శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 5 ఏప్రియల్ 2023 (16:08 IST)

ఈ దేశాల్లో అమ్మాయిలు అర్ధరాత్రి కూడా నిర్భయంగా తిరగొచ్చు, ఎక్కడెక్కడంటే?

Touring spot
సోలో ట్రావెల్ ట్రెండ్ పెరుగుతున్నప్పటికీ విదేశీ ప్రయాణాలు చేసే సమయాల్లో మాత్రం మహిళలు ఇంకా సవాళ్లు ఎదుర్కొంటున్నారు. అయితే, భద్రత, సమానత్వం విషయంలో కొన్ని ప్రదేశాలు అత్యుత్తమంగా నిలుస్తున్నాయి. కరోనా మహమ్మారితో చాలా కాలం ప్రయాణాలు నిలిచిపోవడంతో పర్యాటకులు పార్ట్‌నర్‌ల కోసం ఎదురుచూడటం లేదు. ఒంటరిగా పర్యటనలకు వెళ్లాలనుకునే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ పెరుగుతోంది. ప్రత్యేకంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది. నార్వీజియన్ క్రూయిజ్ లైన్ అధ్యయనం ప్రకారం ప్రతి ముగ్గురిలో ఒకరు ఒంటరిగా పర్యటించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వారిలో వయసు పైబడిన మహిళలే ఎక్కువ.
 
సోలోగా పర్యటిస్తున్న మహిళల్లో 65 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారి సంఖ్య 2022లో భారీగా పెరిగింది. 2019లో వారి సంఖ్య కేవలం 4 శాతం కాగా, గతేడాది అది 18 శాతానికి పెరిగినట్లు ట్రావెల్ నెట్‌వర్క్ వర్ట్యువసో పరిశోధనలో వెల్లడైంది. ఒకవైపు సోలో ట్రావెల్ ట్రెండ్ పెరుగుతుంటే, విదేశీ ప్రయాణాలు చేసే విషయంలో మాత్రం మహిళలు ఇప్పటికీ సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ప్రపంచంలోని ప్రతి ప్రదేశం మహిళలు పర్యటించేందుకు సురక్షితంగా ఉండాలి. కానీ ఇప్పటికీ ప్రపంచంలోని ప్రతి చోటా మహిళలు అసమానత్వం, భద్రతాపరమైన వ్యవహారాలు ఎదుర్కొంటున్నారు. చాలా దేశాలు మహిళల భద్రత, భద్రతా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నాయి.
 
పర్యటనల సమయంలో మహిళలకు భద్రత, సమానత్వం విషయంలో ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదేశాలను కనుగొనేందుకు జార్జ్‌టౌన్ యూనివర్సిటీకి చెందిన ఉమెన్స్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్(డబ్ల్యూపీఎస్), వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌కి చెందిన గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్, ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనమిక్స్, పీస్ గ్లోబల్ పీస్ ఇండెక్స్(పీజీపీ)ని బీబీసీ సంప్రదించింది. అత్యుత్తమంగా నిలిచిన దేశాల్లో తాము భద్రంగా ఉన్నామని ఫీల్ అయ్యేలా చేసిన అంశాలేంటి? సోలో ట్రావెలింగ్‌లో పాటించాల్సిన టిప్స్, ఒంటరిగా ప్రయాణించినప్పుడు ఎదురైన అనుభవాలను తెలుసుకునేందుకు బీబీసీ వారితో మాట్లాడింది.
 
స్లొవేనియా
డబ్ల్యూపీఎస్ ఇండెక్స్ ప్రకారం మధ్య, తూర్పు యూరప్‌లోని స్లొవేనియా మహిళల భద్రత విషయంలో అత్యుత్తమ ప్రదేశంగా నిలిచింది. కొన్నేళ్లుగా ఆ దేశం తీసుకుంటున్న చర్యలతో సుమారు 85 శాతం మంది మహిళలు స్లొవేనియాను అత్యంత భద్రత కలిగిన ప్రదేశంగా భావిస్తున్నారు. క్లెయిర్ ర్యామ్స్‌డెల్ స్లొవీనియా రాజధాని ల్యుబియానా వెళ్లినప్పుడు రాత్రి వేళ ఫొటోలు తీసుకుంటూ వీధుల్లో సంచరించారు. ''మరెక్కడైనా అయితే అది ఇబ్బందికర పరిణామం కావొచ్చు. కానీ ఇక్కడ మాత్రం అలా లేదు'' అని వైల్డ్‌లైన్ ట్రెక్కింగ్‌కి అడ్వెంచర్ కన్సల్టెంట్‌ ర్యామ్స్‌డెల్ చెప్పారు. ఆమె ది డిటూర్ ఎఫెక్ట్ పేరుతో బ్లాగ్ కూడా నడుపుతున్నారు. ''అక్కడ ఉన్నప్పుడు నా గురించి ఎవరికీ ఎలాంటి ఆందోళన లేదు. ఒంటరిగా పర్యటిస్తున్నామని గుర్తు చేసే నేవిగేషన్, భాషాపరమైన ఇబ్బందుల వంటి సమస్యలేవీ కూడా తలెత్తలేదు''. అన్నారు.
 
