శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By pnr
Last Updated : శుక్రవారం, 10 ఆగస్టు 2018 (13:14 IST)

కమల్ హాసన్ 'విశ్వరూపం - 2' ఎలా ఉంది?

విశ్వనటుడుగా గుర్తింపు పొందిన కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తాను చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పేస్తాడు. అలా సున్నితమైన ఉగ్రవాదం అంశాన్ని తీసుకుని 'విశ్వరూపం'

బ్యాన‌ర్‌: రాజ్ క‌మ‌ల్ ఫిలిమ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్‌ 
చిత్రం: విశ్వరూపం 2 
న‌టీన‌టులు: కమల్‌హాసన్‌, రాహుల్‌ బోస్‌, పూజా కుమార్‌, ఆండ్రియా, శేఖర్‌ కపూర్‌, వహీదా రెహమాన్‌ తదితరులు. 
సంగీతం: మహమ్మద్‌ గిబ్రాన్‌ 
నిర్మాతలు: ఎస్‌.చంద్రహాసన్‌, కమల్‌హాసన్ 
రచన, దర్శకత్వం: కమల్‌హాసన్‌ 
విడుదల: 10-08-2018 
 
విశ్వనటుడుగా గుర్తింపు పొందిన కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తాను చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పేస్తాడు. అలా సున్నితమైన ఉగ్రవాదం అంశాన్ని తీసుకుని 'విశ్వరూపం' చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం దేశ‌వ్యాప్తంగా ఎంతో చ‌ర్చ‌ని రేకెత్తించింది. పైగా, ప‌లు వివాదాల మ‌ధ్య విడుద‌లై ప్రేక్ష‌కుల మెప్పు పొందింది. దానికి కొన‌సాగింపుగా తెర‌కెక్కిన చిత్ర‌మే 'విశ్వ‌రూపం 2'. మరి ఈ విశ్వరూపం 2 చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషలోనే ఈ చిత్రం విడుదలైంది.
 
విశ్వరూపం మొదటి భాగంలో విసామ్ అహ్మ‌ద్ కాశ్మీరీ అలియాస్ విస్సు అలియాస్ విశ్వ‌నాథ‌మ్‌గా క‌మ‌ల్‌ హాస‌న్ కనిపిస్తారు. ఈ చిత్రం విడుదలై ఐదేళ్లు అయింది. ఆ చిత్రం ముగింపులో ఒమ‌ర్ గానీ, నేను గానీ.. ఒక్క‌రే మిగ‌లాలి అప్పుడే ఇది పూర్త‌వుతుంది అని విశ్వరూపానికి రెండో భాగం ఉంటుందని అపుడే చెప్పాడు. ఆ ప్రకారంగానే విశ్వరూపం 2 చిత్రాన్ని తెరకెక్కించాడు. భారత్‌లో జ‌రిగే క‌థ‌గా విశ్వ‌రూపం 2ను తెర‌కెక్కించారు. తొలి భాగంలో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్యలేని అన్యోన్య‌త ఈ సినిమాలో క‌నిపించ‌నుంది. తొలి భాగాన్ని ఉత్కంఠ‌భ‌రితంగా తెర‌కెక్కించిన క‌మ‌ల్‌ హాస‌న్ ఈ రెండో భాగాన్ని ఎలా హ్యాండిల్ చేశారు? పేక్ష‌కుల‌కు ఈ సినిమా న‌చ్చుతుందా? ఈ చిత్రంలో క‌మ‌ల్ ఏం చెప్పారో, ఆయన నటన ఎలా ఉందో ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్ధాం. 
 
