ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By
Last Updated : మంగళవారం, 9 అక్టోబరు 2018 (11:47 IST)

కరివేపాకుతో తేనీరు... ఎలా తయారు చేస్తారు?

"కర్ణుడు లేని భారతం - కరివేపాకు లేని కూర" ఒకటేనని అంటారు మన పెద్దలు. భారతదేశంలో కరివేపాకులేని తాలింపు ఉండదంటే అతిశయోక్తి కాదు. కరివేపాకు చెట్టులో అన్నిటికీ ఔషధపరమైన ఉపయోగాలున్నాయి.
 
కరివేపాకు ఆకులు, కరివేపాకు కాయలు, వేరుపై బెరడు, కాండంపై బెరడు ఇలా అన్నిటినీ ఔషధ రూపంలో వాడతారు. కరివేపాకు మంచిదని అందరికీ తెలుసు. కానీ, ఇష్టంలేకో లేక అలవాటులో పొరపాటో... కరివేపాకుని తినకపోవడానికి సవాలక్ష కారణాలు వెతుక్కుంటారు.
 
అలాంటి కరివేపాకు గురించి శాస్త్రవేత్తలు పలుపరిశోధనలు, అధ్యయనాలు చేశారు. మధమేహాన్ని అదుపు చేసే గుణం ఈ ఆకుకు ఉందని తేల్చారు. కరివేపాకులో ఉండే ఒక పదార్థం మధుమేహుల్లో స్టార్చ్‌ గ్లూకోజ్‌ బ్రేక్‌డౌన్‌ను నెమ్మదించేలా చేస్తుందని శాస్త్రవ్తేలు తెలుసుకున్నారు. అందుకే కరివేపాకును విరివిగా వాడాలని సూచిస్తున్నారు. 
 
అయితే కూరల్లో అందరం కరివేపాకు వాడుతూనే ఉంటాం. కానీ కరివేపాకునే నేరుగా వాడి తేనీరు తయారుచేసుకుంటే ఆ ఆకుల్లోని పోషకాలు మొత్తంగా అందుతాయి. ఆ పానీయం ఎలా తయారు చేయాలంటే?
 
* గ్లాసుడు నీళ్లను మరిగించి, 30 కరివేపాకు ఆకులు వేయాలి.
* ఆ నీళ్లను కొన్ని గంటలపాటు కదల్చకుండా ఉంచాలి.
* తర్వాత నీటిని వడగట్టి నిమ్మరసం, తేనె కలుపుకుని తాగాలి.