూడాల్సిందే.