ప్రియురాలిని కలవాలి.. ఏ స్టిక్కర్ వాడాలి.. ముంబై పోలీసుల హాస్యాస్పద ట్వీట్
కోవిడ్-19 కేసుల ఉధృతిని తగ్గించేందుకు ముంబైతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వం సెక్షన్ 144ను అమలు చేస్తుంది. అత్యవసర, అవసరమైన సేవల్లోని వాహనాల కదలికను పరిమితం చేసేందుకు పోలీసులు కలర్ కోడెడ్ స్టిక్కర్లను తప్పనిసరి చేశారు. సరైన సమాధానం లేకుండా వీధుల్లోకి వచ్చే వాహనదారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
తాజాగా కర్ఫ్యూ సమయంలో తన ప్రియురాలిని మిస్ అవుతున్నట్లు, ఆమెను కలిసేందుకు దారేది అని అడిగిన ఓ నెటిజన్‌కు ముంబై పోలీసులు చమత్కారంగా సమాధానం ఇచ్చారు. ట్విట్టర్ వినియోగదారుడికి ముంబై పోలీసులు హాస్యాస్పద సమాధానం ఇచ్చారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
అశ్విన్ వినోద్ అనే ట్విట్టర్ యూజర్ ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ తన ప్రియురాలిని మిస్ అవుతున్నట్లు, తనని కలవాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేస్తూ తన వాహనానికి ఏ స్టిక్కర్ వాడాలి అని అడిగాడు. దీనికి ప్రతిస్పందనగా ముంబై పోలీసులు స్పందిస్తూ.. మీ అవసరం అత్యవసర సేవల వర్గంలోకి రాదని, ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నట్లు అభ్యర్థించారు. ఇది మీకు చాలా అవసరం అని మేము అర్థం చేసుకున్నాం.
కానీ దురదృష్టవశాత్తు ఇది మా నిత్యావసర సేవల పరిధిలోకి రాదు. ఎడబాటు హృదయాలను మరింత దగ్గరచేస్తుంది. ప్రస్తుతం మీరు ఆరోగ్యంగా ఉన్నారు. మీరు జీవితకాలం కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇది ఒక విరామం మాత్రమేనన్నారు. ఇంటి వద్దే ఉండండి ఆరోగ్యంగా ఉండండి అని పోలీసులు ట్వీట్ చేశారు.