శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Updated : శుక్రవారం, 14 ఆగస్టు 2020 (19:56 IST)

గట్టెక్కిన గెహ్లాట్‌ .. విశ్వాస పరీక్షలో గెలుపు

రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ విశ్వాస పరీక్షలో గట్టెక్కారు. ఆయన సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో విజయం సాధించింది.

పాలక కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో మూజువాణి ఓటుతో గెహ్లాట్‌ సర్కార్‌ నెగ్గింది. విశ్వాస పరీక్షపై ఓటింగ్‌ అనంతరం సభను ఈనెల 21 వరకూ వాయిదా వేస్తున్నట్టు అసెంబ్లీ స్పీకర్‌ సిపి జోషీ ప్రకటించారు. తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ పార్టీ అగ్రనేతలు రాహుల్‌, ప్రియాంకలతో భేటీ అనంతరం తిరిగి పార్టీ గూటికి చేరడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని సులభంగా నెగ్గింది.

తాను కాంగ్రెస్‌ తరపున పోరాడే శక్తివంతమైన యోధుడనని పేర్కొన్న సచిన్‌ పైలట్‌ ఎలాంటి విపత్కర పరిస్ధితుల్లోనూ పార్టీని కాపాడుకుంటానని చెప్పారు. విశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శాంతి ధరివాల్‌ మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌, మణిపూర్‌, గోవా రాష్ట్రాల్లో ధనం, అధికార బలం ప్రయోగించి ప్రభుత్వాలను బిజెపి కూల్చివేసిందని ఆరోపించారు.

రాజస్తాన్‌లోనూ అదే ప్రయత్నం చేసిన కాషాయ పార్టీ భంగపడిందని అన్నారు. ఇక 200 మంది సభ్యులు కలిగిన రాజస్తాన్‌ అసెంబ్లీలో గెహ్లాట్‌ సర్కార్‌కు 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా, బిజెపి సంఖ్యాబలం 72గా ఉంది.