జాబిల్లికి మరింత చేరువగా చంద్రయాన్-2... విజయవంతంగా చంద్ర కక్ష్యలోకి...
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన శాస్త్రవేత్తలు ప్రయోగించిన చంద్రయాన్ 2 వాహకనౌక చందమామకు మరింత చేరువైంది. జూన్ నెల 22వ తేదీన నింగిలోకి పంపిన చంద్రయాన్ 2 వాహకనౌక ప్రయాణంలో భాగంగా, మంగళవారం కీలక ఘట్టం చోటుచేసుకుంది.
ఈ చంద్రయాన్-2ను ప్రయోగించిన 29 రోజుల తర్వాత ఈ వాహకనౌక చందమామ కక్ష్యలోకి విజయవంతంగా చేరింది. ఇస్రో శాస్త్రవేత్తలు మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల మధ్యలో 'మేక్ ఆర్ బ్రేక్'గా వ్యవహరించే ఈ ప్రక్రియను పూర్తి చేశారు.
ఇందుకోసం చంద్రయాన్-2 వేగాన్ని తగ్గించిన శాస్త్రవేత్తలు.. వాహకనౌకను చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా చేర్చారు. ఇందుకోసం నౌకలోని ద్రవ ఇంజిన్‌ను మండించారు. ఈ నెల 21, 28, 30 తేదీల్లో ఇదే తరహా ప్రక్రియను చేపట్టి వాహకనౌకను చంద్రుడికి 150 కిలోమీటర్ల సమీపానికి తీసుకెళతారు.
ఈ వాహకనౌకలోని ల్యాండర్ వచ్చే నెల 7వ తేదీన చంద్రుడిపై ల్యాండ్ కానుంది. అనంతరం అందులోని రోవర్ ముందుకు దూసుకుపోనుంది. అనంతరం అక్కడి ఖనిజాలను, ఇతర వనరులను విశ్లేషించి సమాచారాన్ని ఆర్బిటర్, ల్యాండర్ ద్వారా భూమికి చేరవేయనుంది.