బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (13:12 IST)

భారత్‌లో పోషకాహార లోపం పెరుగుతోంది, ఎందుకు?

ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పిల్లల్లో పోషకాహార లోపం పెరుగుతోందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కొన్నేళ్లుగా ఈ విషయంలో ఎంతో కష్టపడి సాధించిన ప్రగతి ఎందుకు తిరుగుముఖం పట్టింది? కారణాలు ఏంటి? బీబీసీ ప్రతినిధి రాక్సీ గగ్డేకర్ అందిస్తున్న కథనం. గుజరాత్‌కు చెందిన 37 ఏళ్ల నందా బరియా ఒక వలస కార్మికురాలు. ప్రస్తుతం ఆమె ఏడు నెలల కడుపుతో ఉన్నారు. ఈ సమయంలో ఆమె మూడు నెలలపాటు తన సొంతూరు దాహోద్‌కు 100 కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న భవన నిర్మాణ స్థలంలో పని చేశారు.

 
ఆ మూడు నెలలూ ఆమె రోజూ మధ్యాహ్న భోజనంలో మొక్కజొన్న రొట్టెలను కూరతో పాటు తినేవారు. రోజంతా పని చేసి అలిసిపోవడంతో రాత్రి వండుకునే ఓపిక లేక పల్చటి పప్పు, అన్నంతో భోజనం ముగించేవారు. సమతుల ఆహారంగానీ, వైద్య సహాయంగానీ ఆమెకు అందుబాటులో ఉండేవి కాదు. నందాకు రోజు కూలీ రూ.300 గిట్టేది. దాంతో మంచి ఆహారం తీసుకునే వెసులుబాటు ఉండేది కాదు.

 
తరువాత, జనవరిలో ఆమె తన ఊరికి తిరిగొచ్చాక స్థానిక అంగన్వాడీ కేంద్రానికి వెళ్లారు, కానీ అది మూసివేసి ఉంది. గర్భం దాల్చిన మూడు నెలలకే ఆ కేంద్రంలో తన పేరు రిజిస్టర్ చేసుకున్నానని, అయితే, ఇంతవరకూ తనకు అందవలసిన ప్రసూతి నగదు సహాయం అందలేదని ఆమె తెలిపారు. ప్రభుత్వ పథకంలో భాగంగా గర్భవతులైన మహిళలకు మంచి పోషకాహారం తీసుకునేందుకు వీలుగా రూ. 6,000 నగదు సహాయాన్ని అందిస్తారు. ఈ మొత్తాన్ని మూడు వాయిదాలలో వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు.

 
అయితే, ఇదేమంత ఆశ్చర్యపోయే విషయం కాదని నిపుణులు అంటున్నారు. లాక్‌డౌన్ కారణంగా దేశంలో కోట్లమంది మహిళలు, పిల్లలకు ప్రయోజనం చేకూర్చే కీలకమైన ప్రభుత్వ పథకాలకు అంతరాయం కలిగింది. అంతే కాకుండా, పెద్ద సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలను కరోనా పరిస్థితులను తెలుసుకోవడానికి, దానిపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో నియమించారు. వారంతా ఇంకా పూర్తిగా తమ తమ కేంద్రాలకు తిరిగి రాలేదు. ఈ కారణంగా దాహోద్‌ లాంటి మారుమూల ప్రాంతాల్లో అంగన్వాడీలు ఇంకా పూర్తిగా తెరుచుకోలేదు.

 
కాగా, దేశంలో పోషకాహార లోపం ఎందుకు పెరుగుతోందన్న దానికి ఇది పూర్తి వివరణ కాదు. ఐదేళ్ల క్రితం కంటే ఇప్పుడు పిల్లలు ఎక్కువ పోషకాహార లోపంతో బాధపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) తాజా గణాంకాలు చెబుతున్నాయి. 2019-20లో సేకరించిన డేటా ఆధారంగా తాజా నివేదికను తయారుచేశారు.

 
కోవిడ్ మహమ్మారి వ్యాప్తికి ముందు 22 రాష్ట్రాల్లో మాత్రమే ఈ సర్వే జరిపారు. మిగతా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ముగిసిన తరువాత సర్వే చేశారు. కాబట్టి ఆ రాష్ట్రాల్లో ఫలితాలు మరింత ఘోరంగా ఉండొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, దాహోద్‌లాంటి మారుమూల ప్రాంతాల్లో పోషకాహార సమస్య అంతకుముందు నుంచే ప్రారంభమైందని విశ్లేషకులు అంటున్నారు. 2015-16 సర్వేతో పోలిస్తే ఈ జిల్లాల్లో పిల్లల్లో పోషకాహార సమస్య బాగా పెరిగింది. ఐదేళ్లకన్నా చిన్న పిల్లల్లో పోషకాహార లోపం 44 శాతం నుంచీ 55 శాతానికి పెరిగింది. బరువు తక్కువ పిల్లల శాతం 7.8 నుంచి 13.4కు పెరిగింది.

