శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 ఫిబ్రవరి 2021 (22:50 IST)

మిస్ ఇండియా రన్నరప్ మాన్యా సింగ్ గురించి తెలిస్తే?

మిస్ ఇండియా పోటీలు డబ్బులతో కూడిన వ్యవహారం. ఇక పేదలు ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపరు. కానీ ఉత్తరప్రదేశ్‌కి చెందిన మాన్యాసింగ్ మాత్రం అలా అందరిలా ఆలోచించలేదు. తన పేదరికం తన లక్ష్యానికి అడ్డు కారాదని, ఎలాగైనా సరే తాను మిస్ ఇండియా కిరీటం దక్కించుకోవాలని నిర్ణయించుకుంది. ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించింది. తాజాగా నిర్వహించిన మిస్ ఇండియా పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది. ఫీజు కోసం అమ్మ నగలు అమ్మేసింది. 
 
అయితే మాన్య విజయం సాధారణంగా రాలేదు. తాను ఈ విజయం సాధించేందుకు ఎన్నో కష్టాలు పడింది. మాన్య సింగ్ తన కల నెరవేర్చుకోవడానికి 14 ఏళ్ళ వయసులోనే రైలెక్కి ముంబైకి పారిపోయింది. 
 
మాన్యా తన గతాన్ని గుర్తు చేసుకుంటూ 'ముంబైకి వెళ్లగానే నేను చూసిన మొదటి ప్రదేశం పిజ్జా హట్. ఏదో ఒకవిధంగా అక్కడ పార్ట్ టైమ్ ఉద్యోగం, తాత్కాలిక వసతి పొందగలిగాను. రెండు రోజుల తరువాత, నా తల్లిదండ్రులు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. వారు నా కష్టాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. నేను నా లక్ష్యాన్ని చేరుకుంటానని వారికి భరోసా ఇచ్చాను. దాంతో వాళ్లు కూడా నాతో పాటే ముంబైలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. 
 
నా లక్ష్యం చేరుకోవడానికి సంపూర్ణ మద్దతుగా నిలిచి, నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించారు. కుటుంబ పోషణకు నా తండ్రి ఆటో నడిపేవాడు. ఆయనకి వచ్చే కొద్ది సంపాదనతో నన్ను అక్కడే మంచి పాఠశాలకు పంపారు. నేను కూడా చదువు కొనసాగిస్తూనే పార్ట్‌టైమ్ పనిచేశాను. తద్వారా నెలకు రూ .15,000 సంపాదించాను. నా కాలేజీ రోజుల్లో పదికి పైగా అందాల పోటీ ఆడిషన్స్‌లో పాల్గొన్నాను. ఆ తర్వాత వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా 2020 పోటీలకి ఎంపికయ్యా. 
 
ఈ పోటీల్లో ఫస్ట్- రన్నర్ అప్ గా నిలిచాను. ఎట్టకేలకు నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాను. నా తల్లిదండ్రులు నాకోసం పడ్డ కష్టం, వారు నాకు అందించిన సహకారం వల్లే ఇవాళ నేను ఈ గొప్ప విజయాన్ని సాధించగలిగాను' అని వివరించింది.