గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 నవంబరు 2020 (17:31 IST)

అమరావతిని తరలించాలనే ఆలోచన మతిలేని చర్య కాదా? : హైకోర్టు

అమరావతి తరలింపుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన నిర్మించ తలపెట్టిన అమరావతిని మరో ప్రాంతానికి తరలించాలనే ఆలోచన చేయడం మతిలేని చర్య కాదా? అంటూ సూటిగా ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వం తరపు న్యాయవాది బిక్కమొహం పెట్టారు. అయితే, హైకోర్టు ఈ తరహా వ్యాఖ్యలు ఎందుకు చేసిందో ఓ సారి పరిశీలిద్ధాం. 
 
గతంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్టణంలో రోడ్‌షోను నిర్వహించేందుకు విశాఖ ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. అయితే, బాబు రోడ్‌షోకు అనుమతి లేదని పేర్కొంటూ ఆయన్ను ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆయనలో ఓ నోటీసు పెట్టి.. అక్కడ నుంచి వెనక్కి పంపించేశారు. ఈ అంశంపై హైకోర్టు టీడీపీ నేత ఒకరు ఓ పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఇది శుక్రవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున న్యాయవాది ఓ అఫిడవిట్ దాఖలు చేశారు. ఇందులో చంద్రబాబు రోడ్ షో‌ను అడ్డుకోవడం ప్రభుత్వం మతిలేని చర్యగా పిటిషనర్ పేర్కొన్నారు. దీన్ని ప్రభుత్వం తరపు న్యాయవాది తీవ్రంగా ఆక్షేపించారు. 
 
అపుడు ధర్మాసనం కలుగజేసుకుని... రూ.వేల కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన అమరావతి రాజధానిని తరలించాలనే ఆలోచన మతిలేని చర్య కాదా? అని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. ఈ సందర్భంగా రాజకీయాల్లో నేరప్రవృత్తి పెరిగిపోతోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. 
 
దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు సూచించింది. నేరచరిత్ర కలిగిన వారి నుంచి వ్యవస్థలను కాపాడాలని, అపుడే సమాజం బాగుంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాకుండా, రాజధాని తరలింపుపై పిటిషన్లు దాఖలైవున్నాయని, తరలింపు అంశం అక్కడ తేలుతుందని పేర్కొంది.