ఇరవై ఏళ్ళ సత్యమూర్తి సీనియర్ సిటిజన్లకు అన్నయ్య ఎలా అయ్యాడు!
అరవై ఏళ్ల సావిత్రి తన భర్త సత్యమూర్తి తప్పిపోయాడని పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. ఆనవాలుగా ఇరవై ఏళ్ల యువకుడి ఫొటో ఇచ్చి ఇతనే తన భర్త అని చెబుతుంది. ఇరవై ఏళ్ల యువకుడు, అరవై ఏళ్ల మహిళా ఎలా భార్యాభర్తలయ్యారో తెలియాలంటే సావిత్రి w/o సత్యమూర్తి సినిమా చూడాల్సిందే.
సీనియర్ హాస్యనటి శ్రీలక్ష్మి, పార్వతీశం జంటగా నటిస్తున్న చిత్రం సావిత్రి w/o సత్యమూర్తి. మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూరి జగన్నాథ్ వద్ద దర్శకత్వశాఖలో పనిచేసిన చైతన్య కొండ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హిలేరియన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు బాబీ శనివారం విడుదలచేశారు. ఈ సందర్భంగా ట్రైలర్ బాగుందని బాబీ అన్నారు. సినిమా విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.
అరవై ఏళ్ల సావిత్రి తన భర్త తప్పిపోయాడని ఇరవై ఏళ్ల సత్యమూర్తి ఫొటోను పోలీసులకు చూపించే సన్నివేశంతో ట్రైలర్ వినోదాత్మకంగా మొదలైంది. సీనియర్ సిటిజన్స్ అందరూ ఇరవై ఏళ్ల సత్యమూర్తిని అన్నయ్య, పెదనాన్న,క్లాస్‌మేంట్ అంటూ చెప్పడం నవ్విస్తుంది. సత్యమూర్తి లైఫ్‌లో ఇరవై ఏళ్ల వయసులో ఏదో జరిగింది అంటూ సస్పెన్స్‌ను జోడించారు. కామెడీ, సస్పెన్స్, రొమాన్స్ అంశాలతో ట్రైలర్ విందుభోజనంలా ఉంది.
నిర్మాత గోగుల నరేంద్ర మాట్లాడుతూ దర్శకుడు బాబీ మా చిత్ర ట్రైలర్‌ను విడుదలచేయడం ఆనందంగా ఉంది. ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నాం. సినిమా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. త్వరలో ఆడియోను విడుదల చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు.
దర్శకుడు చైతన్య కొండ మాట్లాడుతూ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. ఇటీవల విడుదలైన టీజర్‌తో పాటు ఫస్ట్ సింగిల్‌కు చక్కటి స్పందన లభిస్తోంది. ప్రారంభం నుంచి ముగింపు వరకు కడుపుబ్బా నవ్విస్తుందని చెప్పారు.
శివారెడ్డి, సుమన్ శెట్టి, గౌతంరాజు, అనంత్, జెన్ని, సుబ్బరాయశర్మ, కోట శంకరావు, పద్మజయంతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), ప్రొడక్షన్ కంట్రోలర్: కె. ఎల్లారెడ్డి, ఎడిటర్: మహేష్, నేపథ్య సంగీతం: మహిత్ నారాయణ, స్వరాలు: సత్య కశ్యప్, సినిమాటోగ్రఫీ: ఆనంద్ డోల, ప్రొడ్యూసర్: గోగుల నరేంద్ర, కథ - డైలాగ్స్ - స్క్రీన్ ప్లే - డైరెక్షన్: చైతన్య కొండ.