సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : శుక్రవారం, 4 మే 2018 (17:47 IST)

గాలివాన మరణాలు బాధాకరం: పవన్ కల్యాణ్

తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి సృష్టించిన బీభత్సంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులతో 17మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఉత్తర భారత్‌లో 109 మం

తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి సృష్టించిన బీభత్సంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులతో 17మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఉత్తర భారత్‌లో 109 మంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని జనసేనాని అన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ, మృతుల కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు పవన్ తెలిపారు. 
 
సైన్స్ ఎంతగానో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ప్రకృతి ప్రకోపం నుంచి ప్రజలను మనం రక్షించుకోలేకపోవడం దురదృష్టకరమని పవన్ చెప్పారు. అకాల వర్షాలు సంభవిస్తాయని.. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిసినప్పటికీ పౌర పాలనా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంలో తరచూ విఫలమవుతున్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు. 
 
తెలంగాణలో పది మంది, ఏపీలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం చిన్న విషయం కాదని.. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభుత్వాలు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలన్న విషయాన్ని ఈ దుర్ఘటన మరోసారి గుర్తుచేస్తోందని పవన్ వ్యాఖ్యానించారు.
 
అలాగే రైతులు కష్టపడి పండించిన పంటను రైతులు యార్డులకు చేర్చినా.. అక్కడ సరైన వసతులు లేకుండా ధాన్యం, మొక్కజొన్న వంటి వేలాది టన్నుల పంట వర్షానికి తడిసిపోవడం దురదృష్టకరమని పవన్ వ్యాఖ్యానించారు. వర్ష బీభత్సానికి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత ఆర్థిక సాయాన్ని అందచేయాలని పవన్ విజ్ఞప్తి చేశారు.