శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : బుధవారం, 14 ఆగస్టు 2019 (13:37 IST)

భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చినప్పుడు... ఆ సంబరాలకు దూరంగా గాంధీజీ ఏం చేస్తున్నారు?

భారత స్వాతంత్రోద్యమానికి మహాత్మా గాంధీ నేతృత్వం వహించారు. కానీ, దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినపుడు ఆ సంబరాలలో ఆయన పాల్గొనలేదు. స్వతంత్ర భారతదేశానికి సంబంధించిన పది ఆసక్తికరమైన విషయాలు.

 
1. మహాత్మాగాంధీ స్వతంత్రం లభించిన రోజున దిల్లీకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్‌లోని నోవాఖలీలో ఉన్నారు. అక్కడ ఆయన హిందూ, ముస్లింల మధ్య మత ఘర్షణలను అడ్డుకోడానికి నిరాహారదీక్ష చేస్తున్నారు.

 
2. ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వస్తుందనే విషయం పక్కాగా తెలియగానే జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్ భాయి పటేల్ మహాత్మాగాంధీకి లేఖ రాశారు. అందులో ఆగస్టు 15 మన మొదటి స్వతంత్ర దినోత్సవం అవుతుంది. మీరు జాతిపిత. ఇందులో పాల్గొని మీ ఆశీస్సులు అందించండి అని కోరారు.

 
3. గాంధీ ఆ లేఖకు సమాధానం ఇచ్చారు. అందులో కలకత్తాలోని హిందూ-ముస్లింలు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నప్పుడు నేను సంబరాలు జరుపుకోడానికి ఎలా రాగలను. ఈ ఘర్షణలు ఆపడానికి నేను నా ప్రాణాలైనా ఇస్తా అన్నారు.

 
4. జవహర్ లాల్ నెహ్రూ తన చారిత్రక ప్రసంగం 'ట్రిస్ట్ విత్ డెస్టినీ'ని ఆగస్టు 14న అర్థరాత్రి వైస్రాయ్ లాంజ్(ప్రస్తుత రాష్ట్రపతి భవన్) నుంచి ఇచ్చారు. నెహ్రూ అప్పటికి ప్రధానమంత్రి కాలేదు. ఆయన ప్రసంగాన్ని ప్రపంచమంతా విన్నది. కానీ, గాంధీ ఆరోజు 9 గంటలకే నిద్రపోయారు.

 
5. లార్డ్ మౌంట్‌బాటన్ 1947 ఆగస్టు 15న తన ఆఫీసులో పనిచేశారు. మధ్యాహ్నం నెహ్రూ ఆయనకు తన మంత్రిమండలి సభ్యుల జాబితాను అందించారు. తర్వాత ఇండియా గేట్ దగ్గర ప్రిన్సెస్ గార్డెన్‌లో ఒక బహిరంగ సభలో మాట్లాడారు.

 
6. ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం రోజున భారత ప్రధాన మంత్రి ఎర్రకోటపై జెండా ఎగరేస్తారు. కానీ, 1947 ఆగస్టు 15న మాత్రం అలా జరగలేదు. లోక్‌సభ సెక్రటేరియట్‌లోని పత్రాల ప్రకారం 1947 ఆగస్టు 16న నెహ్రూ ఎర్రకోటపై భారత జెండాను ఎగురవేశారు.

 
7. భారత అప్పటి వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్ ప్రెస్ సెక్రటరీ కాంప్‌బెల్ జాన్సన్ వివరాల ప్రకారం మిత్ర దేశాల సేనల ముందు జపాన్ లొంగిపోయి, 1947 ఆగస్టుకు రెండేళ్లైన సందర్భంగా భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలని నిర్ణయించారు.

 
8. ఆగస్టు 15 వరకూ భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖను నిర్ణయించలేదు. దానిని ఆగస్టు 17న రాడ్‌క్లిఫ్ లైన్‌గా ప్రకటించారు.

 
9. ఆగస్టు 15న భారతదేశానికి విముక్తి లభించింది. కానీ దేశానికి అప్పటివరకూ జాతీయ గీతం ఏదీ లేదు. జనగణమణ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లోనే రాసి ఉంచారు. అయితే, అది 1950లో జాతీయగీతం గౌరవాన్ని పొందింది.

 
10. ఆగస్టు 15న భారత్‌తోపాటు మరో మూడు దేశాలు కూడా స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయి. దక్షిణకొరియా జపాన్ నుంచి 1945 ఆగస్టు 15న స్వతంత్రం పొందింది. బహరీన్‌కు 1971 ఆగస్టు 15న బ్రిటన్ నుంచి విముక్తి లభించింది. కాంగో 1960 ఆగస్టు 15న ఫ్రాన్స్ నుంచి స్వాతంత్రం పొందింది.