శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (10:47 IST)

పవన్‌కు కౌంటరిచ్చిన అలీ.. మీరు నాకేమైనా డబ్బులిచ్చారా? ఇండస్ట్రీలోకి రాక ముందే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కమెడియన్ అలీ ఇద్దరూ మంచి స్నేహితులు. వీరిద్దరూ సినిమాల్లో కలిసి నటిస్తే ఆ సినిమా బంపర్ హిట్టే. ఈ నేపథ్యంలో పవన్ జనసేన పార్టీతో రాజకీయ అరంగేట్రం చేయగానే.. అలీ ఆ పార్టీలో చేరిపోతారని అందరూ భావించారు.


కానీ, అలీ అందుకు విరుద్ధంగా వైసీపీలో చేరి పవన్ సహా అందరికీ షాకిచ్చారు. ఈ నేపథ్యంలో అలీపై పవన్ కల్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తనకు మిత్రుడైన అలీ జగన్‌తో చేతులు కలపడం జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. 
 
అలీ చెప్పిన వాళ్లకు జనసేన తరపున టిక్కెట్‌ ఇచ్చినా.. తనను వదిలి వెళ్లారని, మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. అలీ కష్టాల్లో ఉన్నప్పుడు తాను అండగా ఉన్నానని.. తనతో కలిసి పనిచేస్తానని చెప్పి ఇప్పుడు చెప్పా పెట్టకుండా వైసీపీలోకి వెళ్లిపోయారని పవన్ విమర్శించారు. అలీ లాంటి వారి వల్ల మనుషులపై నమ్మకం పోతుందని పవన్ ఆవేదన వెల్లగక్కారు. 
 
అలీ స్వస్థలం రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ ఈ కామెంట్స్ చేయడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. అవసరంలో ఆదుకున్న అలీ లాంటి వాడే వదిలేస్తే.. ఇంకా తాను ఎవరిని నమ్మాలని ప్రశ్నించారు. అందుకే ప్రజలను తప్ప ఎవ్వరినీ నమ్మడం లేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
 
వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌.. ఓటుకు రూ.2000 ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని పవన్ ఆరోపించారు. అలీని జగన్‌ వాడుకొని వదిలేశారన్నారు. అలీ సూచించిన వ్యక్తికే పవన్.. నరసారావుపేట ఎంపీ టికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ, ఆయన వైసీపీకి ప్రచారం చేస్తుండటం పవన్‌కు ఆగ్రహం తెప్పించింది. అలీ వైసీపీలో చేరినా.. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్‌పై నేరుగా విమర్శలు చేయలేదు. 
 
అయితే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై అలీ స్పందించారు. పవన్ కల్యాణ్ తనను జనసేనలోకి ఆహ్వానించలేదన్నారు. పవన్ కల్యాణ్ ఎప్పుడూ బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను మొదటి వ్యక్తినన్నారు. పవన్‌పై తాను ఎలాంటి కామెంట్లు చేయనప్పటికీ.. తనపై పవన్ ఆరోపణలు చేయడం ఎంతగానో బాధించిందని కామెంట్స్ చేశారు. తాను వైసీపీలో చేరితే తప్పేంటి అంటూ ప్రశ్నించారు. 
 
మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలో పవన్ సినిమాల్లోకి వచ్చారు. కానీ తాను స్వశక్తితోనే ఇండస్ట్రీలోకి వచ్చానని పవన్‌కు అలీ చురకలు అంటించారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు తాను అండగా ఉన్నానని పవన్ అన్నారు. పవన్ కల్యాణ్ నాకు సాయం చేశారా? ఇంట్లో ఖాళీగా వుంటే ఆయన నాకు అవకాశాలు ఇప్పించారా? డబ్బులు ఇచ్చారా అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు.
 
పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలోకి రాక ముందు నుంచే తాను మంచి పొజిషన్లో ఉన్నానని అలీ గుర్తు చేశారు. ఆర్థిక సాయం చేయాలని ఎవర్నీ ఏనాడూ అడగలేదన్నారు. అల్లా దయతో బాగున్నాను, ఆకలితో చస్తాను తప్పితే.. వెళ్లి ఎవర్నీ అడగనని అలీ చెప్పుకొచ్చారు. తాను వైసీపీలోకి చేరడం న్యాయం కాదని, వైసీపీలోకి తాను వెళ్లకూడదని రాజ్యాంగంలో రాసి లేదని అలీ కౌంటరిచ్చాడు. 
 
ఏ పార్టీలోకి వెళ్లాలనే స్వేచ్ఛ నా లేదా? అని అలీ నిలదీశారు. నా బంధువుకి జనసేన టికెట్ ఇచ్చానని పవన్ అంటున్నారు. కానీ తనకు టికెట్ ఇవ్వమని నేను మిమ్మల్ని అడిగానా? అని ప్రశ్నాస్త్రాలు సంధించారు.