ల్యుబియానా నగరంలో నడుస్తూ తిరిగేయొచ్చని, స్లొవేనియాలో ప్రజారవాణా వ్యవస్థ విస్తృతమని ర్యామ్స్‌డెల్ తెలిపారు. తమలాంటి పర్యాటకులతో కలిసి వెళ్లాలనుకుంటే ల్యుబియానాయం ఫుడ్ టూర్స్, ఫుడ్ టూర్ ల్యుబియానా వంటి గ్రూపులతో కలిసి వెళ్లొచ్చని ఆమె సిఫార్సు చేశారు. కొత్త ప్రదేశాల్లో పర్యటించేందుకు ఆసక్తి చూపించే ర్యామ్స్‌డెల్, విశాలమైన మైదాన ప్రాంతాలు, అల్పైన్ పర్వత శ్రేణులను వీక్షించేందుకు స్లొవేనియాలో ప్రత్యేకంగా పర్యటించారు. ఆ దేశం ఏకాంతంగా పర్యటించే అవకాశం, భద్రతను కల్పిస్తోందని ఆమె తెలిపారు. ''అటవీ ప్రాంతాల్లో ఒంటరిగా ఉన్న అనుభూతి కలిగిందని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే సమీపంలోని పట్టణానికి వచ్చే అవకాశం ఉంది'' అన్నారు. ''నేను ఒంటరిగా ఉన్నానని అనిపించలేదు. కానీ అది నాకు ప్రశాంతతనిచ్చింది'' అని ర్యామ్స్‌డెల్ తెలిపారు.
 
స్లొవేనియాకి పశ్చిమాన, అందమైన రాళ్ల నడుమ ప్రవహించే సోకా నది పర్యాటకులకు ప్రత్యేక అనుభూతి ఇస్తుందన్నారు ర్యామ్స్‌డెల్. ఆ ప్రాంతం ఇటాలియన్ బోర్డర్‌కి దగ్గరగా ఉంటుందని చెప్పారు. క్రానికల్స్ ఆఫ్ నార్నియా అక్కడ చిత్రీకరించారని చెప్పారు. నీళ్ల వెంట నడుస్తూ ఆస్వాదించవచ్చన్నారు. కారులో వెళ్లినా నదిపై నిర్మించిన వేలాడే వంతెనలను చూడొచ్చని చెప్పారు.
 
రవాండా
పార్లమెంట్‌లో మహిళ ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్న దేశాల్లో రవాండా మొదటి స్థానంలో ఉంది. ఉమెన్స్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ నివేదిక ప్రకారం రవాండా పార్లమెంట్‌లో 55 శాతం మంది మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భద్రతపరంగానూ రవాండా అత్యుత్తమ ప్రదేశంగా నిలుస్తోంది. అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దేశాల్లో ఆరో స్థానంలో ఉందని గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ చెబుతోంది. విద్య, వైద్యం, ఆర్థిక, రాజకీయాల్లో మహిళ ప్రాతినిధ్యంపై ఈ సంస్థ అధ్యయనం చేసింది.
 
సోలో ట్రావెలర్స్‌కి భద్రత విషయంలో రవాండా అత్యుత్తమమని డెన్మార్క్‌కి చెందిన రెబెక్కా హ్యాన్సెన్ అన్నారు. 2019లో ఆమె ఆ దేశ పర్యటనకు వెళ్లారు. '' రవాండాలో ప్రతి ప్రదేశంలో పోలీసులు, భద్రత సిబ్బంది, మిలిటరీ రాత్రింబవళ్లూ ఉంటారు'' అని ఆమె చెప్పారు. ''వాళ్లని చూడగానే మొదట కొంత భయంగా అనిపిస్తుంది. కానీ, వాళ్లందరూ చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. సాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు'' అని చెప్పారు. రవాండా ప్రజలతో అంత ఇబ్బంది ఉండదు. కాకపోతే, హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్ వంటి వాటిని వాళ్ల ఇంగ్లిష్‌కు అనుగుణంగా ప్రాక్టీస్ చేస్తే మేలని ఆమె చెప్పారు.
 
