సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2019 (15:56 IST)

ఒక్క ఎమ్మెల్యే ఉన్న పార్టీపై 151 మంది ఎమ్మెల్యేలు దండెత్తుతున్నారు : పవన్

కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్న పార్టీపై 151 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా దండయాత్ర చేస్తున్నారనీ, అంటే ప్రభుత్వ పనితీరులోని లోపం ఉన్నట్టేనని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం విశాఖపట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో 151 మంది ఎమ్మెల్యేలున్న వైసీపీ... ఒక్క ఎమ్మెల్యే ఉన్న తమ పార్టీపై విమర్శలు చేస్తోందన్నారు. దీన్ని బట్టే తమకు రాష్ట్రంలో ఎంతగా బలం ఉందో తెలుస్తోందని అన్నారు. తమ పోరాటంపై ఎంతగా ప్రతి స్పందన వస్తుందో తెలుసుకోవచ్చన్నారు. 
 
'గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశం నాకు కూడా ఉంది. అయితే, వెన్నుపోట్లు, కుట్రలతో నిండిపోయిన రాజకీయాలు సమాజంలో ఉన్నాయి. ఇటువంటి సమాజంలో మనం బలంగా ఉండాలి. అంతేగానీ, వెన్నుపోటు పొడుస్తామంటే పొడిపించుకోవడానికి మేము సిద్ధంగా లేము. పార్టీలో చేరతామని వచ్చే వ్యక్తులు నిస్వార్థంగా ఉంటారని అనుకోవడం పొరపాటే అవుతుంది. అటువంటి వ్యక్తులు ఉంటారని తెలుసు. ఇటువంటివి చూసే నేను రాజకీయాల్లోకి వచ్చాను' అని పవన్ వ్యాఖ్యానించారు. 
 
'దెబ్బతిన్నా తిరిగి లేచి నిలబడతా. ఘోర ఓటమి తర్వాత కూడా ప్రజల్లోకి వస్తున్నాను. అంతిమ లక్ష్యం కోసం అడుగులు వేసుకుంటూ వెళ్తా. మా సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నందుకే ధైర్యంగా అడుగులు వేశా. ఆశయాల కోసం బలంగా నిలబడతా. కష్టాలు ఉన్నప్పుడు వెనకడుగు వేయను. మన సమావేశాలకు వచ్చిన యువతలో 70 శాతం మంది మాకు ఓట్లు వేసినా జనసేనకు 70 సీట్లు వచ్చేవి. జనసేనకు అండగా నిలబడని యువత కోసం నేను ఇప్పటికీ పోరాడుతున్నాను. వారి బాధలను తెలుసుకుంటున్నాను అని పవన్ అభిప్రాయపడ్డారు.