1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 మే 2021 (12:14 IST)

లవ్ యూ జిందగీ.. కోవిడ్‌తో పోరాడుతూ యువతి మృతి.. డాక్టర్ ట్వీట్

కరోనాతో పోరాడుతూ.. తనను మృత్యువు కబళిస్తున్నా.. చివరి నిమిషం వరకూ ఆమె తన జీవితాన్ని ప్రేమించింది. లవ్ యూ జిందగీ అంటూ హాస్పిటల్ బెడ్‌పై కృత్రిమ శ్వాస తీసుకుంటూ కూడా ప్రతి క్షణాన్నీ ఆస్వాదించింది. తనలాగే ఎంతో మంది కోవిడ్‌తో పోరాడుతున్న వాళ్లలో స్ఫూర్తి నింపింది. 
 
అయినా ఆ ధైర్యం, తన జీవితంపై తనకున్న ప్రేమ ఆమెను కాపాడలేకపోయాయి. అదే కరోనా మహమ్మారితో పోరాడుతూ ఆ యువతి కన్నుమూసింది. మూడు పదుల వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.
 
హాస్పిటల్ బెడ్‌పై ఉన్నా కూడా ఎంతో చలాకీగా లవ్ యూ జిందగీ పాట వింటున్న వీడియోను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చిన డాక్టర్ మోనికానే ఆమె ఇక లేదన్న చేదు వార్తను కూడా ట్విట్టర్ ద్వారా తెలిపింది. గురువారం రాత్రి ఆమె ఈ ట్వీట్ చేసింది.
 
ఎంతో ధైర్యవంతురాలైన ఆ యువతి ఇక లేదని చెప్పడానికి చాలా బాధపడుతున్నాను. ఆమె కుటుంబానికి, ఆమె రాకకోసం ఎదురు చూస్తున్న చిన్నారి కోసం ప్రార్థించండి అని డాక్టర్ మోనికా ట్వీట్ చేసింది.
 
కోవిడ్‌తో పోరాడుతున్న ఆ యువతి వయసు కేవలం 30 ఏళ్లని, ఆమెకు ఓ చిన్నారి కూడా ఉన్నదని గతంలో మోనికా ఓ ట్వీట్‌లో తెలిపింది. అప్పుడు ఆమెకు ఐసీయూ బెడ్ దొరకలేదని, ఎలాగోలా చికిత్స అందిస్తున్నామని చెప్పింది. ఆ తర్వాత ఈ నెల 10న ఆమెకు ఐసీయూ బెడ్ దొరికినా.. పరిస్థితి క్షీణించిందని, ఆమె కోసం ప్రార్థించాలని మరో ట్వీట్ చేసింది. చివరికి ఇప్పుడు ఆమె మన మధ్యలేదని ఆమె చేసిన ట్వీట్ ఎంతో మందిని కలచివేసింది.