శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జెఎస్కె
Last Modified: మంగళవారం, 13 జులై 2021 (10:22 IST)

క‌రోనా మందు పంచిన ఆనందయ్యకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారా?

క‌రోనా క‌ష్ట కాలంలో ఎంతో మందికి ఆయుర్వేదం మందు పంచిన, కృష్ణ‌ప‌ట్నం ఆనందయ్యకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల‌నే డిమాండు బ‌ల‌ప‌డుతోంది. నెల్లూరు జిల్లా స‌ర్వేపల్లి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఆనంద‌య్య‌కు ఎమ్మెల్సీ ఇచ్చే అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల‌ని గ‌వ‌ర్న‌ర్ బంగ్లా నుంచి కూడా సిఫార‌సులు రావడంతో... రాజ‌కీయ వ‌ర్గాలు ఉలిక్కిప‌డ్డాయి. 
 
ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న కరోనాకు ఆనందయ్య మందు తయారుచేసి ఫేమస్ అయ్యాడు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్యకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల‌నే డిమాండ్ పెరుగుతోంది. తాజాగా వెన్నెల ఫౌండేషన్ వైస్ చైర్మన్ సుంకర నరేష్ గవర్నర్‌కు లేఖ రాశారు. దీనిని ప‌రిశీలించాల‌ని గ‌వ‌ర్న‌ర్ బంగ్లా నుంచి కార్య‌ద‌ర్శి ఏపీ చీఫ్ సెక్ర‌ట‌రీకి సిఫార‌సు చేశారు. దీనితో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యకు బంపరాఫర్ త‌గులుతుందా అనేది రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిగా మారింది.
 
కరోనా వైరస్‌కు విరుగుడుగా ఆయుర్వేద మందు తయారు చేసి దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కృష్ణపట్నం ఆనందయ్యను ఇక అదృష్టం వరించబోతోందా? ఆయన చట్టసభల్లోకి అడుగు పెట్టనున్నారా? అని ఆయ‌న బంధువులు ఉత్కంఠ‌గా ఉన్నారు.
 
సుంక‌ర నరేష్ రాసిన లేఖపై స్పందించిన ఏపీ గవర్నర్ కార్యదర్శి, దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(3)(ఈ) మరియు 171(5) ప్రకారం ఆనందయ్యను ఎమ్మెల్సీగా నియమించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. మరోవైపు తన లేఖకు గవర్నర్ కార్యదర్శి స్పందించి సీఎస్‌కు లేఖ రాయడంపై నరేష్ హర్షం వ్యక్తం చేశారు. తన విన్నపాన్ని మన్నించి, రాష్ట్ర ప్రభుత్వం ఆనందయ్యను ఎమ్మెల్సీగా నియమిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.