పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం ఇదే....
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నారు. అలాగే, ఆయన సారథ్యంలోని జనసేన పార్టీ కూడా 175 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయనుంది. ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఇందుకోసం అభ్యర్థుల కోసం ఎంపిక కూడా కొనసాగుతోంది.
అయితే, పవన్ కళ్యాణ్ సైతం తమ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థులను సాధ్యమైనంత తొందరగా ఖరారు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. తనకు పిఠాపురం నుంచి పోటీ చేయాలని ఉందని గతంలో పార్టీ శ్రేణుల దగ్గర వ్యాఖ్యానించిన పవన్... ఈ విషయంలో తుది నిర్ణయం పార్టీ నేతలతో చర్చించిన తర్వాతే తీసుకుంటామని చెప్పింది.
అయితే ఎన్నికల సమీపిస్తున్న వేళ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు మళ్లీ జోరందుకున్నాయి. సాధారణంగా జనసేన టికెట్ల కోసం ఉభయ గోదావరి జిల్లాల్లో పోటీ ఎక్కువగా ఉంది. అయితే పిఠాపురం సీటును మాత్రం జనసేన నేతలెవరూ పెద్దగా ఆశించడం లేదని... ఇందుకు అసలు కారణం పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడమే అనే వాదనలు కూడా ఉన్నాయి.