శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2019 (18:12 IST)

బాలాకోట్‌లో ఉగ్ర కదలికలు... పీవోకే లక్ష్యంగా దాడి చేస్తాం : బిపిన్ రావత్

ఉగ్రవాదులను ప్రేరేపిస్తున్న పాకిస్థాన్‌కు భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ హెచ్చరిక చేశారు. ఈ దఫా దాడికి దిగితే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను హస్తగతం చేసుకోవడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని బాలాకోట్‌లో భారత్ ధ్వంసం చేసిన ఉగ్రవాద శిబిరం మళ్లీ తెరుచుకుందన్నారు. ఇక్కడ నుంచి వందల సంఖ్యలో ఉగ్రవాదులు భారత్‌లో చొచ్చుకుని వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 
 
ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్‌లో జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 50 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడికి తమదే బాధ్యత అంటూ పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రకటించుకుంది. దీంతో ఫిబ్రవరి 26వ తేదీన బాలాకోట్‌లోని జైషే ప్రధాన స్థావరంపై భారత వైమానిక దళం మెరుపుదాడికి దిగి బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో ఉగ్రస్థావరాలన్నీ నేలమట్టమయ్యాయి. అయితే, ఇపుడు మళ్లీ ఇక్కడ ఉగ్ర కార్యకలాపాలు ప్రారంభమైనట్టు ఆయన చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 'ఇటీవలే పాకిస్థాన్ మళ్లీ బాలాకోట్‌ను తెరిచింది. బాలాకోట్ ధ్వంసమైందనీ.. మళ్లీ దాన్ని పునరుద్ధరించారని దీన్ని బట్టి అర్థమవుతోంది. భారత వైమానిక దళం తీసుకున్న చర్యల తర్వాత మళ్లీ ఇప్పుడు అక్కడికి ఉగ్రమూకలు చేరాయి' అని వెల్లడించారు. ఉగ్రవాదులను ప్రేరేపించడాన్ని పాక్ మానుకోవాలనీ.. తాము బాలాకోట్ సైతం దాటుకుని వెళ్లి దాడులు చేయగలమని ఆయన హెచ్చరించారు.