 
చాలామంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. పేదవారిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. పోషకాహార లోపంతో ఉన్న మహిళలకు పుట్టే పిల్లలు కూడా బలహీనంగానే ఉంటున్నారు. దీనికి కారణం మహిళలకు సరైన పోషకాహారం అందకపోవడమేనని నిపుణులు భావిస్తున్నారు. వలసలు ఈ పరిస్థితికి ఒక ముఖ్య కారణం అని వారు అభిప్రాయపడుతున్నారు.

 
నందా బరియాలాగానే అనేకమంది మహిళలు వలస కూలీలుగా దగ్గర్లో ఉన్న పట్టణాలకు, నగరాలకు వెళుతున్నారు. దీని వలన స్థానికంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు వీరు దూరం అవుతున్నారు. ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు లేదా రాష్ట్రానికి ఈ పథకాలు సులువుగా బదిలీ కావడం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉండగా, నందా లాంటి మహిళల విషయంలో అది ఇంకా జరగట్లేదు.

 
గురజాత్‌లో మహిళలకు ప్రసూతి, పోషకాహార ప్రయోజనాలు అందించేందుకు మూడు రకల పథకాలు ఉన్నప్పటికీ పోషకాహార సమస్య అధికంగానే ఉంది. దీనికి భారత్‌లో అనేకమంది మహిళలకు ఈ పథకాలు అందుబాటులో లేకపోవడమే ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వలసల వలన కొంత, ఈ పథకాలు అమలు అవుతున్న విధానం వలన కొంత.. మహిళలకు వీటి పూర్తి ప్రయోజనాలు అందడం లేదని వారు అంటున్నారు.

 
"ఒక్కోసారి, ఆధార్ కార్డ్ అప్డేట్ కాకపోయినా, బ్యాంక్ ఖాతాల్లో మహిళల కేరాఫ్ అడ్రస్‌లు లేదా పేర్లు వారి తండ్రులనుంచీ, భర్తలకు మారకపోయినా వారికి ప్రభుత్వ పథాకాలు అందడం లేదు" అని సామాజిక కార్యకర్త షీలా ఖాంట్ తెలిపారు. వివిధ పథకాల ప్రయోజనాలను అవసరమైనవారికి సులువుగా, కచ్చితంగా అందించేందుకు సహాయపడేలా ఆధార్ వ్యవస్థను రూపొందించినప్పటికే అనేక సందర్భాల్లో అదే వారికి అడ్డంకిగా నిలుస్తోంది.

 
ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలన్నా, బ్యాంక్ ఖాతాలకు జతపరచాలన్నా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ పలుమార్లు తిరగాల్సి వస్తోందని, అన్నిసార్లు తిరగడం కష్టమవుతోందని అనేకమంది, ముఖ్యంగా పేద ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఐదోసారి కడుపుతో ఉన్న సుర్తీ నాయక్.. తనకు అందవలసిన ప్రసూతి ప్రయోజనాలు అందలేదని తెలిపారు. స్థానిక అంగన్వాడీ కార్యకర్తలను కలుసుకున్నా లాభం లేకపోయిందని చెప్పారు.

 
"ప్రభుత్వ ప్రథకాలకు నేను దరఖాస్తు పెట్టుకున్నాను. నింపాల్సిన ఫారాలన్నీ నింపాను. కానీ, నాకు కేవలం రూ.1,500.. అది కూడా కొన్నేళ్లకే దక్కాయి" అని సుర్తీ తెలిపారు. తనకు పుట్టిన నలుగురు పిల్లల్లో ఇద్దరు పోషకాహార లోపాల వల్ల చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారని, ఇప్పుడు పుట్టబోయే బిడ్డ గురించి కూడా బెంగగా ఉందని ఆమె చెప్పారు.

 
రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలన్నీ సక్రమంగా అమలు జరిగేట్టు చూస్తామని గుజరాత్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ నీలం పటేల్ ప్రకటించారు. గుజరాత్‌లో పోషకాహార సమస్యలు ఎక్కువగా ఉన్నాయని డా. పటేల్ అంగీకరించారు. అయితే, ప్రభుత్వం ఒంటి చేత్తో పరిస్థితులను చక్కదిద్దలేకపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. విధానాల అమలులో సమస్యల వల్లే దాహోద్‌లాంటి ప్రాంతాల్లో మహిళలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందట్లేదని షీలా ఖాంట్ అంటున్నారు.