మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : శనివారం, 5 అక్టోబరు 2019 (19:51 IST)

మనం ఎక్కువ కాలం ఎందుకు బతకడం లేదు?

ప్రజల జీవిత కాలం గత రెండు శతాబ్దాలుగా గణనీయమైన వేగంతో స్థిరంగా పెరుగుతూ వస్తోంది. 1840ల్లో ప్రజల జీవిత కాలం సగటున 40 సంవత్సరాలకు మించ లేదు. అప్పుడు.. విక్టోరియన్ యుగంలో పోషకాహారం, పరిశుభ్రత, గృహకల్పన, పారిశుద్ధ్యం మెరుగుపడుతూ రావటంతో.. 1900ల నాటికి జీవిత కాలం 60 సంవత్సరాల దగ్గరకు చేరుకుంది.
 
ఇరవయ్యో శతాబ్దం పురోగమిస్తుండగా - యుద్ధ సంవత్సరాలు మినహాయిస్తే - సార్వత్రిక ఆరోగ్య పరిరక్షణ, పిల్లలకు రోగనిరోధక టీకాలు అందించటం ప్రవేశపెట్టటంతో జీవన కాలం మరింత పురోగమించింది. ఇక 1970లు మొదలుకుని వైద్య రంగంలో.. ప్రత్యేకించి మెదడు పోటు, గుండె పోటు రోగులకు అందించే చికిత్సల్లో సాధించిన సాంకేతిక విజయాలతో ప్రజల ఆయుప్రమాణాలు మరింత వేగం పుంజుకున్నాయి.
 
ఇరవై ఒకటో శతాబ్దం ఆరంభం నాటికి జనన సమయంలో జీవన కాలపు అంచనా రేటు మహిళలకు 80 సంవత్సరాలు, పురుషులకు 75 సంవత్సరాలకు చేరుకుంది. ఇలా సగటు జీవన కాలానికి ప్రతి నాలుగేళ్లకు అదనంగా సుమారు ఒక సంవత్సరం చొప్పున చేరుతూ కొనసాగుతూ వచ్చింది. కానీ.. 2011 సంవత్సరంలో అకస్మాత్తుగా ఈ పెరుగుదల ఆగిపోయింది.
 
చిన్న అవరోధమా..? సుదీర్ఘ పరిణామమా..?
ఇది ఒక చిన్న అవరోధం కావచ్చునని నిపుణులు తొలుత భావించారు. కానీ.. 2015 సంవత్సరంలో మరణాల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రత్యేకించి చలికాలం ప్రాణాంతకంగా నిలిచింది. దీనికి కారణం.. ఓ రకం ఫ్లూ విస్తరించటమని చెప్పారు. అయితే.. అది చిన్న అవరోధం కాదని.. దానికన్నా పెద్ద అంశాలు ఉన్నాయని ఇప్పుడు స్పష్టమైంది.
 
ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ 2016-2018 సంవత్సరాలకు సంబంధించి విడుదల చేసిన తాజా గణాంకాలు.. ప్రతికూల వాతావరణాన్ని మినహాయించి గణించిన లెక్కలు. కొంత మెరుగుదల కనిపించినప్పటికీ.. అది అంతకుముందు చూసిన దానికన్నా చాలా చాలా తక్కువగా ఉంది. ప్రస్తుత పరిణామాలను బట్టి బ్రిటన్‌లో నివసిస్తున్న ప్రజల సగతు జీవిత కాలం మరొక ఏడాది పెరగాలంటే అందుకు 12 సంవత్సరాల కన్నా ఎక్కువ సమయం పడుతుంది.
 
దీనికి కారణాలేమిటి?
ఇన్ని సంవత్సరాలు సాధించిన పురోగతి అనంతరం.. మానవులు వారి జీవితకాలపు పై పరిమితికి చేరువవుతున్నారనేది ఒక వాదన. అధికారిక ధృవపత్రాలు ఉన్న మానవుల్లో అత్యధిక కాలం జీవించిన వ్యక్తి.. జీన్ కాల్మెంట్ అనే ఫ్రాన్స్ మహిళ. ఆమె చనిపోయేటప్పటికి ఆమె వయసు 122 సంవత్సరాలు. కానీ.. ఆమె చనిపోయి 20 సంవత్సరాలు దాటిపోయింది.
 