చిత్ర కథ : 
భారత 'రా' అధికారుల అదేశం మేరకు ప‌నిచేసే సైనిక గూఢ‌చారి విసామ్ అహ్మ‌ద్ క‌శ్మీరీ (క‌మ‌ల్‌ హాస‌న్‌). అల్‌ఖైదా ఉగ్ర‌వాదుల‌తో క‌లిసి వాళ్ల వ్యూహాల్ని ఎప్ప‌టిక‌ప్పుడు సైన్యానికి చేర‌వేస్తూ భారత్‌లో ప్లాన్ చేసిన పలు బాంబు పేలుళ్ళను ఆపుతుంటాడు. ఆ విష‌యం తెలిసిపోవ‌డంతో అల్‌ఖైదా ఉగ్ర‌వాది ఒమ‌ర్ ఖురేషి (రాహుల్ బోస్‌)... విసామ్‌ని అంతం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంటాడు. అలాగే దేశవ్యాప్తంగా 64 చోట్ల బాంబు దాడులకు పాల్పడేందుకు వ్యూహాలు ర‌చిస్తాడు. యూకే స‌ముద్ర అంత‌ర్భాగంలో ఒక నావ‌లో ఉన్న బాంబుల్ని పేల‌కుండా అడ్డుకోవ‌డంతో పాటు, ఒమ‌ర్ ఖురేషిని విసామ్ ఎలా అంతం చేశాడు? నిరుప‌మ (పూజా కుమార్‌), అస్మిత (ఆండ్రియా), విసామ్‌కి ఎలా సాయం చేశారో తెర‌పైనే చూడాలి.
 
ఈ చిత్రం కథ యూకే నేప‌థ్యంలో ప్రారంభమవుతుంది. లండ‌న్‌లో బ్లాస్ట్ ప్లాన్ చేసిన ఓమ‌ర్‌.. త‌ర్వాత రెండో ప్ర‌పంచ యుద్ధంలో లండ‌న్ సముద్రంలో మునిగిన 1500 ట‌న్నుల బాంబుల‌ను యాక్టివేట్ చేసి దాని ద్వారా లండ‌న్ సిటీని నాశ‌నం చేయాల‌నుకునే ప్లాన్ కూడా వేస్తాడు. విష‌యం ప‌సిగ‌ట్టిన విసామ్ త‌న భార్య‌, న్లూక్లియ‌ర్ సైన్స్‌లో పిహెచ్‌.డి చేసిన నిరుప‌మ‌(పూజా కుమార్‌).. అసిస్టెంట్ ఆశ్రిత‌(ఆండ్రియా) స‌హా వెళ్లి అక్క‌డ స‌ముద్ర గ‌ర్భంలోని యాక్టివేట్ చేయ‌బోయే బాంబుల‌ను డీ యాక్టివేట్ చేస్తాడు. త‌ర్వాత స్వదేశానికి చేరుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న ఒమర్ నిర‌ప‌మ‌, ఆశ్రిత‌ల‌ను ఓమ‌ర్ కిడ్నాప్ చేస్తాడు. చివ‌ర‌కు ఒమ‌ర్‌ను విసామ్ అహ్మ‌ద్ ఏం చేస్తాడు? నిరుప‌మ‌, ఆశ్రిత‌ల‌కు ఏమౌతుంది? భారత్‌లో ఓమర్‌కు స‌హాయం చేసేదెవ‌రు? భారత్‌ను నాశనం చేయ‌డానికి ఒమర్ ఏ విధంగా ప్లాన్ చేశాడు.? ఒమ‌ర్ ప్లాన్‌ను విసాద్ ఎలా అడ్డుకున్నాడు? అనేదే మిగిలిన చిత్ర కథ.
 
టెక్నికల్ పరంగా... 
గత 2013 సంవత్సరంలో విడుద‌లైన విశ్వ‌రూపం చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. ఆ సినిమాలోని స‌న్నివేశాల‌కు.. చాలా సందేహాల‌కు స‌మాధానమే ఈ సీక్వెల్. ఇందులో క‌మ‌ల్ హాస‌న్ పూర్తి స్థాయి క్యారెక్ట‌రైజేష‌న్‌ను రివీల్ చేశారు. అస‌లు కమల్ గూఢ‌చారిగా ఎలా మారాడు? అల్‌ఖైదా స్థావ‌రాల్లోకి ఎలా ప్ర‌వేశించాడు? అక్క‌డ ఏం జ‌రిగింది? ఎలా తిరిగొచ్చాడ‌నే విష‌యాలు ఫ్లాష్‌బ్యాక్‌గా వ‌స్తాయి. ఆ త‌ర్వాత యూకేలోనే విసామ్‌పై హ‌త్యాయ‌త్నం జ‌రుగుతుంది. అక్క‌డ తీర్చిదిద్దిన యాక్ష‌న్ ఎపిసోడ్ ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. అప్ప‌టిదాకా న‌త్త న‌డ‌క‌న సాగిన‌ట్టుగా అనిపించిన క‌థ కూడా ప‌ట్టాలెక్కిన‌ట్టుగా అనిపిస్తుంది. 
 
