సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 అక్టోబరు 2019 (16:26 IST)

తెలంగాణ గవర్నర్‌కు కేంద్రం పిలుపు... ఆగమేఘాలపై హస్తినకు చేరిక..

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు కేంద్రం నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆమె మంగళవారం ఆగమేఘాలపై హస్తినకు చేరుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఆర్టీసీ కార్మికులు గత 11 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, ఇద్దరు ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడటంతో ఈ సమ్మె తీవ్రరూపం దాల్చింది. 
 
అయినప్పటికీ.. ప్రభుత్వం ఏమాత్రం పట్టుసడలించడంలేదు. సమ్మె కారణంగా రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులను కూడా పొడగించింది. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసైతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. 
 
అదేసమయంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం కూడా నిశితంగా గమనిస్తోంది. సమ్మెపై గవర్నర్‌ను కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది. అంతేకాదు, ఢిల్లీకి రావాలంటూ ఆదేశించగా, ఆమె ఆగమేఘాలపై ఢిల్లీకి చేరుకుంది. 
 
కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు ఆమె హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరారు. ఆమె మంగళవారం రాత్రికి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలతో సమావేశమై తాజా పరిస్థితిని వివరిస్తారు. ఆ తర్వాత కేంద్రం చర్యలు ఏ విధంగా ఉంటాయోనన్న చర్చ ఇపుడు సాగుతోంది. 
 
తెలంగాణాలో రాష్ట్రపతి పాలనకు రంగం సిద్ధం..?
 
తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దక్షిణాది రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా తెలంగాణపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నంకానుండడంతో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ ముఖ్యనేతలతో సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ ఆందోళన కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ కంటికి గాయాలు కావడం, అరెస్టులతో పరిస్థితి ఉద్రిక్తం కావడం, ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం, ఒక డ్రైవర్ చావుబతుకుల్లో ఉండటంవంటి ఉద్రిక్త పరిస్థితులతో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య రావడంతో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. 
 
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో బీజేపీ దానిని అనుకూలంగా మార్చుకునేందుకు, కేసీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసేందుకు కేంద్రం ఏ క్షణంలోనైనా రాష్ట్రపతి పాలన విధించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. అదే జరిగితే ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వం లేకుండా గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు లభించనున్నాయి. గవర్నర్, పోలీసుల సారధ్యంలో రాష్ట్రంలో కొంతకాలం పాలన సాగనుంది.