సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By
Last Updated : శుక్రవారం, 26 జులై 2019 (21:54 IST)

'డియర్ కామ్రేడ్' అనుకుంటారు కానీ... రివ్యూ రిపోర్ట్(Video)

గీత గోవిందం హిట్ పెయిర్ అయిన విజయ్ దేవరకొండ, రష్మిక మందనతో కలిసి కొత్త దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కించిన చిత్రం డియర్ కామ్రేడ్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సహజంగానే గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వారిద్దరి కాంబినేషన్ అనేసరికి అంచనాలు మామూలుగా వుండవు కదా. మరైతే ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా డియర్ కామ్రేడ్ వుందో లేదో చూద్దాం.
 
కథ విషయానికి వస్తే... చైతన్య అలియాస్ బాబీ (విజయ్‌ దేవరకొండ) తాతయ్య మునుపటి రోజుల్లో కమ్యూనిస్ట్... కామ్రేడ్. కాబట్టి అతడి మనవడు కూడా కామ్రేడ్ అనుకుంటూ వుంటారు ఇంట్లోవాళ్లు. రాజకీయాలు సంగతి ఎలా వున్నా బాబీ మాత్రం కాలేజీలో లీడర్ అవుతాడు. కాలేజీ విద్యార్థులకు రాజకీయ నాయకులకు రిలేషన్స్ వుంటాయి కదా. కాబట్టి అతడిని రాజకీయాల్లో వాడుకోవాలని చూస్తారు పొలిటీషిన్స్. కానీ బాబీ అందుకు ఒప్పుకోడు. కానీ మనోడికి విపరీతమైన ఆవేశం. ఇతడి వ్యవహారం చూసి నాయకులు లోలోపల కుతకుతలాడుతుంటారు అతడు తమకు ఉపయోగపడటంలేదని. 
 
ఇదిలావుంటే బాబీ వాళ్ల పక్కింట్లో అపర్ణా దేవీ అలియాస్‌ లిల్లీ (రష్మిక మందన్న)తో అతడికి స్నేహం కుదురుతుంది. కామ్రేడ్ కాస్తా ప్రేమలో పడిపోతాడు. కానీ లిల్లీ మాత్రం తనకు అలాంటివి సరిపడవని చెప్తుంది. ఆ తర్వాత అతడు అదేపనిగా ఆమె కోసం పరితపిస్తుండటాన్ని చూసిన లిల్లీ అతడికి దగ్గరవుతుంది. ఈ క్రమంలో అతడిని బాగా దగ్గరగా గమనిస్తుంది. కొన్ని విషయాల్లో అతడు విపరీతమైన ఆవేశాన్ని ప్రకటించడాన్ని చూసి షాక్ తింటుంది లిల్లీ. అతడిలో వున్న ప్రేమ కంటే ఆవేశమే ఆమెకి ఎక్కువ అనిపిస్తుంది. దాంతో ఇక ఇతడితో కలిసి ప్రయాణం కష్టమని భావించి అతడితో కటీఫ్ చెప్పేసి దూరమవుతుంది.
 
లిల్లీ అలా చేసేసరికి బాబీ ప్రేమ పిచ్చివాడవుతాడు. ఆమెను మర్చిపోయేందుకు కుటుంబాన్ని విడిచిపెట్టి వైల్డ్ లైఫ్ సౌండ్స్ పైన రీసెర్చ్ అంటూ తిరుగుతుంటాడు. ఈ రీసెర్చిలో భాగంగా అతడు మళ్లీ హైదరాబాదు వస్తాడు. అక్కడ ఓ ఆసుపత్రిలో లిల్లీ డిప్రెషన్‌కు ట్రీట్మెంట్ తీసుకుంటూ కనబడటంతో షాక్ తింటాడు. ఆమె మానసిక స్థితి అలా దారుణంగా ఎందుకు మారింది. కారణమేంటి.. తన ప్రియురాలిని తిరిగి మామూలు స్థితికి బాబీ తెచ్చాడా లేదా అన్నది మిగిలిన స్టోరీ.
 
ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి వేరే చెప్పక్కర్లేదు. తమ శక్తిమేరకు నటించారు. లవ్ కెమిస్ట్రీని బాగా పండించారు. బాబీ పాత్రలో వున్న షేడ్స్‌ని చక్కగా చూపించాడు విజయ్ దేవరకొండ. మిగిలిన పాత్రలు కూడా అలాగే వచ్చి వెళ్తాయి. కానీ కథపైన మరికాస్త పట్టుబిగించి వుంటే బాగుండేది. ఈ చిత్రంతోనే దర్శకుడుగా పరిచయమైన భరత్ కమ్మ స్టోరీ లైన్ సెలక్షన్ బాగానే వున్నా దాన్ని ఉపయోగించుకోవడంలో వెనకబడ్డాడు.

టాప్ హీరోహీరోయిన్లు తన డైరెక్షన్లో నటిస్తున్నప్పుడు మరింత కేర్ తీసుకుని వుండాల్సింది. స్క్రీన్ ప్లేలో అక్కడక్కడ డొల్లతనం కనిపిస్తుంది. ఐతే లవ్ కెమిస్ట్రీ, ఇతర సన్నివేశాలు బాగానే లాగించేశాడు. మొత్తమ్మీద డియర్ కామ్రేడ్ ఫ్యామిలీ ఆడియెన్సును ఎంటర్టైన్ చేస్తుందని అనుకోవచ్చు.