గురువారం, 18 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 3 ఫిబ్రవరి 2022 (15:37 IST)

PRCకి వ్యతిరేకంగా ఉద్యోగుల 'చలో విజయవాడ': వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వేతన సవరణకు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు ఈరోజు చలో విజయవాడకు పిలుపునిచ్చాయి. నగరంలోకి చేరుకున్న ఉద్యోగులు రహదారులపై భారీగా గుమిగూడారు. జగన్ ప్రభుత్వానికి, కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొత్త పీఆర్సీ అమలును నిలిపివేసి మరోసారి చర్చించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

 
ప్రభుత్వం మాత్రం జనవరి 1 నుంచి కొత్త పీఆర్సీ అమల్లోకి తీసుకొచ్చింది. ఫిబ్రవరి వేతనాల్లో ఉద్యోగులు, ఫించనుదారుల వేతనాల్లో కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు వేసింది. దీంతో, ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు(గురువారం) 'చలో విజయవాడ'కు తరలిరావడంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చాలా చోట్ల పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎవరూ విజయవాడ వెళ్లకుండా చాలా చోట్ల అడ్డంకులు సృష్టించారు.

 
పలువురు ఉద్యోగులను గృహనిర్బంధంలో ఉంచిన పోలీసులు అప్పటికే రైల్వే స్టేషన్, బస్టాండ్ చేరుకున్న చాలా మంది ఉద్యోగులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. విజయవాడకు వైపు వచ్చే అన్ని మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన అధికారులు, అన్ని వాహనాలనూ తనిఖీ చేశారు.

 
వాహనాల్లో ఉన్నవారి ఐడీ కార్డులు, ఆధారాలు చెక్ చేస్తూ, అనుమానితులు ఎవరైనా ఉంటే వారిని వాహనాలు దింపేసి వెనక్కు పంపించేశారు. కానీ, చలో విజయవాడకు చాలామంది ఉద్యోగులు కనకదుర్గ భక్తుల్లా, పెళ్లివారి వేషంలో విజయవాడలోకి ప్రవేశించినట్లు చెబుతున్నారు. వేలాది ఉద్యోగులు పోలీసు ఆంక్షలు ఛేదించి బీఆర్టీఎస్ రోడ్డుకి చేరుకున్నారు. ఉద్యోగులు అక్కడ ర్యాలీ చేయకుండా పోలీసులు అడ్డుకోవడంతో వారు రోడ్డుపైనే బైఠాయించారు.

 
ఉద్యోగుల నిరసనను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధుల సెల్ ఫోన్లు, 4జీ కిట్లు పనిచేయకుండా అధికారులు జామర్లు ఏర్పాటు చేశారు. ర్యాలీలు, ప్రసంగాలు, ధర్నాలు జరిగే ప్రాంతాలో కూడా వీటిని అమర్చారు. ఉద్యోగుల మధ్య సమాచారాన్ని నిరోధించేందుకు కూడా పోలీసుల ప్రయత్నిస్తున్నారని నేతలు ఆరోపిస్తున్నారు. జేఏసీ నాయకులు చలో విజయవాడ నిరననల్లో పాల్గొన్నారు. వీరిలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, బండి శ్రీనివాసరావు, బొప్పారాజు వెంకటేశ్వర్లు, వెంకటరామిరెడ్డి, ఉపాధ్యాయ నాయకులు ఎం వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

 
జీవోల రద్దు కుదరదు: మంత్రి బొత్స సత్యన్నారాయణ
‘‘ఉద్యోగులపై మేం ఎక్కడా ఒత్తిడి చేయలేదు. ఉద్యోగుల డిమాండ్‌లను మేం కాదనడం లేదు. కానీ, వాళ్లు చర్చలకు రావాలి కదా..?’’ అని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ అన్నారు. జీవోలు రద్దు చేయడం కుదరదని, అవసరమైతే మార్పులు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఉద్యోగులను ఎక్కడా భయపెట్టలేదు. అశుతోష్ కమిటీ రిపోర్ట్ ఇప్పుడు చూసినా ఉపయోగం లేదు. ఉద్యోగస్తులు వ్యవస్థలో భాగస్వాములు. చర్చలకు రాకుండా తాము కోరుకున్నదే జరగాలంటే ఎలా?’’ అని బొత్స సత్యన్నారాయణ అన్నారు.

 
మరోవైపు ఉద్యోగులకు అన్యాయం చేయాలని ముఖ్యమంత్రి భావించడం లేదని, చర్చలకు వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు.

 
ఉద్యోగుల నిరసన నేరం ఎలా అవుతుంది-నారా లోకేష్
పీఆర్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు చేస్తున్న నిరసనలకు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దీనిపై ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగుల ప‌ట్ల ఎందుకింత క్రూరంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు? త‌మ‌కు న్యాయ‌బ‌ద్ధంగా రావాల్సిన ప్ర‌యోజ‌నాల కోసం-మాట త‌ప్పిన మీ ప్ర‌భుత్వ‌ తీరుపై శాంతియుతంగా ఉద్యోగులు నిర‌స‌న తెలప‌డం నేరం ఎలా అవుతుంది? అని అందులో ఆయన సీఎం జగన్‌‌ను ప్రశ్నించారు.

 
ప్ర‌జాస్వామ్య‌ దేశంలో రాజ్యాంగం ప్ర‌సాదించిన హ‌క్కునీ హ‌రించే అధికారం మీకు ఎవ్వ‌రిచ్చారు? విద్యాబుద్ధులు నేర్పే గురువుల‌ని పోలీసుల‌తో నిర్బంధించ‌డ‌మేనా వారికి మీరిచ్చే గౌర‌వం? మీ అరాచ‌క‌పాల‌న‌లోనూ ఎటువంటి గౌర‌వానికి నోచుకోక‌పోయినా, ప్ర‌భుత్వం కోసం కుటుంబాల్ని వ‌దిలి మ‌రీ ప‌నిచేస్తున్న ప్ర‌భుత్వ ఉద్యోగులంటే ఎందుకింత క‌క్ష‌? అన్నారు.

 
ప్ర‌జాస్వామ్యంపై ఏ మాత్రం గౌర‌వం వున్నా...ప్ర‌భుత్వ ఉద్యోగుల్ని నిర్బంధించ‌డం ఆపండి. విశ్వ‌స‌నీయ‌త అనే ప‌దం అర్థం తెలిస్తే.. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు మీరు ఇస్తామ‌న్నవ‌న్నీ ఇవ్వండి అని సూచించారు. ఉద్యోగులు త‌మ‌ డిమాండ్లు ప‌రిష్క‌రించాల‌ని రోడ్డెక్కితే... పోలీసుల్ని ఉసిగొల్పి ఉద్యోగుల ఆత్మ‌గౌర‌వాన్ని దారుణంగా దెబ్బ‌తీశారని ఆరోపించిన నారా లోకేష్.. ఉద్యోగుల శాంతియుత న్యాయ‌మైన ఉద్య‌మానికి సంపూర్ణ మ‌ద్ద‌తు తెలియ‌జేస్తున్నానని ప్రకటించారు.