నేచర్ జర్నల్ ప్రచురించిన ఒక పరిశోధనలో.. జీన్ కాల్మెంట్ వంటి కొద్ది మంది అసాధారణ మానవులను మినహాయిస్తే.. మానవ జీవన కాల పరిమితి 115 సంవత్సరాలు అని చెప్తోంది. కానీ.. దీనితో విభేదిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అమెరికాకు చెందిన జన్యుశాస్త్రవేత్త డేవిడ్ సిన్‌క్లెయిర్ 'లైఫ్‌స్పాన్' (జీవన కాలం) అనే పుస్తకం రాశారు. దీర్ఘాయువుకు ముడిపడివున్న జన్యువులను బలోపేతం చేయటం ద్వారా మానవులు మరింత ఎక్కువ కాలం జీవించగలరని ఆ పుస్తకంలో వాదించారు. వాస్తవం ఏదైనప్పటికీ.. బ్రిటన్ ప్రజలు తమ జీవిత కాలపు పరిమితిని చేరుకోలేదని చెప్పటానికి చాలా ఆధారాలున్నాయి.
 
ఉదాహరణకు, ఇప్పటికే ఎక్కువ జీవిత కాలం ఉన్న జపాన్‌లో ఇటీవలి సంవత్సరాల్లో సగటు జీవిత కాలంలో బ్రిటన్ కన్నా ఎక్కువ పెరుగుదల కనిపించింది. ఓఎన్ఎస్ పరిశీలించిన సంపన్న దేశాల్లో జీవిత కాలం పెరుగుదల రేటు నెమ్మదించిన దేశాలు చాలా ఉన్నప్పటికీ.. అది బ్రిటన్ కన్నా ఇంకా తక్కువగా ఉన్న దేశం ఒకే ఒక్కటి ఉంది - అమెరికా.
 
అనేక సంక్లిష్ట అంశాలు...
ఈ పోకడ వెనుక అనేక ''సంక్లిష్ట'' అంశాలు ఉండొచ్చునని దీనిని పరిశోధించటానికి మరింత కృషి జరగాలని ఓఎన్ఎస్ వృద్ధాప్య నిపుణుడు ఎడ్వర్డ్ మోర్గన్ చెప్తున్నారు. పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ సంస్థ ఇప్పటికే కొంత కృషి జరిగింది. గత ఏడాది ప్రచురించిన ఆ సంస్థ నివేదికలో అనేక అంశాలను ముందుకు పెట్టింది. గత రెండు దశాబ్దాల్లో వైద్యం లేదా ఆరోగ్యం పరంగా భారీ మార్పుకు దోహదం చేసే ముందడుగు ఏదీ లేకపోవటం ఒక కారణంగా భావించవచ్చునని పేర్కొంది. ఒక వ్యాధిని జయించి దానివల్ల మరణాలు తగ్గుతుంటే.. దాని స్థానంలో మరొక జబ్బు వచ్చి చేరుతోంది.
 
గుండె పోట్లు, స్ట్రోక్‌లు, క్యాన్సర్లను తట్టుకుని బతుకుతున్న వారి సంఖ్య పెరుగుతుంటే.. దిమెన్షియా వల్ల మరణాల సంఖ్య పెరగటం మొదలైంది. ఆ వ్యాధిని నయం చేయటం సంగతి తర్వాత.. నియంత్రించటం కోసమే వైద్య సమాజం తంటాలు పడుతోంటే.. మానవ జీవిత కాలం కుంటుపడింది. పొదుపు చర్యల ప్రభావం గురించి కూడా పీహెచ్‌చీ నివేదిక ప్రస్తావించింది. ఈ అంశం పాత్ర ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ సలహాదారు ప్రొఫెసర్ మైఖేల్ మార్మోట్ అప్పటికే పేర్కొన్నారు.
 
జీవన కాలం పెరగుదల రేటు తగ్గిపోవటం అత్యధికంగా నిరుపేద ప్రజల్లోనే ఉందని ఆధారాలు చెప్తున్నాయి. ఆరోగ్య పరిరక్షణ, వైద్యం, సంక్షేమ వ్యయాలను తగ్గించటం వల్ల వారి మీద ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందనేది వాస్తవం. ఇది.. జీవన కాలం పెరుగుదల రేటు మీద ప్రభుత్వ వ్యయం పాత్ర ఉందని సూచిస్తున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. అయితే.. ఆ నివేదిక ఎటువంటి నిర్ధారణకూ రాలేదు. కానీ.. ఈ పరిస్థితి ఎంత ఎక్కువ కాలం కొనసాగితే.. దీనికి జవాబు కనుక్కోవాల్సిన అవసరం అంత ఎక్కువగా పెరుగుతుందనేది వాస్తవం.