శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 24 మే 2022 (18:31 IST)

మంత్రిపై అవినీతి మరక: గంటల్లో బర్తరఫ్ చేసిన పంజాబ్ సీఎం, ఏడ్చిన కేజ్రీవాల్

Punjab CM
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన మంత్రిమండలిలో ఆరోగ్య శాఖామంత్రి విజయ్ సింగ్లాపై అవినీతి ఆరోపణల నేపధ్యంలో బలమైన సాక్ష్యాలు లభించిన వెంటనే అతనిని మంత్రివర్గం నుండి తొలగించారు. టెండర్లపై మంత్రి సింగ్లా ఒక శాతం కమీషన్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అతనిని మంత్రి పదవి నుంచి తొలగించిన వెంటనే, పంజాబ్ అవినీతి నిరోధక శాఖ అతడిని అరెస్టు చేసింది.

 
10 రోజుల క్రితమే మంత్రిపై ఫిర్యాదు అందడంతో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పూర్తి విచారణకు ఆదేశించారు. ఒక ముఖ్యమంత్రి తమ సొంత మంత్రివర్గ సహచరుడిపై ఇంత కఠిన చర్యలు తీసుకోవడం దేశ చరిత్రలో ఇది రెండోసారి. గతంలో, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్- ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 2015లో అవినీతి ఆరోపణలపై తన మంత్రిమండలిలో ఒకరిని తొలగించారు.

 
సింగ్లా అవినీతిపై 10 రోజుల క్రితం ఓ ప్రభుత్వ అధికారి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. తనకు అండగా ఉంటానని, ఏ మంత్రులకు భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి స్వయంగా అధికారికి హామీ ఇచ్చారు. ఆ తర్వాత అధికారి సహాయంతో ఆపరేషన్‌ చేయగా, మంత్రి, ఆయన సన్నిహితులు ఒక శాతం కమీషన్‌ డిమాండ్‌ చేస్తున్నట్లు స్పష్టంగా వెల్లడైంది. కాల్ రికార్డింగ్‌లు, ఇతర సాక్ష్యాలను సేకరించిన తర్వాత చర్య తీసుకున్నారు. అవినీతిని సహించేది లేదని అధికారులను హెచ్చరించారు పంజాబ్ సీఎం.

 
"ఒక శాతం అవినీతిని కూడా సహించబోము" అని మిస్టర్ మాన్ ఒక వీడియో సందేశంలో తెలిపారు. "ప్రజలు ఎన్నో ఆశలతో ఆప్ ప్రభుత్వానికి ఓట్లు వేశారని, దానికి అనుగుణంగా మనం జీవించాలని, అరవింద్ కేజ్రీవాల్ లాంటి కొడుకు, భగవంత్ మాన్ లాంటి సైనికుడు ఉన్నంత కాలం అవినీతిపై మహా యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. మిస్టర్ సింగ్లా తన తప్పులను ఒప్పుకున్నారని ఆయన పేర్కొన్నారు.

 
కేజ్రీవాల్, భగవంత్ మాన్ నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. "భగవంత్ మీ గురించి గర్వపడుతున్నాను. మీ చర్య నాకు కన్నీళ్లను తెప్పించింది. ఈ రోజు మొత్తం దేశం ఆప్ పట్ల గర్వంగా ఉంది" అని ఆయన ట్వీట్ చేశారు.