పవన్ కల్యాణ్ ఆమరణ దీక్ష చేస్తారా?
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆమరణ దీక్ష చేస్తారని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవం. తప్పుడు సమాచారంతో పార్టీ లెటర్ హెడ్‌పై పార్టీ అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ పేరిట ప్రెస్ నోట్ సృష్టించారు. అసత్యమైన ఆ ప్రెస్ నోట్‌ను ఎవరూ విశ్వసించవద్దు. ఈ తప్పుడు లేఖను సృష్టించి, ఫోర్జరీ సంతకం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పార్టీ లీగల్ విభాగం సన్నద్ధమైందని జనసేన ఓ ప్రకటనలో తెలిపింది.
ఇటీవలి ఎన్నికల తర్వాత తొలిసారిగా విశాఖ జిల్లా గాజువాక వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు స్థానిక కార్యకర్తలు, నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ నేతలపై అక్రమంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోకుంటే సత్తా చూపిస్తామని అన్నారు.
కార్యకర్తలకు మార్గ నిర్దేశనం చేస్తూ.. భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీ పోరాటాలపై వివరించారు. గాజువాకను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వివేకా హత్య, కోడికత్తి కేసులు వైసీపీ ప్రభుత్వంపై వేలాడుతున్నాయన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్, శాసనసభ్యుడు అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.