రవాండాలో ఇంగ్లిష్, ఫ్రెంచ్ అధికారిక భాషలు. వాటితో పాటు కిన్యార్‌వాండా, కిస్వాహిలి వాడుకలో ఉంటాయి. భాషాపరంగా కొద్దిగా ఇబ్బంది తలెత్తవచ్చు. అయితే, అక్కడి వాళ్లు ఇంగ్లిష్‌లో మాట్లాడకపోయినా సైగల ద్వారా మనం వెళ్లాల్సిన దారి చెప్పడంలో సాయం చేస్తారని రెబెక్కా చెప్పారు. 1994 మారణ హోమం ( 1994 ఏప్రిల్ నుంచి జూలై మధ్య రవాండాలో టుట్సీ తెగ ప్రజల ఊచకోత జరిగింది) తర్వాత రవాండాలో శాంతి, సామరస్య వాతావరణం నెలకొంది. ఆ దేశంలో చాలా స్మారక చిహ్నాలు ఉంటాయి. రాజధాని నగరంలోని కిగాలి మారణహోమం స్మారక చిహ్నాన్ని పర్యాటకులు తప్పకుండా సందర్శించాలని ఆమె సూచించారు. అది మారణ హోమం ఎందుకు జరిగిందని తెలియజేయడమే కాదు, నేటికీ ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రమాదాలను ఎత్తి చూపుతుందన్నారు. అక్కడి మౌంటైన్ గొరిల్లాలను సందర్శించడం కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అయినా తప్పకుండా చూడాల్సిన ప్రదేశమని రెబెక్కా చెప్పారు. అలాగే న్యుంగ్వే నేషనల్ పార్క్, వోల్కనోస్ నేషనల్ పార్క్, అకగెరా నేషనల్ పార్క్‌ను సందర్శించొచ్చని ఆమె సూచించారు.
 
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
మహిళలకు విద్య, ఆర్థిక పరమైన అంశాల్లో మిడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో యూఏఈ అగ్రస్థానంలో ఉంది. లింగ సమానత్వంలోనూ అత్యుత్తమంగా నిలుస్తున్నట్లు ఉమెన్స్ పీస్ అండ్ సేఫ్టీ నివేదిక తెలిపింది. యూఏఈ పార్లమెంట్‌లోనూ మహిళలకు ప్రాతినిధ్యం పెరుగుతోంది. మహిళల భద్రతలో 98.5 పాయింట్లతో అన్ని దేశాల కంటే యూఏఈ ముందుంది. నగరంలో రాత్రి పూట ఒంటరిగా తిరుగుతున్న సమయంలోనూ సురక్షితంగా ఉన్నామని భావిస్తున్నామని అక్కడి మహిళలు చెప్పారు. 15 ఏళ్ల నుంచి పెద్ద వయసు మహిళలు వారిలో ఉన్నారు.
 
మరీ ముఖ్యంగా దుబాయ్, సోలో మహిళా ట్రావెలర్స్‌కి అత్యంత సురక్షిత నగరంగా దుబాయ్ నిలుస్తుందని ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఇన్స్యూర్ మై ట్రిప్ తెలిపింది. దుబాయ్‌లో ఉంటే సురక్షితంగా ఉన్నట్లు భావిస్తానని, నగర శివార్లలోనూ ఇబ్బంది లేదని సోషల్ మీడియా స్టార్ శాండీ ఆవాద్ తెలిపారు. ఆమె ప్యారిస్, దుబాయ్‌‌లో ఎక్కువగా ఉంటారు. ''ఒకసారి నా కారు టైర్ పంక్చర్ అయింది. ఎడారి మధ్యలో నా కారు వదిలేశాను. కారు నుంచి బయటికి వచ్చాను. నన్ను పికస్ చేసుకునేందుకు ట్యాక్సీ వస్తుందని నాకు నమ్మకముంది. కారు కూడా అక్కడ సురక్షితంగానే ఉంటుందని నా నమ్మకం'' అని ఆమె చెప్పారు. సోలో ట్రావెలర్స్ ఎడారిలో సఫారీ చేయాలని, అది రకరకాల వ్యక్తులను పరిచయం చేస్తుందని శాండీ తెలిపారు. ఇంకా సాహసోపేతంగా అనిపించాలంటే స్కైడైవింగ్ ట్రై చేయాలన్నారు.
 
జపాన్
గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రకారం అత్యంత సురక్షితమైన దేశాల్లో జపాన్ తొలి పది స్థానాల్లో నిలిచింది. క్రూరమైన నేరాల రేటు, అంతర్గత సమస్యలు కూడా తక్కువేనని ఆ సంస్థ పేర్కొంది. మహిళలు వెళ్లేందుకు ప్రత్యేకమైన సబ్‌వేలు( నిర్దిష్ట సమయాలు, రూట్లలో ), మహిళలకు ప్రత్యేకంగా వసతి సదుపాయాలు వంటివి మరింత సురక్షితంగా ఉన్నామనే భావనను కలిగిస్తాయని తెలిపింది. ఒంటరిగా తినడం, ఒంటరిగానే పనులు చేసుకోవడం అక్కడి సంస్కృతిలోనూ భాగమైపోయింది. ''జనాభా తగ్గిపోవడం, పెళ్లి చేసుకోవడంపై అక్కడి ప్రజల్లో అయిష్టత వంటి కారణాలతో ఒంటరిగా బతకడమనే సంప్రదాయం పెరుగుతోంది. ఈ ఒంటరి ప్రయాణానికి ఇంకా చాలా కారణాలే ఉన్నాయి.'' అని చాప్టర్ వైట్ పేరుతో టూరిజం సంస్థ నడుపుతున్న మికా వైట్ తెలిపారు. ఆమె జపాన్‌లోనే పుట్టిపెరిగారు.
 
