బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 మే 2020 (16:42 IST)

కరోనాకు తర్వాత కొత్త వైరస్ మిడతలు.. భారత్‌కు కొత్త చిక్కు.. (video)

భారత్‌కు ఇతర దేశాల నుంచి వస్తున్న ముప్పు కారణంగా జనాలు జడుసుకుంటున్నారు. ఇప్పటికే చైనా నుంచి కరోనా ప్రపంచ దేశాలను అట్టుడికిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాకిస్థాన్ నుంచి భారత్‌కు మిడతల సమస్య వచ్చి పడింది. పాకిస్థాన్ నుంచి భారత్‌కు దూసుకువచ్చిన లక్షలాది మిడత దండు.. ఉత్తరాదిన ఇప్పటికే లక్షలాది ఎకరాల్లో పంటలను స్వాహా చేసింది. ప్రస్తుతం ఈ మిడతల బాధ తెలంగాణకు కూడా వచ్చేసింది.
 
మిడతల బాధ తెలంగాణ సమీపానికి రావడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. ఈ రాకాసి మిడతలు రాజస్థాన్ మీదుగా ఇప్పటికే మహారాష్ట్రలోని అమరావతిలోకి ప్రవేశించాయి. అక్కడి అధికారులు వీటిని పారద్రోలేందుకు నియంత్రణ చర్యలు చేపడుతుండగా, వాటి నియంత్రణ సాధ్యం కాకుంటే, అవి తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తమైన వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, నిపుణులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. సరిహద్దు జిల్లాల్లో రసాయనాలతో సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. 
 
ఇందుకోసం జిల్లా, గ్రామస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఈ మిడతల దండు గంటకు 15 కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తూ, చెట్లపై నివాసం ఉంటూ, పంటలకు నష్టం కలిగిస్తున్నాయని వెల్లడించిన జనార్దన్ రెడ్డి, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, భూపాలపల్లి, నిర్మల్, కామారెడ్డి జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రతి గ్రామంలో రసాయనాలను సిద్ధం చేసుకోవాలని, ఈ విషయంలో రైతుల్లో అవగాహన పెంచి, చైతన్యవంతం చేయాలని అన్నారు. 
 
మరోవైపు ఈ మిడతలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకూ విస్తరించాయి. తమ బరువుకు సమానమైన ఆహారాన్ని రోజూ లాగించే వీటిల్లో సంతానోత్పత్తి కూడా చాలా వేగంగా జరుగుతూ ఉంటుంది. జూన్ లోగా దేశంలోకి వచ్చిన మిడతల సంఖ్య 400 రెట్ల వరకూ పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. 
 
ఇంకా మిడతలను నాశనం చేసే ప్రక్రియలో వున్నామని, వాటిని నియంత్రించడం కష్టతరమవుతుందని.. అవి ఎక్కువ ఎత్తులో ఎగురుతున్నాయని వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బిఆర్ కద్వా తెలిపారు. వాతావరణ నమూనాలే ఈ మిడతల కీటకాల సంఖ్యను పెంచేందుకు కారణమయ్యాయని కద్వా చెప్పారు. అలాగే మిడతలు ప్రస్తుతం రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో చురుకుగా పనిచేస్తున్నాయి. 
 
రాజస్థాన్ ప్రస్తుతం ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రంగా ఉందని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశం ఇప్పటికే ఒక మహమ్మారి మధ్యలో ఉన్నప్పుడు మిడతల దాడి సంభవించింది. ఇప్పటికే కరోనా వైరస్‌తో వ్యవహరిస్తున్నందున తమకు ఇది చాలా ఘోరంగా సమయం అని పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.