అలాగే మొదటిభాగంలో లేని భార్య భ‌ర్త‌ల మ‌ధ్య ఎమోష‌న్స్‌, త‌ల్లికొడుకుల మ‌ధ్య ఎమోష‌న్స్‌.. అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ఆండ్రియా, పూజా కుమార్ గ్లామ‌ర్ సినిమాకు ప్లస్ అయ్యింది. అలాగే నేటి రాజ‌కీయాల గురించి.. క‌మ‌ల్ వేసిన చుర‌క‌లు కూడా బావున్నాయి. అలాగే క‌మ‌ల్ హాస‌న్ స్వంతంగా డ‌బ్బింగ్ చెప్పుకున్నారు. అలాగే, కమల్ హాసన్ అభిన‌యం ఆక‌ట్టుకుంటుంది. ముఖ్యంగా తొలి స‌గ‌భాగంలో ఈశ్వ‌ర ‌శాస్త్రితో క‌లిసి చేసిన స‌న్నివేశాలు, అక్క‌డ సంభాష‌ణ‌లు, ద్వితీయార్థంలో త‌న త‌ల్లిగా న‌టించిన వహీదా రెహమాన్‌తో క‌లిసి నటించిన తీరు బాగుంటాయి. క‌మల్ చేసిన యాక్ష‌న్ ఘ‌ట్టాలు కూడా స‌హ‌జంగా సాగుతాయి. ఆర్మీ అధికారిగా శేఖర్ కపూర్, ఒమ‌ర్ ఖురేషీగా రాహుల్ బోస్ చాలా బాగా న‌టించారు. రాహుల్ బోస్ న‌ట‌న ద్వితీయార్థంలో మ‌రింత స‌హ‌జంగా సాగుతుంది. వహీదా రెహమాన్ అల్జీమర్స్ వ్యాధితో బాధప‌డుతున్న త‌ల్లి పాత్ర‌లో న‌టించారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌త ప్రమాణాలతో తెరకెక్కించారు. 
 
జిబ్రాన్ సంగీతం, శ్యాం ద‌త్‌, షాను జాన్ వ‌ర్గీస్ కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. నిర్మాణ విలువలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. క‌మ‌ల్‌హాస‌న్ తొలి భాగంతో పోలిస్తే ద‌ర్శ‌కుడిగా, క‌థ‌కుడిగా కాస్త నిరాశ‌ప‌రుస్తాడు. సంభాష‌ణ‌లు సామాన్య ప్రేక్ష‌కుల‌కు ఒక ప‌ట్టాన అర్థం కాని రీతిలో, నిగూఢ‌మైన అర్థాల‌తో వినిపిస్తుంటాయి. 
 
ఈ చిత్రంలో ప్లస్ పాయింట్లను పరిశీలిస్తే, న‌టీన‌టుల ప‌నితీరు, సినిమాటోగ్ర‌పీ, సీజీ వ‌ర్క్‌, కథా నేపథ్యం, పోరాట ఘట్టాలు. అలాగే, మైనస్ పాయింట్లను విశ్లేషిస్తే, కథ, కథనాలతో పాటు.. చిత్ర కథ సాగదీత ధోరణితో ముందుకు సాగడం. ఫ‌స్టాఫ్‌లో 30 నిమిషాలు సినిమాకు క‌నెక్ట్ అయిన ప్రేక్ష‌కులు ఇంట‌ర్వెల్ వరకు లీనం కాలేరు. సినిమా సీన్స్ డ్రాగింగ్‌గా అనిపిస్తాయి. యాక్ష‌న్ సీన్స్ బావున్నా.. ఎగ్జ‌యిటింగ్‌గా లేవు. ఫ‌స్ట్ పార్ట్ కంటే ఇందులో నేప‌థ్య సంగీతం బాలేదని చెప్పొచ్చు.