ఇక్కడ సురక్షితంగా ఉన్నామని అనిపించిందని లులు అస్సాగఫ్ తెలిపారు. ఇండోనేషియాకి చెందిన లులు 20 ఏళ్ల కిందట జపాన్ వచ్చి స్థిరపడ్డారు. '' ఇక్కడ మన సొంతింట్లో ఉన్నట్టే ఉంటుంది. ప్రజలు కొత్తవాళ్లకు సంతోషంగా సాయం చేస్తారు.'' అని లులు చెప్పారు. ఆమె ప్రస్తుతం ఇంట్రెపిడ్ ట్రావెల్ సంస్థలో టూర్ లీడర్‌గా పనిచేస్తున్నారు. ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు ఇక్కడి ప్రజలు అంతగా ఆసక్తి చూపించరని, ఒకవేళ మారుమూల ప్రాంతాలను సందర్శించాలనుకుంటే లోకల్ గైడ్‌ను తీసుకెళ్లాలని ఆమె సూచించారు. ఇక్కడ ఒంటరిగా భోజనం చేసే సంప్రదాయం ఉందని, ఇక్కడి ఆహారం రుచి చూడాల్సిందేనని అస్సాగఫ్ చెప్పారు. క్యోటో, ఒసాకా, టోక్యోలో దొరికే ఫుడ్ మరింత ప్రత్యేకమన్నారు. టోక్యోలోని షింజుకు శాన్‌కోమ్ ప్రాంతం తన ఫేవరెట్ అని, అక్కడ చాలా రెస్టారెంట్లు, నైట్ లైఫ్, ఇజకయాస్( జపాన్ పబ్బులు ) బాగుంటాయని ఆమె తెలిపారు. ప్రముఖ పర్యాటక ప్రదేశాలతో పాటు ఇతర ప్రదేశాలను చూడాలనుకునే పర్యాటకులు తీరప్రాంత నగరం కనజవా, జపనీస్ ఆల్ప్ పర్వత శ్రేణుల్లోని టకయామా సందర్శించాలని అస్సాగఫ్ చెప్పారు.
 
నార్వే
మహిళల ఆర్థిక భాగస్వామ్యం, న్యాయసంబంధిత వ్యవహారాల్లో అసమానతలు లేకపోవడం, భద్రత వంటి విషయాల్లో నార్వే అత్యుత్తమమని ఉమెన్స్ పీస్ అండ్ సెక్యూరిటీ నివేదిక తెలిపింది. లింగ సమానత్వం, సంతోకరమైన దేశాల జాబితాలోనూ నార్వే తొలి పది స్థానాల్లో ఉంటుందని పేర్కొంది. అన్ని రకాల పర్యాటకులకు, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ, సోలో ట్రావెలర్స్‌కి నార్వే సరైన ప్రదేశమని తెలిపింది. సహనం, విశ్వాసం ఇక్కడి సంస్కృతిలో భాగమని, అందుకే ఒంటరి మహిళలకు ఇది అత్యుత్తమ ప్రదేశమని అప్ నార్వే సంస్థ ఫౌండర్, ఓస్లోకి చెందిన టొరన్ ట్రొన్స్‌వాంగ్ తెలిపారు. ''మీరు రెస్ట్‌రూమ్‌కి వెళ్లేప్పుడు, మీ వస్తువులు చూస్తూ ఉండమని కేఫ్‌లో పక్క టేబుల్‌లో కూర్చున్న ఎవరినైనా అడగొచ్చు'' అని ఆమె చెప్పారు. ఎంతో మంది మహిళలు ఇక్కడ చాలా వ్యాపారాలు చేస్తున్నారని ఆమె గర్వంగా చెప్పారు. నార్వీజియన్ కాన్పెప్ట్ ఫ్రిలుట్స్‌లివ్ ( స్వేచ్ఛగా బతకడం )ని ఆమె నమ్ముతారు. ఆర్కిటిక్ ట్రిప్, స్నోషూయింగ్, అక్కడి ఇగ్లూస్, ఐస్ హోటళ్లలో బస చేయడం బాగుంటుందని ఆమె చెప్పారు.