సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 1 జులై 2024 (20:02 IST)

పవన్ కల్యాణ్ అనే నేను పిఠాపురం అభివృద్ధికోసం ఆఖరి శ్వాస వరకూ... (video)

pawan kalyan
పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు పిఠాపురం ప్రజలనుద్దేశించి ప్రతిజ్ఞ చేసారు. ఆయన చేస్తున్న ప్రతిజ్ఞకు ప్రజలు, జనసైనికుల నుంచి అశేషమైన స్పందన లభించింది. పవన్ కల్యాణ్ మాటల్లోనే... " పవన్ కల్యాణ్ అనే నేను, పిఠాపురం అభివృద్ధికి, అభ్యున్నతకి, నిరంతరం, ఆఖరి శ్వాస వరకూ పనిచేస్తానని, దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను'' అంటూ చెపుతుండగా అక్కడ వున్నవారందరూ కేరింతలు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు.
 
ఖజనాలో ఒక్క పైసా లేదు, జీతం ఎలా తీసుకునేది?
తాను చేపట్టిన మంత్రిత్వ శాఖల్లో పంచాయతీరాజ్ శాఖ ఒకటని, ఆ శాఖ ఖజానాలో ఒక్క పైసా లేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఒక మంత్రిగా నెలవారీ వేతనం తీసుకోవడం ఏమాత్రం మనసు అంగీకరించడం లేదని జనసేన పార్టీ అధినేత, సినీ హీరో, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అందుకే వేతనం తీసుకోకుండా పని చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. పైగా, భారీ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు తాను ఎన్నటికీ రుణపడి ఉంటానని చెప్పారు. 
 
కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సోమవారం నిర్వహించిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన అనంతరం మాట్లాడారు. 'శాఖలపై అధ్యయనానికి కొంత సమయం తీసుకున్నా. తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలనుకుంటున్నా. అధికారంలోకి వచ్చాక పింఛన్లు పెంచి ఇచ్చామే తప్ప తగ్గించలేదు. రాష్ట్రానికి సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి. 
 
గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో తెలియట్లేదు. వందలకోట్ల రూపాయలతో రుషికొండలో ప్యాలెస్‌ కట్టుకున్నారు. అవే నిధులు ఉపయోగిస్తే కొంత అభివృద్ధి జరిగేది. నా వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదు. పర్యావరణ శాఖను బలోపేతం చేస్తాం. గోదావరి పారుతున్నా తాగునీటికి ఇబ్బందులున్నాయి. గతంలో జల్‌జీవన్‌ మిషన్‌ నిధులున్నా ఉపయోగించలేదు. కనీసం మ్యాచింగ్‌ గ్రాంట్లు కూడా ఇవ్వలేదు. 
 
క్యాంపు ఆఫీస్‌లో మరమ్మతుల గురించి అధికారులు అడిగితే ప్రస్తుతానికి ఏమీ చేయొద్దని చెప్పా. అవసరమైతే కొత్త ఫర్నిచర్‌ నేనే తెచ్చుకుంటానని తెలిపాను. సచివాలయం నుంచి సిబ్బంది వచ్చి వేతనాలకు సంబంధించిన పత్రాలపై సంతకాలు పెట్టమంటే నాకు మనస్కరించలేదు. జీతం తీసుకుని పనిచేద్దామనుకున్నా.. కానీ పంచాయతీరాజ్‌ శాఖలో నిధుల్లేవు. 
 
ఎన్ని వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయో తెలియడం లేదు. ఒక్కో విభాగం తవ్వే కొద్దీ లోపలికి వెళ్తూనే ఉంది. ఇవన్నీ సరిచేయాలి. శాఖ అప్పుల్లో ఉన్నప్పుడు నాలాంటివాడు జీతం తీసుకోవడం చాలా తప్పు అనిపించింది. అందుకే జీతం వదిలేస్తున్నాను అని చెప్పా. దేశం కోసం, నేల కోసం పనిచేస్తున్నానని తెలిపాను.
 
విజయయాత్రలు మాత్రమే చేయడానికి నేను సిద్ధంగా లేను. గెలిచినందుకు ఆనందం లేదు.. పనిచేసి మన్ననలు పొందితేనే ఆనందం. పిఠాపురాన్ని దేశంలో మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది నా ఆకాంక్ష. కాలుష్యం లేని పరిశ్రమలు ఇక్కడికి రావాలి. విదేశాలకు వెళ్లే వారికి శిక్షణ ఇప్పించి పంపాలి. డబ్బులు వెనకేసుకోవాలనో, కొత్తగా పేరు రావాలనో నాకు లేదు. ప్రజల్లో నాకు సుస్థిర స్థానం కావాలి. అన్ని పనులూ చిటికెలో కావు.. కానీ అయ్యేలా పని చేస్తాం. పార్టీకి ఓటు వేయకపోయినా అర్హత ఉంటే పింఛన్లు వస్తాయి. అద్భుతాలు చేస్తామని చెప్పట్లేదు.. ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుంది' అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.