ఆ రాష్ట్రాల్లో 'క్లేడ్ ఏ3ఐ' రకం కరోనా .. అందుకే వైరస్ పంజా!!
దేశాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు గత 70 రోజులుగా దేశం యావత్తూ లాక్డౌన్‌లోకి వెళ్లిపోయింది. అయినప్పటికీ కొత్త కేసుల నమోదు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజూ నమోదయ్యే కరోనా కొత్త కేసుల సంఖ్య వేలల్లో ఉంది.
ఈనేపథ్యంలో కరోనాపై పరిశోధనలు చేస్తున్న హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) శాస్త్రవేత్తలు మరో సరికొత్త విషయాన్ని కనుగొన్నారు. జన్యు స్వరూపంలో భిన్నంగా ఉన్న ఓ కరోనా వైరస్ రకాన్ని గుర్తించారు. దానికి 'క్లేడ్ ఏ3ఐ' అని పేరు పెట్టారు.
ఈ మేరకు వివరాలతో సీసీఎంబీ ఓ ట్వీట్ చేసింది. ప్రస్తుతం మన దేశంలో అత్యధికంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ రకాల్లో క్లేడ్ ఏ3ఐ రెండో స్థానంలో ఉందని తెలిపింది. మొదటి స్థానంలో 'ఏ2ఏ' రకం కొవిడ్-19 వైరస్ ఉందని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇన్ఫెక్షన్లకు కారణభూతాలవుతున్న కరోనా వైర్‌సల 213 జన్యువులను విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చినట్లు వెల్లడించింది.
ఈ సీసీఎంబీ పరిశోధనాత్మక నివేదిక ప్రకారం, 'ఏ3ఐ' కరోనా వైరస్ ప్రభావం ప్రధానంగా తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీల్లో అత్యధికంగా ఉంది. బీహార్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 'ఏ2ఏ' వైరస్ వ్యాప్తి గరిష్ట స్థాయిలో జరుగుతుండగా, దాని తర్వాతి స్థానంలో 'ఏ3ఐ' ఉంది.
అయితే 'ఏ2ఏ'తో పోల్చితే 'ఏ3ఐ' జన్యుపరంగా బలహీనపడుతుండటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించడాన్ని కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఏ3ఐలో చాలా నెమ్మదిగా జన్యు మార్పులు జరుగుతుండటంతో.. అది క్రమక్రమంగా బలహీనపడుతున్నట్లుగా భావించాల్సి ఉంటుందని సీసీఎంబీ నివేదిక పేర్కొనడం గమనార్హం.