బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (11:45 IST)

మన్మోహన్ పంచ సూత్రాలు : 10 లక్షల మంది రోడ్డునపడతారంటూ హెచ్చరిక

దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనంపై మాజీ ప్రధాని, ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రమాద హెచ్చరికలు చేశారు. ఇపుడే మేల్కొని వివేచనతో చర్యలు తీసుకుంటేనే ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కవచ్చని లేనిపక్షంలో కష్టాలు తప్పవని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా, ఆటో మొబైల్ రంగంలో పది లక్షల మంది వరకు రోడ్డు పడతారని ఆయన హెచ్చరించారు. 
 
తాజాగా నెలకొన్న ఆర్థిక మందగమనంపై ఆయన స్పందిస్తూ, ప్రధాని మోడీ సర్కారు తీసుకున్న పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి కొన్ని నిర్ణయాలు దేశంలో ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యాయని విమర్శించారు. నోట్ల రద్దు, జీఎస్టీలను చారిత్రక తప్పిదాలని ఆయన పేర్కొన్నారు. 
 
1991, 2008 ఆర్థిక సంక్షోభాలను భారత్ గట్టిగానే ఎదుర్కొన్నదన్నారు. నిజానికి ఇప్పటి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నంత మెజారిటీ కూడా అప్పటి మా ప్రభుత్వాలకు లేదన్న ఈ ఆర్థికవేత్త.. అయినప్పటికీ మందగమనాన్ని అధిగమించామని గుర్తుచేశారు. ఇక వార్తల్లో హెడ్‌లైన్స్ మీదనే మోడీ దృష్టి ఉంటుందని, అందుకే దుందుడుకు నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నారని మండిపడ్డారు. ముందు నిపుణులు, పరిశ్రమలతో సంప్రదించి.. మాంద్యం నుంచి గట్టెక్కాలని సూచించారు.
 
ప్రగతికి పంచ సూత్రాలు
వృద్ధి పురోగతికి మన్మోహన్ సింగ్ ఐదు నిర్ణయాలను సూచించారు. 1991, 2008 ఆర్థిక సంక్షోభం నుంచి భారత్‌ను గట్టెక్కించిన ఘనతను అందుకున్న సింగ్ సూచించిన వాటిలో..
 
* జీఎస్టీ హేతుబద్ధీకరించాలి. స్వల్ప కాలానికి పన్ను వసూళ్లు తగ్గుతున్నా పట్టించుకోకుండా దీర్ఘకాల ప్రయోజనాలే ధ్యేయంగా నిర్ణయాలు తీసుకోవాలి.
* వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలి. గ్రామీణ వినియోగ సామర్థ్యాన్ని ఉత్తేజపరుచాలి.
* నగదు కొరతను తీర్చాలి. ద్రవ్య వ్యవస్థలో భారీగా నిధుల లభ్యతను పెంచాలి.
* టెక్స్‌టైల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, చౌక గృహాలు తదితర రంగాలకు ప్రోత్సాహకాలను అందించాలి. 
* కొత్త ఎగుమతి మార్కెట్లను గుర్తించి, ఆ దిశగా ఎగుమతులను పెంచుకోవాలి. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఇది చాలా అవసరమని ఆయన చెప్పుకొచ్చారు.