సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2019 (11:16 IST)

నేడు అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ శత జయంతి

భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయి శతజయంతి వేడుకలను భారత శాస్త్రవేత్తలు సోమవారం ఘనంగా జరుపుకుంటున్నారు. ఈయన భారత అంతరిక్ష పరిశోధనకు మూల పురుషుడు. అందుకే ఈయన పేరుమీద అంటే విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఉంది. ఇది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన ప్రధాన కేంద్రం. ఇది భారత ఉపగ్రహ కార్యక్రమానికి చెందిన అంతరిక్ష వాహనాల (శాటిలైట్స్)ను తయారు చేస్తుంది. 
 
ఈ కేంద్రం కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉంది. ఈ కేంద్రం 1962 లో తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషనుగా మొదలైంది. 1971 డిసెంబరు 30న భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడైన డా. విక్రం సారాభాయ్ మరణం తర్వాత, ఈ కేంద్రానికి ఆయన పేరు పెట్టారు. ఈ కేంద్రంలోనే సౌండింగు రాకెట్లు, రోహిణి, మేనక లాంచర్లు, ఎస్సెల్వీ, ఏఎస్సెల్వీ, పిఎస్‌ఎల్‌వి, జిఎస్‌ఎల్‌వి మార్క్ 3 మొదలైన వాహక నౌకల రూపకల్పన కేంద్రమిది.
 
విక్రమ్ సారాభాయి గత 1919 ఆగస్టు 12వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులో జన్మించారు. వారి కుటుంబం ధనవంతులైన వ్యాపారస్తుల కుటుంబం. ఆయన తండ్రి అంబాలాల్ సారాభాయ్ అక్కడ పేరు పొందిన పారిశ్రామికవేత్త. ఆయనకు అక్కడ ఎన్నో మిల్లులు ఉండేవి. అంబాలాల్, సరళా దేవి దంపతులకు కలిగిన ఎనిమిది మంది సంతానంలో విక్రం సారాభాయ్ ఒకడు.
 
తన ఎనిమిది మంది పిల్లలను చదివించడానికి విక్రం సారాభాయి తల్లి మాంటిస్సోరీ తరహాలో ఒక ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేసింది. వీరి కుటుంబం స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటూ ఉండటం మూలాన వారింటికి మహాత్మాగాంధీ, మోతీలాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, మరియు జవహర్‌లాల్ నెహ్రూ మొదలైన ఎంతో మంది ప్రముఖులు తరచూ వస్తూ ఉండేవారు. వీరు విక్రం సారాభాయ్ వ్యక్తిత్వాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు.
 
 
అహమ్మదాబాదులోని గుజరాత్ కళాశాలలో మెట్రిక్ విద్యను పూర్తి చేసుకున్న విక్రమ్ సారాభాయ్... తరువాత పై చదువుల కోసం ఇంగ్లండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి వెళ్లారు. 1940వ సంవత్సరంలో అక్కడ నాచురల్ సైన్సెస్‌లో, ట్రిపోస్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఆ సమయంలో రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభం కావటంతో భారతదేశానికి తిరిగివచ్చిన విక్రమ్ సారాభాయ్... బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో సర్ సీ.వీ.రామన్ పర్యవేక్షణలో కాస్మిక్ కిరణాలపై పరిశోధన మొదలుపెట్టారు. 
 
తదనంతరం రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1945వ సంవత్సరంలో తిరిగీ కేంబ్రిడ్జి యూనివర్సిటీకి వెళ్లి పీహెచ్‌డీ పట్టాను సాధించుకుని 1947లో తిరిగి భారత్ చేరుకున్నారు. 1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్‌ను ప్రయోగించినపుడు... భారత భవిష్యత్ అవసరాలకు శాటిలైట్ల అవసరం గురించి ఎంతో విషయ సేకరణ చేయటమేగాకుండా, ఆ శాటిలైట్ యొక్క ఆవశ్యకతను అప్పటి ప్రధానమంత్రి అయిన జవహర్‌లాల్ నెహ్రూకు వివరించి, ఆయనను ఒప్పించారు.
 
ఆ పిమ్మట భారత అణుశక్తి వ్యవస్థ పితామహుడైన హోమీ బాబా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ (ఐఎన్‌సీఓఎస్‌పీఏఆర్) సెంటర్‌ను ఆయన ఏర్పాటు చేశారు. తదనంతరం ఆయన ఆదర్శాలకు అనుగుణంగా ఇస్రో ఎన్నో విజయాలను సాధించి భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపచేసింది.
 
'భారత అంతరిక్ష రంగ పితామహుడు'గా కీర్తి గడించిన సారాభాయ్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను 1962లో శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డుతో, 1966లో పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. జాతీయ స్థాయిలోను, అంతర్జాతీయంగానూ అర్థవంతమైన పాత్ర పోషించగలగాలంటే, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని మానవ సమాజ సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవడంలో మనం ఎవరికీ తీసిపోకుండా ఉండాలని చెప్పి, ఆ దిశగా కృషి చేసిన సారాభాయ్ 1971, డిసెంబరు 31వ తేదీన పరమపదించారు. ఇస్రో ఇటీవల చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్ సెప్టెంబర్ 7న చంద్రుని ఉపరితలాన్ని తాకనుంది